2025 లో ముచ్చటగా మూడవ సారి!
మాలీవుడ్ స్టార్ మమ్ముట్టి మూడు షిప్టులు పనిచేసే నటుడు. ఏడాదికి ఆరేడు సినిమాలైనా రిలీజ్ అయ్యేలా చూసుకుంటారు.;
మాలీవుడ్ స్టార్ మమ్ముట్టి మూడు షిప్టులు పనిచేసే నటుడు. ఏడాదికి ఆరేడు సినిమాలైనా రిలీజ్ అయ్యేలా చూసుకుంటారు. అయితే గత కొంత కాలంగా ఆయనా సినిమాల స్పీడ్ తగ్గించారు. సినిమాల బడ్జెట్ పెరగడం? క్వాలిటీ కంటెంట్ అందించే క్రమంలో రెండు..మూడు సినిమాలు చేసినా? అవి మంచి సినిమాలుగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత ఆదారేళ్లగా మునుపటిలా సినిమాలు చేయడం లేదు. కథల విషయం లోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 2023 లో మమ్ముట్టి నటించిన నాలుగు సినిమాలే రిలీజ్ అయ్యాయి.
వేగం తగ్గించిన స్టార్ హీరో:
అటుపై మరుసటి ఏడాది కేవలం మూడు సినిమాలకే పరిమితమయ్యారు. తాజాగా 2025 లో కూడా మూడు సినిమాలే రిలీజ్ లెక్కలో తేలాయి. ఏడాది ఆరంభంలో గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన 'డొమినిక్ అండ్ ది లేడీస్' పర్స్ లో నటించారు. ఆ చిత్రం జనవరి లో రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా ఆశించిన ఫలితాలు సాధించలేదు. అటుపై డీనో డెన్నిస్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ 'బజూకా' ఏప్రిల్ లో రిలీజ్ అయింది. ఇదీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన యాక్షన్ థ్రిల్లర్. కానీ వాటిని అందుకోలేకపోయింది.
2024-25 లో ఒకేలా రిలీజ్ లు:
త్వరలో జితిన్ .కె జోస్ దర్శకత్వం వహించిన 'కలాంకావల్' రిలీజ్ కానుంది. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణం వాయిదా పడుతోంది. డిసెంబర్ 5న రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాకు మమ్ముట్టి నిర్మాతగా కూడా వ్యవ హరిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ తో 2025 లో మమ్ముట్టి నటించిన మూడవ చిత్రంగా నిలిచింది. దీంతో మమ్ముట్టి సినిమాల స్పీడ్ ఎంతగా తగ్గించారు? అన్నది మరోసారి తేటతెల్లమవుతోంది.
చేతల్లో సాధ్యమయ్యేదెప్పుడు?
ప్రస్తుతం మమ్ముట్టి వయసు 73 ఏళ్లు అయినా? ఏడాదికి మూడు సినిమాలైనా రిలీజ్ చేస్తున్నారంటే? అది గొప్ప విషయమే. యంగ్ హీరోలే ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయాలంటే కిందా మీదా పడుతున్నారు. ఇప్పటి జనరేషన్ హీరోలకు మూడు షిప్టులు పని చేయడం అంటేనే తెలియదు. సినిమా పేరుతో సంవత్సరాలు సమయం తీసుకుంటున్నారు. తీరా రిలీజ్ తర్వాత అదేమైనా గొప్ప కళాఖండమా? అంటే అదీ కనిపించదు. ఈ కారణంగా నిర్మాతలు ఎక్కువగా నష్టపోతున్నారు అన్నది కాదనలేని నిజం. మాలీవుడ్ , శాండిల్ వుడ్ మినహా మిగతా అన్ని పరిశ్రమల్లోనూ ఇదే సన్నివేశం కనిపిస్తోంది. ఏడాదికి ఒక సినిమా రిలీజ్ అన్నది కూడా మాటల వరకే పరిమితం తప్ప చేతల్లో సాధ్యం కావడం లేదు.