శ్రీకాకుళం నుంచి లేడీ డైరెక్ట‌ర్!

తాజాగా శ్రీకాకుళం జిల్లా నుంచి మరో కొత్త ప్రతిభ వెండితెరపై మెరిసేందుకు సిద్ధమైంది.;

Update: 2026-03-25 06:31 GMT

కళలకు పురిటిగడ్డ ఉత్తరాంధ్ర ప్రాంతం. తాజాగా శ్రీకాకుళం జిల్లా నుంచి మరో కొత్త ప్రతిభ వెండితెరపై మెరిసేందుకు సిద్ధమైంది. అపారమైన జానపద కళాకారులు, నటీనటులు ఉన్న ఈ ప్రాంతం నుండి ఇప్పటికే ఎందరో ఇండస్ట్రీకి పరిచయమైనా దర్శకత్వ శాఖలో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ. ఈ తరుణంలో శ్రీకాకుళం మట్టి నుంచి వచ్చిన మానస శర్మ 'రాకస' అనే వెరైటీ కాన్సెప్ట్ చిత్రంతో మెగాఫోన్ పట్టడం టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. తెలుగు సినీ పరిశ్రమలో మహిళా దర్శకుల సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.

విజయనిర్మల సృష్టించిన రికార్డుల తర్వాత బి.జయ, నందినీ రెడ్డి, సుధా కొంగర వంటి అతికొద్ది మంది మాత్రమే ఇక్కడ నిలదొక్కుకోగలిగారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఐదుగురు మహిళా దర్శకులు కూడా యాక్టివ్‌గా లేని తరుణంలో మానస శర్మ వంటి యువతి ఒక పవర్‌ఫుల్ టైటిల్‌తో ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఆమె ధైర్యం , మేకింగ్ స్టైల్‌పై ఇప్పటికే ఫిలిం నగర్ వర్గాల్లో పాజిటివ్ చర్చ నడుస్తోంది. మానస శర్మ దర్శకత్వం వహించిన 'రాకస' చిత్రం కేవలం కమర్షియల్ సినిమా మాత్రమే కాదు. కథాబలం ఉన్న చిత్రంగా కనిపిస్తోంది.

శ్రీకాకుళం వంటి ప్రాంతం నుంచి వచ్చిన ఆమెకు ఆ నేటివిటీపై పట్టు ఉండటం అదనపు బలం. స్థానిక కళాకా రులను, అక్కడి జీవనశైలిని భ‌విష్య‌త్ సినిమాలో ప్రతిబింబించేలా ప్లాన్ చేసే అవ‌కాశం లేక‌పోలేదు. ఒక మహిళగా యాక్షన్ , సీరియస్ డ్రామాను డీల్ చేయడం సవాలుతో కూడుకున్న పని అయినప్పటికీ ఆమె ఆ సవాలును స్వీకరించి సినిమాను పూర్తి చేశారు. `రాకస` పూర్తిగా వినోదం హార‌ర్ అంశాలు ఆధారంగా తెర‌కెక్కించిన చిత్రం. అయితే దర్శకురాలిగా మానస శర్మ ఇండస్ట్రీలో ఎంతవరకు నిలదొక్కుకుంటుంది? అన్నది అసలైన ప్రశ్న.

మొదటి సినిమాతోనే తన ముద్ర వేయగలిగితే ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. ముఖ్యంగా మేల్ స్టార్ డైరెక్టర్ల హవా నడుస్తున్న కాలంలో ఒక లేడీ డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలంటే ఆమె ఎంచుకున్న స్క్రీన్ ప్లే , మేకింగ్ వాల్యూస్ అత్యంత‌ కీలకం కానున్నాయి. `రాకస` చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే మరికొంత మంది మహిళా దర్శకులకు స్ఫూర్తిగా నిలుస్తారు. జానపద కళలకు పెట్టింది పేరైన శ్రీకాకుళం నుంచి వచ్చిన ఈ లేడీ డైరెక్టర్ మెగాఫోన్ పట్టుకుని ఏ స్థాయికి చేరుతుందో చూడాలి. మానస డైరెక్ట‌ర్ కాక‌ముందు ఓ చిన్న ఫ్యామిలీ స్టోరీకి క్రియేటివ్ రైట‌ర్ గా ప‌నిచేసింది. అనంత‌రం `చెంచ్ లైఫ్` అనే మ‌రో సిరీస్ చేసింది. నాల్గ‌వ ప్రాజెక్ట్ తో ద‌ర్శ‌కురాలిగా ఎంట్రీ ఇస్తోంది. తాను ఏ సినిమా చేసినా అందులో వినోదం ప్ర‌ధానంగా ఉండేలా చూసుకుంటానంది.

Tags:    

Similar News