స్టార్ హీరోయిన్ ఎదుర్కోన్న సామాజిక వేధింపులు!
కేవలం పుకార్ల ఆధారంగా ఒక వ్యక్తిని సమాజం ఏ విధంగా వేధిస్తుందో? వివరించడానికి విచ్ హంట్ అనే పదాన్ని ఉపయోగించారన్నారు.;
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత కష్టతరమైన దశలను మరోసారి గుర్తు చేసుకున్నారు. సినీ పరిశ్రమలో మహిళగా నిలదొక్కుకోవడం ఎంత సవాలుతో కూడుకున్నదో చెప్పే ప్రయత్నం చేసారు. గతంలో తనపై వచ్చిన కొన్ని వింత ఆరోపణలు, వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంపై చూపిన ప్రభావం గురించి ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నేళ్ల క్రితం తన వ్యక్తిగత సంబంధాల నేపథ్యంలో ఎదురైన చేతబడి ఆరోపణల గురించి కంగనా ప్రస్తావించారు. కేవలం పుకార్ల ఆధారంగా ఒక వ్యక్తిని సమాజం ఏ విధంగా వేధిస్తుందో? వివరించడానికి విచ్ హంట్ అనే పదాన్ని ఉపయోగించారన్నారు.
ఆధునిక కాలంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలతో కూడిన ఆరోపణలు చేయడం విచారకరమన్నారు. ఈ ఆరోపణలు వచ్చిన సమయంలో మీడియాలో - సోషల్ మీడియాలో తనను ఒక ప్రతికూల శక్తిగా చిత్రించారని కంగనా పేర్కొన్నారు. స్వయంకృషితో ఎదిగిన నటిని మానసికంగా కృంగదీయడానికి ఇలాంటి అవాస్తవ ప్రచారాలను ఆయుధాలుగా వాడుకున్నారని విమర్శించారు. దీంతో తన వ్యక్తిత్వానికి, ప్రతిష్ఠకు జరిగిన నష్టం అంతా ఇంతా కాదని వాపోయారు. బాలీవుడ్ లో నెపోటిజం గురించి మాట్లాడటం మొదలు పెట్టినప్పటి నుండి తనపై దాడులు పెరిగాయన్నారు.
అందులో భాగంగానే పాత విషయాలను వెలికి తీసి మళ్లీ విమర్శిస్తున్నారని ఆరోపించారు. ఒక మహిళ తన గళాన్ని గట్టిగా వినిపించినప్పుడు ఆమెను లొంగదీసుకోవడానికి సమాజం తరచుగా క్యారెక్టర్‌ను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తుందని కంగనా అభిప్రాయపడ్డారు. ఇన్ని ఆటంకాలు ఎదురైనా కంగన ఏనాడూ వెనకడుగు వేయలేదన్నారు. తనపై వచ్చిన విమర్శలనే మెట్లుగా మార్చుకుని మరింత దృఢంగా తయారయ్యానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్నత స్థానంలో ఉన్న తనకు, పాత జ్ఞాపకాలు కేవలం పోరాట పటిమను గుర్తు చేసే సాధనాలు మాత్రమేనన్నారు.
కంగనా రనౌత్ చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. సినీ పరిశ్రమలో కనిపించని రాజకీయాలు , ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని చేసే ప్రచారాలు ఏ స్థాయిలో ఉంటాయో ఆమె అనుభ వాలు రూపంలో చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేసారు. కంగన లాంటి వారు ధైర్యంగా మాట్లాడటం వల్ల భవిష్యత్తులో వచ్చే కొత్త వారికి కొంతైనా భరోసా లభిస్తుందని కంగన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కంగన బాలీవుడ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. `సర్కిల్` అనే చిత్రాన్ని ఏకంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో చేస్తోంది. ఇంకా `భారత భాగ్య విధాత` అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. అలాగే అమ్మడు ప్రధాన పాత్రలో `క్వీన్` కి సీక్వల్ గా `క్వీన్ 2`కి రంగం సిద్దమవుతోంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.