కుమార్తెల గల డాడీలకు క్లాస్ పీకిన కంగన!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, నటి , ఎంపీ కంగనా రనౌత్ సామాజిక, రాజకీయ అంశాలపై ఎల్లప్పుడూ తనదైన శైలిలో స్పందించి నిరంతరం వార్తల్లో నిలుస్తుంటారు.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, నటి , ఎంపీ కంగనా రనౌత్ సామాజిక, రాజకీయ అంశాలపై ఎల్లప్పుడూ తనదైన శైలిలో స్పందించి నిరంతరం వార్తల్లో నిలుస్తుంటారు. సమాజంలో ఉన్న పాతకాలపు పద్ధతులను, వ్యవస్థలను ప్రశ్నించడంలో కంగన ఎప్పుడూ వెనుకాడరు. తాజాగా భారతీయ సమాజంలో మహిళల స్థానం , వివాహం తర్వాత వారి పరిస్థితిపై కంగనా చేసిన కొన్ని వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. దేశంలో పెళ్లయిన ఆడపిల్లల పట్ల కుటుంబాలు వ్యవహరించే తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.`మన సమాజంలో పెళ్లి కాగానే కూతుళ్లను పూర్తిగా వదిలేసే ఒక చెడ్డ అలవాటు ఉంది.
పుట్టింటి నుండి అత్తగారింటికి పంపించిన తర్వాత ఆ అమ్మాయికి అక్కడ ఎలాంటి సమస్యలు ఎదురైనా? పుట్టింటి వారు సరిగ్గా అండగా నిలబడరని `అది నీ ఇల్లే.. అక్కడే సర్దుకుపో` అంటూ చేతులు దులుపుకుంటారని కంగనా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే నేటి తరం యువతులకు కంగన ఓ విలువైన సలహా ఇచ్చారు. మహిళలు ఎవరిపైనా ఆధారపడకుండా ఆర్థికంగా స్వతంత్రులుగా ఎదగడం అత్యంత ముఖ్యమని నొక్కి చెప్పారు. `మీరు పెళ్లి చేసుకునే ముందే మీకంటూ ఒక సొంత గుర్తింపును ఆర్థిక భద్రతను ఏర్పాటు చేసుకోండి. పురుషుడిపై లేదా కుటుంబంపై ఆధారపడి జీవించడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుంది` అని పేర్కొన్నారు.
స్వయం సమృద్ధి ఉంటేనే సమాజంలో మహిళలకు గౌరవం దక్కుతుందని కంగన స్పష్టం చేశారు. వివాహ వ్యవస్థలో మహిళలు ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణలను కంగనా ఈ సందర్భంగా ప్రస్తావించారు. పెళ్లయిన తర్వాత చాలా మంది మహిళలు అటు పుట్టింటికి పరాయి వాళ్లుగా, ఇటు అత్తగారింట్లోనూ పూర్తిగా ఓన్ చేసుకోలేని ఒక రకమైన ఒంటరితనానికి గురవుతుంటారని విశ్లేషించారు. ఇలాంటి పరిస్థితులలో మహిళలకు తమ సొంత కాళ్లపై నిలబడగలిగే సామర్థ్యం ఉంటేనే వారు ఎలాంటి వివక్షనైనా ధైర్యంగా ఎదుర్కొని తమకు నచ్చినట్లు గౌరవంగా జీవించగలరని కంగనా వివరించారు. కంగనా చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
చాలా మంది మహిళలు , నెటిజన్లు కంగనా మాటలతో ఏకీభవిస్తున్నారు. భారతీయ కుటుంబాలలో ఇప్పటికీ ఈ వివక్ష దాగి ఉందనేది పచ్చి నిజమని మద్దతు తెలుపుతున్నారు. అయితే కొందరు మాత్రం అన్ని కుటుంబాలలో ఇలాంటి పరిస్థితి ఉండదని మారుతోన్న కాలంలో తల్లిదండ్రులు వివాహిత కూతుళ్లకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని కంగనా వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు. చివరిగా కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు భారతీయ సమాజంలో వివాహం , మహిళల హక్కులపై మరోసారి లోతైన ఆలోచనను రేకెత్తించాయి. నటిగా, ఎంపీగా బిజీగా ఉంటూనే మహిళా సాధికారత గురించి ఆమె గళమెత్తడం విశేషం.