కంగన బాటలో మరో నటి: సంప్రదాయాలను ఎదిరించి గ్లామ‌ర్ రంగంలో!

చండీగఢ్‌కు చెందిన కనికా మాన్ అత్యంత కఠినమైన నిబంధనలు గల సంప్రదాయ కుటుంబంలో పెరిగారు.;

Update: 2026-04-16 04:18 GMT

భారతీయ చలనచిత్ర రంగంలో `క్వీన్` కంగనా రనౌత్ ప్రస్థానం ఒక సంచలనం. హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామం నుండి పితృస్వామ్య వ్యవస్థ గల సంప్రదాయ కుటుంబం నుండి పారిపోయి ముంబై చేరుకున్న కంగ‌న‌ కథ ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చింది. ముఖ్యంగా కెరీర్ ఎంపికలో పెద్దల మితిమీరిన జోక్యాన్ని.. పురుషాధిక్యతను ఎదిరించి నిలబడటంలో కంగనా ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. తాజాగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్న `నాగిని 7` ఫేం కనికా మాన్ జీవితంలో కూడా కంగనాను పోలిన పోరాట ఘట్టాలు ఎన్నో కనిపిస్తాయి.

చండీగఢ్‌కు చెందిన కనికా మాన్ అత్యంత కఠినమైన నిబంధనలు గల సంప్రదాయ కుటుంబంలో పెరిగారు. చదువు పాడవుతుందనే భయంతో ఆమెను స్కూల్ రోజుల్లో ఎటువంటి కళా సాంస్కృతిక పోటీల్లో పాల్గొననిచ్చేవారు కాదు. కానీ క‌నికా మనసులో నటనపై ఉన్న బలమైన కాంక్ష త‌న‌ను సాహసోపేతమైన అడుగులు వేయించింది. తన చదువు కొనసాగిస్తూనే...ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రహస్యంగా తన మొదటి మ్యూజిక్ వీడియో షూటింగ్‌లో పాల్గొనడం క‌నికా ధైర్యానికి నిదర్శనం. ఇది కంగనా తన కలల కోసం ఇంటి నుండి బయటకు వచ్చిన వైనాన్ని గుర్తుకు తెస్తుంది.

కనికా ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు తన తండ్రి నుండి వచ్చిన వ్యతిరేకత. త‌న‌ మోడలింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో చూసిన తండ్రి తీవ్రంగా ఆగ్రహించి.. వెంటనే ఇంటికి వచ్చేయాలని.. లేదంటే చదువు మాన్పించేస్తానని హెచ్చరించారు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా క‌నికా వెనకడుగు వేయలేదు. గ్లామర్ రంగంలోకి ప్రవేశించిన కొత్తలో కుటుంబం నుండి ఎటువంటి ఆర్థిక లేదా నైతిక మద్దతు లభించకపోయినా.. ముంబైలో సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ స్వశక్తితో అవకాశాలను వెతుక్కుంది.

నటనపై మక్కువ ఉన్నా.. కనికా తన బాధ్యతలను విస్మరించలేదు. తన తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి విద్యాపరంగా కూడా రాణించింది. ఒకవైపు ఆడిషన్స్ ఇస్తూనే.. మరోవైపు చదువులో వెనుకబడకుండా జాగ్రత్త పడింది. ఈ పట్టుదలే కనికాను నేడు టెలివిజన్ రంగంలో టాప్ నటీమణులలో ఒకరిగా నిలబెట్టింది. తన కష్టంతో `నాగిని 7` వంటి భారీ ప్రాజెక్టులను దక్కించుకుని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును.. మార్కెట్‌ను సృష్టించుకుంది.

ప్రస్తుతం కనికా మాన్ సాధించిన విజయం చూసి త‌న‌ కుటుంబం కూడా గర్వపడుతోంది. ఆరంభంలో వ్యతిరేకించిన వారే ఇప్పుడు త‌న‌ ఎదుగుదలను చూసి అభినందిస్తున్నారు. కంగనా రనౌత్ లాగే కనికా కూడా నిరూపించింది. సంకల్పం బలంగా ఉంటే ఎన్ని సామాజిక అడ్డంకులు ఎదురైనా..కుటుంబం నుండి వ్యతిరేకత వచ్చినా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయి అసాధారణమైన తారగా ఎదగడం వెనుక ఉన్న ఈ పోరాటం ఎందరో ఔత్సాహిక కళాకారులకు ఒక కొత్త ఆశను కలిగిస్తోంది.

Tags:    

Similar News