థియేటర్ లో పంజుర్లి దేవుడు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం..
ఇదిలా ఉండగా.. ఈ మధ్యకాలంలో రీరిలీజ్ సినిమాలలో అభిమానుల హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.;
ప్రస్తుతం ఎక్కడ చూసినా కాంతార మేనియా కొనసాగుతోంది. గతంలో వచ్చిన కాంతార సినిమా భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో.. ఈ సినిమా ప్రీక్వెల్ పై అందరిలోనూ అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగానే 'కాంతార చాప్టర్ వన్' అంటూ అక్టోబర్ 2న ఈ సినిమా విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా కాంతార కంటే కూడా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. కేవలం 4 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లో చేరి రికార్డ్ సృష్టించింది. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ థియేటర్లతో దూసుకుపోతూ.. అటు నటీనటులకు కూడా ఈ సినిమా మంచి ఇమేజ్ అందించి పెట్టింది.
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా జయరాం,గుల్హన్5 దేవయ్య తదితరులు కీలకపాత్రలో వచ్చిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ నిర్మించారు.
ఇదిలా ఉండగా.. ఈ మధ్యకాలంలో రీరిలీజ్ సినిమాలలో అభిమానుల హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొంతమంది డాన్స్ చేయడం, సినిమాల్లోని సన్నివేశాలను రీ క్రియేట్ చేయడం లాంటివి చేయడం చూస్తున్నాం. మరికొంతమంది సినిమాలలోని గెటప్స్ వేసుకొని థియేటర్లలో హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంతార 2 సినిమా థియేటర్లో పంజూర్లి దేవుడి వేషధారణలో ఒక వ్యక్తి సందడి చేశారు. థియేటర్లో ఆడియన్స్ సినిమా చూస్తూ ఉండగా.. ప్రత్యక్షంగా పంజుర్లి దేవుడి అవతారంలో ఒక వ్యక్తి కనిపించేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా కాంతార 2 సినిమాలో రిషబ్ పంజుర్లి దేవుడు ఆవహించినప్పుడు ఎలా అయితే నృత్యం చేశారో.. సరిగ్గా అలాగే థియేటర్లో కూడా పంజుర్లీ దేవుడు ఆవహించినట్టుగా అచ్చం అలాగే అరుస్తూ థియేటర్లో సందడి చేస్తూ.. డాన్స్ చేశారు.. దానితో ఆ వ్యక్తికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను తీయడానికి అక్కడి ఆడియన్స్ తెగ ఆసక్తి కనబరిచారు. పైగా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఇప్పుడు సోషల్ మీడియాలో అవి వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే ఈ ఘటన తమిళనాడులోని దిండిగల్ లో ఉన్న ఒక థియేటర్లో చోటు చేసుకుంది. ఏదేమైనా ఇలాంటి దృశ్యాలు అక్కడ చూసే ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించాయని సదరు ఆడియన్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నిజంగానే పంజుర్లి దేవుడు ఆవహించారేమో అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా ఇలాంటి దృశ్యాలు లైవ్ లో చూస్తే ఒళ్ళు గగుర్పొడవడం ఖాయం అని చెప్పడంలో సందేహం లేదు.
కాంతార 2 సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే దసరా సెలవులు , మరొకవైపు వీకెండ్స్ కావడంతో నాలుగు రోజుల్లోనే ఏకంగా 224 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది ఈ సినిమా.