త‌న చ‌దువును ఎగ‌తాళి చేసిన నెటిజ‌న్‌కి బుద్ధి చెప్పిన ఖుష్బూ

సోష‌ల్ మీడియా ఎక్స్ ఖాతాలో ఖుష్బూ రాసిన ఓ పొలిటిక‌ల్ వ్యాఖ్యానానికి స్పందిస్తూ, ఒక నెటిజ‌న్ వ్యంగ్యంగా ఇలా రాసాడు.;

Update: 2025-10-08 04:35 GMT

నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బు సుందర్ విద్య‌ను, విజ్ఞానాన్ని అపహాస్యం చేస్తూ సామాజిక మాధ్య‌మాల‌లో ట్రోలింగ్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. తన రాజకీయ పోస్ట్‌ల కోసం ఖుష్బూ చాట్ జీపీటీని ఉపయోగించారని ఆరోపిస్తూ ట్రోల‌ర్లు విరుచుకుప‌డుతున్నారు.

సోష‌ల్ మీడియా ఎక్స్ ఖాతాలో ఖుష్బూ రాసిన ఓ పొలిటిక‌ల్ వ్యాఖ్యానానికి స్పందిస్తూ, ఒక నెటిజ‌న్ వ్యంగ్యంగా ఇలా రాసాడు. ''నీకు నిజంగా వ్యంగ్య ట్వీట్‌లు ఎలా చేయాలో తెలుసా? దీన్ని రూపొందించడానికి చాట్ జీపీటీని ఉపయోగిస్తున్నావా? మాకు నీ 8వ తరగతి చ‌దువు గురించి తెలుసు'' అని రాశారు.

అయితే ఇలాంటి త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేసే ట్రోల‌ర్ల‌కు ఖుష్బూ త‌గిన రీతిలో బుద్ధి చెప్పారు. వ‌య‌సు పెద్ద‌రికం కూడా చూడ‌కుండా స‌ద‌రు వ్య‌క్తి సింగుల‌ర్ గా మాట్లాడుతూ, ఎగ‌తాళి చేయ‌డంతో ఖుష్బూ కూడా దానికి ధీటుగా స్పందించారు.

అధికారిక విద్య మాత్రమే తెలివితేటలకు కొలమానం కాదని ఖుష్బూ ట్రోల‌ర్ల‌కు గుర్తు చేసారు. ``తెలివితేటలు మీ ప్రోగ్రెస్ రిపోర్టులో ఉండేవి కావు. తెలివితేటలు జీవితం మీకు ఏమి నేర్పుతుందో దాని నుంచి పుట్టుకొచ్చేవి. #కామరాజర్ వంటి గొప్ప రాజనీతిజ్ఞుడు కూడా 4వ తరగతి దాటి తన విద్యను కొనసాగించలేకపోయాడు సోదరా. కాబట్టి విశ్రాంతి తీసుకో.. నా ఆలోచనలను వినిపించడానికి నాకు చాట్ జీపీటీ అవసరం లేదు`` అని రాసారు. ఆ త‌ర్వాత ఖుష్బూ ఘాటైన‌ సమాధానం వేగంగా వైరల్ అయ్యింది.

ఆన్‌లైన్ విమర్శకుల‌ను మ్యానేజ్ చేయ‌డంలో, విమ‌ర్శ‌ల్ని తిప్పి కొట్ట‌డంలో ఖుష్బూ చాక‌చ‌క్యాన్ని చాలా మంది కీర్తించారు. ఖుష్బు స్ట‌డీస్ విష‌యానికి వ‌స్తే, ఆమె ముంబైలోని స్వామి ముక్తానంద హైస్కూల్‌లో చదువుకున్నారు. కానీ చిన్న వయసులోనే నట‌నా రంగంలో ప్ర‌వేశించ‌డంతో పెద్ద చ‌దువుల‌పై దృష్టి పెట్ట‌లేదు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాష‌ల్లో ఖుష్బూ న‌టించారు.

ఖుష్బూ అంద‌చందాలకు ఫిదా కాని యువ‌కుడు ఆరోజుల్లో లేడు. త‌న‌ బొద్దందానికి ఫిదా అయిన త‌మిళ తంబీలు ఈ న‌టి గౌరవార్థం ఒక ఆలయాన్ని కూడా నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఖుష్బు 2000లో ద‌ర్శ‌క‌న‌టుడు సుందర్ సి-ని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు అవంతిక, ఆనందిత ఉన్నారు. 2010లో రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రస్తుతం తమిళనాడు బిజెపి ఉపాధ్యక్షురాలిగాను ఖుష్బూ సుంద‌ర్ పనిచేస్తున్నారు.

Tags:    

Similar News