అసలు ఎవరైనా సినిమా రంగానికి ఎందుకు వస్తారో తెలుసా?
సినిమా అనేది వ్యాపారం.. దయా ధర్మం కాదు అని అన్నారు దర్శకనిర్మాత మధురా శ్రీధర్. ఈ రంగంలో సక్సెసవ్వకపోతే వదిలేసి వెళ్లిపోవాలని, ఇలా ఆవేదనతో మైకుల ముందుకు రాకూడదని అన్నారు.
సినిమా అనేది వ్యాపారం.. దయా ధర్మం కాదు అని అన్నారు దర్శకనిర్మాత మధురా శ్రీధర్. ఈ రంగంలో సక్సెసవ్వకపోతే వదిలేసి వెళ్లిపోవాలని, ఇలా ఆవేదనతో మైకుల ముందుకు రాకూడదని అన్నారు. అన్ని ఇండస్ట్రీల్లాగే ఇక్కడా సక్సెస్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఒత్తిళ్లు ఉంటాయి. నిలబడితే మళ్లీ సినిమా తీయాలి. కుదరకపోతే వేరే వ్యాపారాలు చేసుకోవాలని కూడా సలహాలిచ్చారు. అంతేకాదు.. ఇదేదో అంతర్జాతీయ సమస్యలా.. ప్రపంచ సంక్షోభంలా బిల్డప్ కూడా ఇస్తున్నారని మధురా శ్రీధర్ అన్నారు.
అయితే దీనిపై జర్నలిస్టుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నిజానికి కళారంగానికి వచ్చేవాళ్లు ఎవరూ కేవలం డబ్బు సంపాదన అనే ఆలోచనతోనే రారు. కళతో వారి జీవితం పెనవేసుకుని ఉంటుంది. చావైనా బతుకైనా ఇక్కడే అనుకున్న తర్వాతే వస్తారు. అలా కాకుండా కేవలం వ్యాపారం లాభం చూసుకునేందుకు వచ్చిన వాళ్లు మాత్రమే మధురా శ్రీధర్ చెప్పినట్టుగా ఇండస్ట్రీ నుంచి ఎగ్జిట్ అవుతారని ఒక ప్రముఖ క్రిటిక్ అభిప్రాయపడ్డారు. కళ కోసం మాత్రమే ఇక్కడ చావో రేవో తేల్చుకునేందుకు వస్తుంటారు చాలా మంది. వాళ్లు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ రంగంలోనే చివరివరకూ పోరాడుతుంటారు. సినీ కుటుంబాలలో మూడు నాలుగు తరాలు పరిశ్రమకే అంకితమైపోయిన వారున్నారు. వారికి డబ్బు ప్రధానం కాదు. ఈ రంగంతో మమేకమవ్వడం సంతృప్తినిస్తుంది. కేవలం 5-10 శాతం మాత్రమే సక్సెస్ ఉన్న ఈ పరిశ్రమలో ఫెయిల్యూర్ వచ్చినా తిరిగి ఇక్కడే పెట్టుబడి పెట్టేవాళ్లను రెగ్యులర్ గా చూస్తుంటాం.
అయితే కళారంగంలో సుదీర్ఘ కాలం కొనసాగిన వ్యక్తిగా మధురా శ్రీధర్ అన్న మాటలు పరిశ్రమ వ్యక్తులకు కొంత బాధ కలిగించి ఉండొచ్చు. నిజానికి కళారంగంతో అనుబంధం కేవలం డబ్బుతో ముడిపడినది కాదని చాలా మంది చెబుతుంటారు. డబ్బు అవసరమే కానీ, అదే జీవిత కాదు! కళతో వచ్చే కిక్కు వేరు. ఈ రంగంలో సంపాదన ఇచ్చే కిక్కు ఎంతో గొప్పగా ఉంటుందని చాలా మంది చెబుంటారు. అందుకే ప్రపంచంలో ఎక్కడెక్కడో సంపాదించుకుని సినీరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తుంటారు. చివరకు దక్షిణాఫ్రికా గోల్డ్ మైన్స్ లో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలు కూడా టాలీవుడ్ లో సినిమాలు తీసారు. ఆంధ్రాయూనివర్శిటీ ప్రొఫెసర్లు, ఛాన్సలర్లు కూడా తెలుగు చిత్రసీమకు వచ్చి సినిమాలు తీసారు. వారంతా డబ్బు కోసం రాలేదు. కళపై మక్కువతో నటులుగానో, నిర్మాత లేదా దర్శకుడిగా తమ పేరును తెరపై చూసుకోవాలనే ఆసక్తితో వచ్చినవారే ఎక్కువ.
కేవలం సినీరంగంలో స్థిరపడిన వారే కాదు... రాజకీయ రంగం, క్రీడా రంగం నుంచి ఎందరో ప్రముఖులు సినీరంగంలో పెట్టుబడులు పెట్టిన వారే. వీరంతా లాభాల కోసం కాదు.. కళపై మక్కువతో మాత్రమే పెట్టుబడులు పెడుతున్నారు. జీవితాంతం నష్టాలొచ్చినా ఫిలింఛాంబర్ చుట్టూనే తిరుగుతుంటారు. అంతటి మత్తు- మహత్తు కేవలం గ్లామర్ రంగంతోనే సాధ్యం. కానీ ఇది వ్యాపార రంగం మాత్రమే. దయతో చేసేది కాదు! అని మధురా శ్రీధర్ లాంటి అనలిస్ట్ ముఖ్యంగా సినిమా వ్యక్తి అనడం కొంత విడ్డూరమే. సోషల్ మీడియాల్లో మధురా శ్రీధర్ మాటలను కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ప్రస్తుతం ఒక సునిశితమైన డిబేట్ నడుస్తోంది.
సంపాదించుకోవడానికి చాలా రంగాలు ఉన్నాయి. సినీపరిశ్రమ వ్యక్తులు చాలా మంది బయటి వ్యాపారాల ద్వారానే సంపాదించి ఇక్కడ పెట్టుబడులు పెట్టి తమ ఆత్మ సంతృప్తి కోసం ఇక్కడే కొనసాగుతుంటారు. అక్కడ లాభాలు తెచ్చి ఇక్కడ నష్టపోతూనే ఉంటారు. అయినా దీనికి ఫీలవ్వరు.. బాధల్లోకి వెళ్లిపోరు. ఈ రోజు థియేటర్ల సమస్య తాత్కాలికమైనది. ఇక్కడ దశాబ్ధాల పాటు ఉన్నా ఏదీ సాధించకపోయినా కళారంగం చుట్టూ ఉండే సువాసనను, పరిమళాన్ని ఆస్వాధించడమే ధ్యేయంగా కళాత్మక మనుషులు సంచరిస్తుంటారు.