ఆస్ప‌త్రి ఎపిసోడ్స్‌తో ఎమోష‌న్ ర‌గిలిస్తాడా?

ఓవైపు భ‌యంక‌ర‌మైన యుద్ధం.. మ‌రోవైపు మ‌ర‌పు రాని అద్భుత‌ ప్రేమ‌క‌థ.. ఈ సినిమా ప్ర‌త్యేక‌త‌.;

Update: 2025-07-20 21:30 GMT

పద్మావ‌త్ లాంటి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ ని తెర‌కెక్కించిన సంజ‌య్ లీలా భ‌న్సాలీ గంగూభాయి క‌థియావాడీ, హీరా మండి లాంటి క్లాసిక్స్ తో చ‌ర్చ‌ల్లో నిలిచారు. కానీ అత‌డి నుంచి సిస‌లైన పాన్ ఇండియా హిట్ ఇంకా రాలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఉంది. అయితే ఈ అసంతృప్తి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అభిమానుల‌కు అత‌డు 'లవ్ అండ్ వార్' రూపంలో భారీ ట్రీట్ ని సిద్ధం చేస్తున్నాడ‌ని అంతా భావిస్తున్నారు.

ఓవైపు భ‌యంక‌ర‌మైన యుద్ధం.. మ‌రోవైపు మ‌ర‌పు రాని అద్భుత‌ ప్రేమ‌క‌థ.. ఈ సినిమా ప్ర‌త్యేక‌త‌. ప్ర‌తి సీన్ లో ఎమోష‌న్‌ని డ్రైవ్ చేస్తూ ప్రేక్ష‌కులకు కుర్చీ అంచుకు జారిపోయేంత‌గా సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ ని భ‌న్సాలీ తెర‌కెక్కిస్తున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇప్పుడు సినిమాలో అత్యంత కీల‌క‌మైన హాస్పిట‌ల్ ఎపిసోడ్ ని 20 రోజుల పాటు సెట్ల‌లో తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలిసింది. దీనికోసం ఇప్ప‌టికే ముంబైలో భారీ సెట్ల‌ను రెడీ చేస్తున్నారు. ఆస్ప‌త్రి సీన్ లో ర‌ణ‌బీర్- ఆలియా- విక్కీ కౌశ‌ల్ త‌దిత‌ర తారాగ‌ణం పాల్గొంటారు. ముగ్గురు ప్ర‌ధాన తారాగ‌ణంతో ఆస్ప‌త్రి స‌న్నివేశాలు అంటే అత్యంత ఉద్విగ్న‌త‌ను పెంచే క్ష‌ణాల‌కు సంబంధించిన‌ స‌న్నివేశాలు రూపొందిస్తార‌ని భావిస్తున్నారు. ఇది ర‌ణ‌బీర్- ఆలియా- విక్కీ న‌డుమ ముక్కోణ ప్రేమ‌క‌థ‌ను ఎలివేట్ చేస్తుందా? అనే ప్ర‌శ్న‌కు ఇంకా స‌మాధానం లేదు.

ప్ర‌స్తుతం భారీ సెట్ల నిర్మాణాన్ని భ‌న్సాలీ స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని తెలిసింది. సెట్ డిజైన్లు స‌హా ఎలాంటి స‌మాచారం బ‌య‌ట‌కు రాకుండా గోప్యంగా ఉంచుతున్నార‌ని తెలుస్తోంది. ముంబైలో చిత్రీకరణ తర్వాత త‌దుపరి షెడ్యూల్ కోసం భ‌న్సాలీ టీమ్ రోమ్ కు వెళుతుంది. ఈ సినిమాలో న‌టిస్తున్న ఇత‌ర తారాగ‌ణం వివ‌రాల్ని కూడా ఇంకా వెల్ల‌డించాల్సి ఉంది. గ్రిప్పింగ్ టీజ‌ర్, ట్రైల‌ర్ తో ల‌వ్ అండ్ వార్ కి భ‌న్సాలీ హైప్ తేవాల్సి ఉంటుంది. మునుప‌టి స్లో ఫేస్ సినిమాల‌తో పోలిస్తే ఈసారి భ‌న్సాలీ కొత్త‌గా ట్రై చేస్తున్నార‌ని, అత‌డు బ్లాక్ బ‌స్ట‌ర్ కొడ‌తాడ‌ని అంతా భావిస్తున్నారు.

Tags:    

Similar News