మరో 'మహానటి' అంటే సాధ్యమేనా..?

పాన్ ఇండియా రేంజ్‌ హీరోయిన్‌ అంటూ గుర్తింపు లభించింది. కానీ మహానటి సినిమా తర్వాత ఆ స్థాయి పాత్రలను కీర్తి సురేష్ దక్కించుకోలేక పోయింది. కమర్షియల్‌ హీరోయిన్‌గా పరిమితం కావాల్సి వచ్చింది.

Update: 2026-06-13 07:06 GMT

బాల నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కీర్తి సురేష్‌ మలయాళం మూవీ గీతాంజలితో 2013లో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. మలయాళంలో హీరోయిన్‌గా పనిచయం అయినప్పటికీ ఈ అమ్మడు ఎక్కువగా తమిళ, తెలుగు సినిమాలు చేస్తూ వస్తోంది. హీరోయిన్‌గా 2013లో కెరీర్‌ను మొదలు పెట్టిన కీర్తి సురేష్‌కి 2018లో వచ్చిన 'మహానటి' సినిమా జాతీయ స్థాయి గుర్తింపు, గౌరవం తెచ్చి పెట్టింది. గుర్తింపు మాత్రమే కాకుండా అవార్డ్‌లు, రివార్డ్‌లు సైతం ఆ సినిమా తెచ్చి పెట్టింది. మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన మహానటి సినిమాలో కీర్తి సురేష్‌ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. పాన్ ఇండియా రేంజ్‌ హీరోయిన్‌ అంటూ గుర్తింపు లభించింది. కానీ మహానటి సినిమా తర్వాత ఆ స్థాయి పాత్రలను కీర్తి సురేష్ దక్కించుకోలేక పోయింది. కమర్షియల్‌ హీరోయిన్‌గా పరిమితం కావాల్సి వచ్చింది. ఒకటి రెండు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేసినా అవి పెద్దగా ఫలితం ఇవ్వలేదు.

కీర్తి సురేష్‌ మహానటి మూవీ...

మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్‌ కి ఎక్కువగా లేడీ ఓరియంటెడ్‌ సినిమా ఆఫర్లు తలుపు తట్టాయి. ఆ జోష్‌లోనే పెంగ్విన్, మిస్ ఇండియా మరికొన్ని లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను చేసిన కీర్తి సురేష్‌కి నిరాశే మిగిలింది. మధ్యలో కొన్ని కమర్షియల్‌ సినిమాలతో సక్సెస్‌ దక్కినా మహానటి స్థాయిలో హిట్‌ పడలేదు. ఆ విషయాన్ని స్వయంగా కీర్తి సురేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మహానటి సినిమా తర్వాత తనకు ఇంటర్నేషనల్‌ లెవల్‌ లో గుర్తింపు దక్కిందని కీర్తి సురేష్‌ పేర్కొంది. అయితే అలాంటి పవర్‌ ఫుల్‌ పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను, మళ్లీ అలాంటి పాత్రలో, అలాంటి సినిమాను చేయాలని కోరుకుంటున్నాను. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క స్క్రిప్ట్‌ అలాంటిది రాలేదని, అంతటి స్ట్రాంగ్‌ పాత్రతో ఏ దర్శకుడు సంప్రదించలేదు అంటూ చెప్పుకొచ్చింది. మహానటి స్థాయి పవర్‌ ఫుల్‌ పాత్రల కోసం తాను వెయిట్‌ చేస్తున్నట్లుగా తెలియజేసింది.

సోషల్‌ మీడియాలో కీర్తి సురేష్‌ గురించి....

కీర్తి సురేష్‌ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వరుస సినిమాలు చేయాలని ఆశ పడుతుంది. అయితే ఇంతకు ముందుతో పోల్చితే కాస్త ఆఫర్లు తగ్గాయి. ఇదే సమయంలో మునుపటితో పోల్చితే కీర్తి సురేష్‌ స్కిన్‌ షో పెంచిందనే వాదన వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఆమె నుంచి వచ్చిన సినిమాల్లో ఆమె లుక్‌ను చూస్తే కీర్తి మారిందనే అభిప్రాయం కలుగక మానదు. ఇలాంటి సమయంలో కీర్తి సురేష్‌ కి మహానటి స్థాయి పాత్ర మళ్లీ రావాలంటే సాధ్యమేనా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ మహానటి వంటి సినిమాలో, సావిత్రి వంటి స్ట్రాంగ్‌ పాత్రలో నటించాలని కోరుకుంటున్నాను అంటూ కీర్తి సురేష్‌ చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో నెటిజన్స్ విభిన్నంగా స్పందిస్తున్నారు. సావిత్రి వంటి పాత్రలో నటించే అవకాశం మళ్లీ మళ్లీ రాదు. జీవిత కాలంలో ఒకే సారి అలాంటి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశం కీర్తికి ఇప్పటికీ వచ్చింది కనుక మళ్లీ అంటే అసాధ్యం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

విజయ్‌ దేవరకొండ రౌడీ జనార్థన...

ప్రస్తుతం కీర్తి సురేష్‌ తెలుగులో విజయ్‌ దేవరకొండకు జోడీగా రౌడీ జనార్థన సినిమాలో నటిస్తోంది. తెలుగులో ఈమె చేసిన చివరి మూవీ ఉప్పు కప్పురంబు. ఆ సినిమాలో కీర్తి లుక్‌ విషయమై పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చినా, సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ దక్కలేదు. హీరోయిన్‌గా మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్న కీర్తి సురేష్‌ వచ్చిన ప్రతి ఆఫర్‌కు కమిట్‌ అవుతుంది. ఆ క్రమంలో కొన్ని నిర్ణయాలు తప్పుతున్నాయి. మహానటి రేంజ్‌లో కాకున్నా కాస్త స్ట్రాంగ్‌ పాత్రలో కీర్తి సురేష్‌ ను చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మేకర్స్ సైతం కీర్తి సురేష్‌ కి అలాంటి పాత్రలు రాస్తే బాగుంటుందని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. కీర్తి సురేష్‌కి ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో మంచి కాన్సెప్ట్‌తో, స్ట్రాంగ్‌ రోల్‌తో లేడీ ఓరియంటెడ్‌ మూవీ చేస్తే వంద కోట్ల మూవీ కావడం కన్ఫర్మ్‌. మరి కీర్తికి ఆ వంద కోట్ల మూవీ ఎప్పుడు పడుతుందో చూడాలి.

Tags:    

Similar News