చావుకు ముందే ముహూర్తం.. ఈ గాయ‌కుడి తెగువే వేరు!

ప్రముఖ ఇండిపెండెంట్ గాయకుడు, బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ లక్కీ అలీ (67) ఇటీవల ఒక లైవ్ కాన్సర్ట్‌లో మరణం గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురిచేశాయి.

Update: 2026-08-11 03:00 GMT

ప్రముఖ ఇండిపెండెంట్ గాయకుడు, బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ లక్కీ అలీ (67) ఇటీవల ఒక లైవ్ కాన్సర్ట్‌లో మరణం గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురిచేశాయి. 90ల కాలంలో `ఓ సనమ్`వంటి ఎవర్ గ్రీన్ పాటలతో దేశవ్యాప్తంగా శ్రోతలను ఊపేసిన ఈ దిగ్గజ గాయకుడు తనకు మరణం విష‌యంలో ఎలాంటి భయం లేదని స్పష్టం చేశారు. తాను ఎక్కడికి ప్రయాణించినా ఎల్లప్పుడూ శవవస్త్రాన్ని (కఫన్-ఇహ్రామ్) తనతో పాటు తీసుకెళ్తానని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

కాన్సర్ట్ వేదికపై అభిమానుల నుంచి లభించే ప్రేమాభిమానాల గురించి మాట్లాడుతూ.. ఒకరోజు మనమందరం ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిందేనని.. తాను మాత్రం ఆ నిజానికి ఎప్పుడో సిద్ధపడ్డానని ఆయన చెప్పారు. తాను ప్రయాణించేటప్పుడు ఈజిప్షియన్ కాటన్ శవవస్త్రమైన `ఇహ్రామ్`ను దగ్గర ఉంచుకుంటానని.. తాను ఎక్కడ చనిపోతే అక్కడి నుంచే తనను సాగనంపాలని వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్రంగా కలవరపడిన అభిమానులు, ఆయనకు సుదీర్ఘమైన ఆరోగ్యకరమైన ఆయుష్షును ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

కహో నా ప్యార్ హై, యువ, బచ్నా ఏ హసీనో, తమాషా' వంటి ఎన్నో హిట్ సినిమాలకు సూపర్ హిట్ పాటలు పాడిన లక్కీ అలీ 2015 తర్వాత బాలీవుడ్ పరిశ్రమకు ఎందుకు దూరమయ్యారో కూడా వివరించారు. తన తండ్రి, ప్రముఖ నటుడు మెహమూద్ మరణం తర్వాత బాలీవుడ్‌లో తనకంటూ ఏమీ మిగల్లేదని.. అక్కడ తనకు స్నేహితులు కూడా లేరని పేర్కొన్నారు. పరిశ్రమలో ఉన్న రొటీన్ వర్క్ పరిమితుల వల్ల కాకుండా... తనదైన శైలిలో స్వతంత్రంగా సంగీతాన్ని సృష్టించాలనే ఉద్దేశంతోనే ప్రధాన స్రవంతి సినిమాలకు దూరమైనట్లు వెల్లడించారు.

మరోవైపు తన వ్యక్తిగత జీవితం.. మూడు వివాహాల గురించి లక్కీ అలీ ఎంతో ముక్కుసూటిగా మాట్లాడారు. మేఘన్ జేన్ మెక్‌క్లారీ, ఇనయా, మరియు కేట్ ఎలిజబెత్ హల్లామ్‌లతో జరిగిన తన మూడు పెళ్లిళ్లు కూడా నిలబడలేకపోయినా.. తన మాజీ భాగస్వాములందరితో ఇప్పటికీ మంచి అనుబంధం ఉందన్నారు. జీవితాన్ని ఒకే భాగస్వామితో ప్రారంభించి ముగించాల్సిన అవసరం లేదని... విడిపోయినప్పటికీ ఒకరికొకరం ఎప్పుడూ తోడుగా ఉంటామని స్పష్టం చేశారు.

తన పిల్లల బాధ్యతలను ఎప్పుడూ నెరవేరుస్తూ... కేవలం ప్రేమ ద్వారానే పిల్లలను సరైన మార్గంలో పెంచవచ్చని లక్కీ అలీ నమ్ముతారు. ఆరు పదుల వయసు దాటినా కూడా తన విలక్షణమైన గొంతుతో.. స్వేచ్ఛాయుతమైన ఆలోచనలతో కోట్లాది మంది హృదయాలను ఆకట్టుకుంటున్న ఈ గాయకుడి వ్యాఖ్యలు ఇప్పుడు సంగీత ప్రపంచంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి.

Tags:    

Similar News