‘సతీ లీలావతి’ మూవీ రివ్యూ
పెళ్లి తర్వాత సినిమాల నుంచి కొంచెం గ్యాప్ తీసుకున్న లావణ్య త్రిపాఠి.. తర్వాత నటించిన చిత్రం ‘సతీ లీలావతి’.;
‘సతీ లీలావతి’ మూవీ రివ్యూ
నటీనటులు: లావణ్య త్రిపాఠి- దేవ్ మోహన్- మడోన్నా సెబాస్టియన్- నరేష్- పవిత్ర- సప్తగిరి- మొట్ట రాజేంద్రన్ తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
ఛాయాగ్రహణం: బినేంద్ర మేనన్
మాటలు: ఉదయ్ పొత్తిపాడు
నిర్మాత: నాగమోహన్
కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: తాతినేని సత్య
పెళ్లి తర్వాత సినిమాల నుంచి కొంచెం గ్యాప్ తీసుకున్న లావణ్య త్రిపాఠి.. తర్వాత నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఆమెకు జోడీగా నటించాడిందులో. ఎస్ఎంఎస్.. భీమిలి కబడ్డీ జట్టు చిత్రాల దర్శకుడు తాతినేని సత్య రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే థియేటర్లలోకి దిగింది. మరి ఈ సినిమా లావణ్యకు ఎలాంటి ఫలితాన్నిచ్చేలా ఉందో చూద్దాం పదండి.
కథ: లీల (లావణ్య త్రిపాఠి) ఒక దర్శకురాలు. ఎప్పుడూ గొడవ పడుతూ ఉండే తన తల్లిదండ్రులను చిన్నతనం నుంచి చూస్తూ వచ్చిన లీల.. తనకు కాబోయే వాడితో సంతోషంగా గడపాలనుకుంటుంది. అనాథ అయిన సేతుపతి (దేవ్ మోహన్)ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె.. తొలి ఏడాది తర్వాత పనిలో పడి భర్తను పట్టించుకోదు. దీంతో అతను మరో అమ్మాయి ఆకర్షణలో పడి లీల నుంచి విడాకులు తీసుకోవడానికి సిద్ధపడతాడు. ఐతే భర్త విడాకులు అడగ్గానే లీల తనలోని విధ్వంసక కోణాన్ని బయటపెడుతుంది. లీలలోని ఈ కోణాన్ని చూశాక సేతుపతి ఎలా స్పందించాడు.. ఇద్దరి మధ్య ఘర్షణ ఎక్కడిదాకా వెళ్లింది.. చివరికి వీళ్లిద్దరూ కలిసి ప్రయాణం సాగించారా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ: సతీ లీలావతి.. ఈ టైటిల్ చెప్పగానే 90వ దశకంలో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ బాలు మహేంద్ర రూపొందించిన క్లాసిక్ కామెడీ గుర్తుకు వస్తుంది. ఇలాంటి టైటిల్ పెట్టాలంటే ఆ స్థాయిలో కాకపోయినా.. దానికి కాస్తయినా దగ్గరగా నిలవగలిగే కథాకథనాలు రాసుకుని ఉండాలి. తెరపై ఒక మోస్తరుగా అయినా డ్రామాను-నవ్వులను పండించగలగాలి. కానీ ఈ కొత్త ‘సతీలీలావతి’లో అంత స్థాయిలో లేవు. కమల్ క్లాసిక్ మూవీని గుర్తు చేసే కాన్సెప్టే తీసుకున్నారు కానీ.. బలం లేని పాత్రలు.. వాటి మధ్య కుదరని ఎమోషన్.. పెద్దగా నవ్వు రాని కామెడీ.. అయోమయంగా సాగే కథనంతో ‘సతీ లీలావతి’ అంత మెప్పించదు . చెప్పాలనుకున్న పాయింట్ అర్థం కాని విధంగా గందరగోళంగా సాగే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
పెళ్లయిన కొన్నేళ్లకు భార్య మీద మోజు తీరి మరో అమ్మాయి ప్రేమలో పడే భర్త కథతో తెరకెక్కిన సినిమా పాత ‘సతీలీలావతి’. అందులో భార్య పాత్ర అంత చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదు. కొత్త ‘సతీలీలావతి’లో కూడా పెళ్లయిన కొన్నేళ్లకు భార్య నుంచి విడిపోవాలనుకునే భర్తను పాత్రను చూస్తాం. కాకపోతే ఇప్పటి కాలానికి అనుగుణంగా భార్యను గడుసుదానిలా చూపించారు. ఆమె పాత్రనే హైలైట్ చేయడానికి ప్రయత్నించారు. ఆమె గడుసుదనం ఏ స్థాయిలో ఉంటుందంటే.. తన నుంచి విడిపోతానని భర్త అనడం ఆలస్యం అతడి మీద పాశవిక దాడి చేస్తుంది. తనను ఒక గదిలో బంధించి పడేస్తుంది. ఆ తర్వాత అతడిలో ఆ భార్య ఎలా పరివర్తన తీసుకొచ్చిందనే నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఐతే ఆ పాయింట్ మీద కుదురుగా కథ నడిచి ఉంటే.. ఇదొక మంచి ఎమోషనల్ డ్రామా అయ్యుండేది. కానీ అసలు విషయం మీద ఫోకస్ పెట్టలేదు. మధ్యలో అవసరం లేని పాత్రలన్నీ వస్తుంటాయి. వాటి మీద గందరగోళంగా.. ఏ పర్పస్ లేకుండా సన్నివేశాలు నడుస్తుంటాయి. ఏ పాత్రకు ఎందుకు కథలోకి వస్తోందో.. దాని ఉద్దేశమేంటో అర్థం కాదు.
