ది కేరళ స్టోరీ 2 మూవీపై స్టే.. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందంటూ!

ఆఖరి నిమిషంలో హైకోర్టు బ్రేక్: ఫిబ్రవరి 27న భారీ అంచనాల మధ్య విడుదల కావాల్సిన 'ది కేరళ స్టోరీ 2- గోస్ బియాండ్' చిత్రానికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి.;

Update: 2026-02-26 10:31 GMT

సినిమా థియేటర్లలోకి రావడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు 'ది కేరళ స్టోరీ 2' చిత్రానికి కేరళ హైకోర్టులో భారీ షాక్ తగిలింది. ఈ సినిమాలో మతపరమైన ఉద్రిక్తతలు పెంచేలా, ఒక వర్గాన్ని కించపరిచేలా దృశ్యాలు ఉన్నాయన్న పిటిషన్లను కోర్టు సీరియస్‌గా తీసుకుంది. స్వయంగా సినిమాను వీక్షించిన న్యాయస్థానం, వివాదాస్పద అంశాల దృష్ట్యా విడుదలపై స్టే విధించింది. సెన్సార్ బోర్డు తీరును తప్పుబడుతూ, ఈ చిత్రాన్ని మరోసారి పునఃపరిశీలించాలని ఆదేశించింది. వివరాలలోకి వెళితే ..

ఆఖరి నిమిషంలో హైకోర్టు బ్రేక్: ఫిబ్రవరి 27న భారీ అంచనాల మధ్య విడుదల కావాల్సిన 'ది కేరళ స్టోరీ 2- గోస్ బియాండ్' చిత్రానికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఈ సినిమా కేరళ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని, సమాజంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ కురియన్ థామస్ విచారణ చేపట్టారు. సినిమాను స్వయంగా చూసిన తర్వాతే నిర్ణయం చెబుతామని ప్రకటించిన కోర్టు, చివరకు స్టే విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. అసలు సినిమా చూడకుండానే CBFC (సెన్సార్ బోర్డు) ఎలా సర్టిఫికెట్ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. చిత్రాన్ని మళ్లీ పరిశీలించి, అభ్యంతరకరమైన అంశాలపై నివేదిక ఇచ్చే వరకు థియేటర్లలో ప్రదర్శించకూడదని గట్టిగా ఆదేశించింది.

ఏమిటీ రెండో భాగం కథ?:

2023లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ది కేరళ స్టోరీ'కి సీక్వెల్‌గా ఈ సినిమాను విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు. మొదటి భాగంలో కేరళ అమ్మాయిలు ఉగ్రవాద రొంపిలోకి ఎలా దింపబడ్డారో చూపించగా, ఈ రెండో భాగంలో ప్రేమ పేరుతో జరిగే మోసాలను మరింత లోతుగా చూపించే ప్రయత్నం చేశారు. ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీలో.. అల్లారుముద్దుగా పెరిగిన అమ్మాయిలు ప్రేమ మాయలో పడి, కన్నవారిని ఎదిరించి వెళ్లిపోవడం, ఆ తర్వాత ఎదుర్కొనే భయానక హింసను కథాంశంగా తీసుకున్నారు. అయితే, ఈ చిత్రీకరణ కేరళలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తుందని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

భవితవ్యం ఎటువైపు?:

కామాఖ్యా నారాయణ్‌ సింగ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, ట్రైలర్స్ నుంచే వివాదాలకు కేంద్రబిందువైంది. ఒక వర్గం వారు ఇది వాస్తవమని వాదిస్తుంటే, మరికొందరు కావాలనే మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం అని మండిపడుతున్నారు. ఇక ప్రస్తుతం హైకోర్టు విధించిన స్టేతో చిత్ర బృందం డైలమాలో పడింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాను మళ్లీ చూసి ఎలాంటి కటింగ్స్ ఇస్తుంది? కోర్టు అభ్యంతరాలను నిర్మాత ఎలా పరిష్కరిస్తారు? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక ఏది ఏమైనా, కేరళ స్టోరీ పార్ట్-1 లాగే పార్ట్-2 కూడా బాక్సాఫీస్ వద్దకు రాకముందే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News