సతీ లీలావతి: కామెడీ బావుందని చరణ్ ప్రశంస.. పవన్ కోసం స్పెషల్ షో ప్లాన్!
ట్రైలర్ చూసిన తర్వాత రామ్ చరణ్ స్పందన గురించి లావణ్య ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.;
మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం `సతీ లీలావతి` విడుదలకు సిద్ధమైంది. మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవ్ మోహన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ నిర్మించారు. `భీమిలీ కబడ్డీ జట్టు`, `ఎస్‌ఎంఎస్` వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం.
శనివారం నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు తన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం తమ టీమ్ పడ్డ శ్రమను ప్రేక్షకులు త్వరలోనే వెండితెరపై చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిత్రీకరణ సమయంలో తాను గర్భవతినని తెలిసినప్పుడు యూనిట్ మొత్తం అందించిన సహకారం మరువలేనిదని ఆమె గుర్తుచేసుకున్నారు. రామ్ చరణ్ ట్రైలర్ రిలీజ్ చేయడం వల్ల సినిమాకు ఊహించని స్థాయిలో రీచ్ పెరిగిందని ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ట్రైలర్ చూసిన తర్వాత రామ్ చరణ్ స్పందన గురించి లావణ్య ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ట్రైలర్ లాంచ్ తర్వాత చరణ్ మొదట వరుణ్ తేజ్‌కు కాల్ చేశారని.. ఆ తర్వాత తనతో కూడా మాట్లాడారని ఆమె తెలిపారు. బాంబే వెళ్తున్న సమయంలో ఫోన్ చేసిన చరణ్.. ``ట్రైలర్ ఫెంటాస్టిక్‌గా ఉంది. చాలా నేచురల్‌గా కామెడీ పండించావు`` అంటూ ప్రశంసించారని పేర్కొన్నారు. సినిమాలో కామెడీ అద్భుతంగా ఉందని చరణ్ ఇచ్చిన కాంప్లిమెంట్ తనకు దక్కిన బెస్ట్ అవార్డుగా భావిస్తున్నానని లావణ్య సంతోషం వ్యక్తం చేశారు.
ఇదే వేదికపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తావన రాగా..ఆయన కోసం ప్రత్యేక షో ప్లాన్ చేస్తున్నట్లు లావణ్య వెల్లడించారు. మావయ్య పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు , సినిమాలతో చాలా బిజీగా ఉన్నారని.. ఆయనకు సమయం దొరికితే తప్పకుండా ఫ్యామిలీ మొత్తానికి స్పెషల్ షో వేస్తానని తెలిపారు. పవన్ కల్యాణ్ ఆరోగ్యం గురించి జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందని, విశ్రాంతి తీసుకుంటున్నారని క్లారిటీ ఇచ్చారు.
చివరగా..దర్శకుడు సత్య - నిర్మాత నాగమోహన్ ఒక అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని లావణ్య కొనియాడారు. హీరో దేవ్ మోహన్ తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషమని.. ఇది సినిమాకు మరింత సహజత్వాన్ని ఇస్తుందని ఆమె అన్నారు. మే 8న థియేటర్లలో సందడి చేయనున్న ఈ `సతీ లీలావతి`ని చూసి ప్రేక్షకులందరూ ఆదరించాలని లావణ్య కొణిదెల కోరారు. మెగా కుటుంబ సభ్యుల మద్దతుతో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.