మీమీ టైమ్‌లో కృతి కీలక నిర్ణయం.. సరైన టైమ్ లో సరైన డెసిషన్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఒక ముఖ్యమైన డెసిషన్ ను తొలిసారిగా బహిరంగంగా వెల్లడించారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఒక ముఖ్యమైన డెసిషన్ ను తొలిసారిగా బహిరంగంగా వెల్లడించారు. మాతృత్వం, మహిళల ఆరోగ్యంపై జరుగుతున్న డిస్కషన్స్ మధ్య ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. కెరీర్‌లో బిజీగా ఉన్న టైమ్ లోనేఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నానని ఆమె తెలిపారు. ఈ డెసిషన్ తనకు మానసిక ప్రశాంతతను ఇచ్చిందని కూడా కృతి పేర్కొన్నారు. రీసెంట్ గా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కృతి, ఈ ప్రక్రియను ఎప్పుడు, ఎందుకు ఎంచుకున్నారో కూడా వివరించారు. మీమీ సినిమా కోసం ప్రత్యేకంగా బరువు పెరగాల్సి వచ్చిన టైమ్ లోనే ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవడం సరైన నిర్ణయంగా అనిపించిందని చెప్పారు. ఆ ట్రీట్‌మెంట్ వల్ల బాడీలో వచ్చే మార్పులు, సినిమాలోని క్యారెక్టర్ కోసం చేయాల్సిన శారీరక మార్పులు ఒకే టైమ్ లో ఉండటంతో రెండింటినీ కలిపి ప్లాన్ చేసుకున్నానని వెల్లడించారు.
ఎగ్ ఫ్రీజింగ్ అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదని, హార్మోన్ల ప్రభావంతో శరీరంలో ఉబ్బరం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు. ఆ టైమ్ లో శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగానూ కొన్ని ఒత్తిడులు అనుభవించానని కృతి వివరించారు. అయితే ఫ్యూచర్ గురించి ఆందోళన లేకుండా ఉండేందుకు ఈ డెసిషన్ తనకెంతో ఉపయోగపడిందని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళల జీవితంలో బయోలాజికల్ క్లాక్ అనే అంశం తరచూ ఒత్తిడికి కారణమవుతుందని, ముఖ్యంగా కెరీర్‌పై దృష్టి పెట్టే వారికి ఇది మరింత సవాలుగా మారుతుందని కృతి పేర్కొన్నారు. ఫ్యామిలీ, సమాజం నుంచి వచ్చే ప్రశ్నల కంటే, తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలను మహిళలే స్వతంత్రంగా తీసుకోవాలని ఆమె సూచించారు. తాను కూడా అదే ఆలోచనతో ఈ డెసిషన్ తీసుకున్నానని చెప్పారు.
మీమీ సినిమా కృతికి కెరీర్‌లో స్పెషల్ ఫిల్మ్ గా నిలిచింది. సరోగసీ నేపథ్యంలో రూపొందిన ఆ సినిమాలో పాత్రకు తగ్గట్టుగా శారీరకంగా ఎంతో కష్టపడిన ఆమె నటనకు ప్రేక్షకుల ప్రశంసలు దక్కాయి. అదే సినిమాకి జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా కృతి అందుకున్నారు. ఇప్పుడదే సినిమా టైమ్‌లో తీసుకున్న మరో వ్యక్తిగత నిర్ణయాన్ని బయటపెట్టడంతో మరోసారి కృతి వార్తల్లో నిలిచారు.
దీంతో ఎగ్ ఫ్రీజింగ్ గురించి బహిరంగంగా మాట్లాడిన ప్రముఖ నటీమణుల లిస్ట్ లో కృతి కూడా చేరారు. గతంలో ప్రియాంక చోప్రా, ఏక్తా కపూర్, మోనా సింగ్, రిచా చద్దా వంటి పలువురు కూడా ఈ విషయంపై తమ అనుభవాలను పంచుకున్నారు. మహిళలు తమ ఫ్యామిలీ ప్లానింగ్ ను తమకు అనుకూలమైన సమయంలో రూపొందించుకునేందుకు ఇది ఒక వైద్యపరమైన అవకాశం అని వారు అభిప్రాయపడ్డారు.
కృతి చేసిన తాజా కామెంట్స్ మహిళల ఆరోగ్యంపై మరింత అవగాహన పెంచేలా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. వ్యక్తిగత నిర్ణయాలను దాచిపెట్టకుండా బహిరంగంగా చర్చించడం ద్వారా అపోహలు తగ్గి, సరైన సమాచారం మరింత మందికి చేరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కృతి సనన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ విస్తృత చర్చకు కారణమవుతున్నాయి.