పెళ్లయిన కొన్నేళ్లకు భార్యాభర్తల మధ్య అపార్థాలు రావడం.. ఇద్దరి మధ్య దూరం పెరగడం చాలామందిలో జరిగేదే. ఇద్దరిలో ఒకరు మరొకరిని అశ్రద్ధ చేసినా.. లేదా ఒకరు ఇంకొకరిని అపార్థం చేసుకున్నా.. అవతలి వ్యక్తికి తన తప్పేంటో తెలిసేలా చెయ్యడానికి కొన్ని మార్గాలు ఉంటాయి. ఏ మార్గం ఎంచుకున్నా తెర మీద అవతలి పాత్ర మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా కన్విన్స్ అయ్యేలా పరిష్కారం చూపించాలి. కానీ 'సతీ లీలావతి'లో తన నుంచి విడిపోవాలని అనుకునే భర్తను మార్చడానికి హీరోయిన్ ఎంచుకునే మార్గం సిల్లీగా అనిపిస్తుంది. ఈ దశలోనూ ఆమె భర్తలో పరివర్తన తెచ్చేలా తన ప్రవర్తన ఉండదు. ఆ క్యారెక్టర్ని చూస్తే భర్త ఆమె నుంచి విడిపోవడం కరక్టే అని ఆడియన్సుకి అనిపిస్తుంది. భార్య వ్యవహారం ఇలా ఉంటే భర్తది ఇంకా విచిత్రమైన క్యారెక్టర్. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా అంటాడు. మళ్ళీ ప్రేమ కురిపిస్తాడు. అంతలోనే తూచ్ అంటాడు. సినిమా అంతా భార్యతో నువ్వు వద్దే వద్దు అన్నవాడు.. చివర్లో ఏవో నాలుగు ఎమోషనల్ డైలాగులు చెప్పేయగానే కరిగిపోతాడు. వీళ్లిద్దరి మధ్యలోకి వచ్చే ప్రేయసి పాత్ర సైతం ఇంతే అయోమయంగా అనిపిస్తుంది. సినిమా నిండా బోలెడన్ని పాత్రలు ఉంటాయి కానీ.. ఇలాగే ఒక్కదానికి కూడా ఒక తీరు తెన్ను ఉండదు. ఎక్కడా పాత్రల మధ్య కానీ.. కథలో కానీ ఎమోషన్ వర్కవుట్ కాక కంగాళీగా తయారైంది సతీ లీలావతి. సెకండాఫ్ లో కొన్ని కామెడీ సీన్లు ఒక మాదిరిగా అనిపిస్తాయి. క్లైమాక్స్ పర్వాలేదు.
నటీనటులు: లీల పాత్రలో లావణ్య త్రిపాఠి బాగా పెర్ఫామ్ చేసింది. అల్లరి సన్నివేశాల్లోనే కాక ఎమోషనల్ సీన్స్ లోనూ ఆమె బాగా నటించింది. నటనలో గ్యాప్ తర్వాత ఆమె కొంచెం బబ్లీగా తయారైంది. దేవ్ మోహన్ చూడ్డానికి బావున్నాడు. నటన విషయంలోనూ ఆకట్టుకున్నాడు. తన తెలుగు డబ్బింగ్ కూడా బాగానే సాగింది. ప్రేమమ్ ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ మలయాళి అమ్మాయిగా తనకు సూట్ అయ్యే పాత్రలో కనిపించింది. నరేష్ టాలెంటుకు తగ్గ పాత్ర పడలేదు. సప్తగిరి కాసేపు నవ్వించాడు. వీటీవీ గణేష్ ను దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదు. మొట్ట రాజేంద్రన్.. మిగతా ఆర్టిస్టులు పర్వాలేదు.
సాంకేతిక వర్గం: 'సతీ లీలావతి'లో సాంకేతిక నిపుణుల పనితీరు మెప్పిస్తుంది. మిక్కీ జే మేయర్ పాటలు తన స్థాయికి తగ్గట్లు లేవు కానీ.. సందర్భానికి తగ్గట్లు బాగానే కుదిరాయి. పెళ్లి పాట మంచి హుషారు పుట్టిస్తుంది. కెమెరామన్ బినేంద్ర మేనన్ మంచి విజువల్స్ తో ఆకట్టుకున్నాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కథకు తగ్గట్లు ఖర్చు పెట్టారు. ఉదయ్ కొన్ని చోట్ల సంభాషణల్లో డెప్త్ చూపించాడు. కథకుడు - దర్శకుడు తాతినేని సత్య ఎంచుకున్న కాన్సెప్ట్ మంచిదే. కానీ కథను ఒక తీరుగా చెప్పడంలో అతను ఫెయిలయ్యాడు. అతను కథను మొదలుపెట్టిన విధానమే అంత ఆసక్తికరంగా లేదు. నరేషన్ ఆద్యంతం గందరగోళంగా సాగింది. సెకండాఫ్ లో కొంత మేర ఎంటర్టైన్మెంట్ పండించినా.. అది సరిపోలేదు.
చివరగా: సతీ లీలావతి.. పేరు గొప్ప
రేటింగ్-2.25/5