కాంట్రవర్శీ క్వీన్‌తో రెబల్ తాప్సీ బిగ్ ఫైట్.. ఇండస్ట్రీలో బిగ్ డిబేట్
కాంట్రవర్శీ క్వీన్ కంగనా రనౌత్ ముక్కుసూటి తత్వం గురించి తెలిసిందే. తన ముందు ఎంత పెద్ద తోపులు ఉన్నా, సూటిగా విమర్శల దాడికి దిగడం తన నైజం.
కాంట్రవర్శీ క్వీన్ కంగనా రనౌత్ ముక్కుసూటి తత్వం గురించి తెలిసిందే. తన ముందు ఎంత పెద్ద తోపులు ఉన్నా, సూటిగా విమర్శల దాడికి దిగడం తన నైజం. అయితే ఇప్పుడు వివాదాల క్వీన్‌తోనే నేరుగా ఢీకొట్టేందుకు రెబల్ క్వీన్ తాప్సీ పన్ను ఏమాత్రం వెనుకాడటం లేదు. బాలీవుడ్‌లో కంగన ఎంత బోల్డ్‌గా మాట్లాడుతుందో.. తాప్సీ కూడా అంతే సూటిగా, స్పష్టంగా మాట్లాడే నైజం ఉన్న వ్యక్తి. ఎవరికీ భయపడకుండా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే ఈ ధోరణి వల్ల ఇండస్ట్రీలో కంగన తరహాలోనే తాప్సీకి శత్రువులు పెరిగినా.. ఒక బలమైన స్వతంత్ర వ్యక్తిత్వమున్న నటిగా తనకంటూ తిరుగులేని గుర్తింపును సంపాదించుకుంది.
ఇటీవల ఒక మీడియా ఈవెంట్‌లో తాప్సీ తన పెంపకం గురించి చేసిన వ్యాఖ్యలపై కంగనా తీవ్రంగా స్పందించడంతో ఈ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన తాప్సీ పన్ను, కంగనాతో ఉన్న విభేదాలపై స్పందిస్తూ.. ఎవరి మాటతీరైనా వారు పెరిగిన వాతావరణం, పెంపకంపైనే ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను తన తల్లిదండ్రులను ఉద్దేశించి చేసిన విమర్శలుగా భావించిన కంగన ఇన్‌స్టాగ్రామ్ లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాప్సీని `సస్తీ కాపీ` (చౌకబారు కాపీ) అని సంబోధిస్తూ..తను నటిస్తున్న తదుపరి సినిమాను బి-గ్రేడ్ చిత్రంగా వర్ణించారు. అయితే కొంతసేపటికే కంగనా ఆ పోస్టులను డిలీట్ చేశారు.
కంగనా విమర్శలపై తాప్సీ పన్ను ఎక్కడా నేరుగా కంగనా పేరు ఎత్తకుండా.. తన సోషల్ మీడియా ఖాతాలో `హెన్స్ ప్రూవ్డ్`` (కాబట్టి నిరూపితమైంది) అంటూ ఒక పరోక్ష పోస్ట్ పెట్టారు. కంగనా వ్యాఖ్యలు తన అభిప్రాయాన్ని నిజం చేశాయని చెప్పకనే చెబుతూ తాప్సీ ఇచ్చిన ఈ కౌంటర్ నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షించింది.
ఈ ఇద్దరి మధ్య వివాదం ఈనాటిది కాదు.. 2019లో కంగనా సోదరి రంగోలి చందేల్ మొదటిసారిగా తాప్సీని `సస్తీ కాపీ` అని సంబోధించారు. ఆ తర్వాత 2020లో నెపోటిజం వివాదం సమయంలో కూడా కంగనా తాప్సీని బి-గ్రేడ్ నటి అని పదే పదే విమర్శించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది.
ఈ సరికొత్త మాటల యుద్ధంతో బాలీవుడ్ మీడియాలో మరోసారి వేడి రాజుకుంది. 2019లో కంగనా సోదరి రంగోలి తాప్సీని `సస్తీ కాపీ` అనడం.. ఆ తర్వాత నెపోటిజం గొడవల్లో తాప్సీని బి-గ్రేడ్ నటి అని కంగనా వేధించడం పాత విషయాలే అయినా కానీ.. తాప్సీ ప్రతిసారీ అంతే ధైర్యంగా తిప్పికొట్టింది. కంగనను ఒక రెబల్ వివాదాల క్వీన్ అనుకుంటే, అంతకుమించి పెద్ద రెబల్‌లా తాప్సీ నిలబడటం.. మాటకి మాటా.. కౌంటర్‌కి కౌంటర్ ఇస్తూ ఈ `ఫైటింగ్`ను కొనసాగించడం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
తాప్సీలోని ఈ తిరుగుబాటు తత్వం కేవలం తన వ్యక్తిగత జీవితానికే పరిమితం కాలేదు. అది తన సినిమాల ఎంపికలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. రొటీన్ కమర్షియల్ హంగామా.. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ పింక్, తప్పాడ్ వంటి పవర్ ఫుల్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలను, వైవిధ్యమైన జానర్ బ్లెండ్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలను ఎంచుకోవడానికి ఈ మనస్తత్వమే కారణం. అందుకే నేటి తరం జెన్ జీ ప్రేక్షకులు తాప్సీని కేవలం ఒక నటిగానే కాకుండా.. తమ స్వరాన్ని వినిపించే ఒక మహోన్నత మహిళకు ప్రతీకగా చూస్తున్నారు.
ప్రస్తుతం తాప్సీ పన్ను తన నటనతో మరోసారి మెప్పించేందుకు `గంధారి` సినిమాతో సిద్ధమవుతున్నారు. దేవాశిష్ మఖిజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజజీవితంలో ఎలాంటి వివాదాలు ఎదురైనా తన ఆత్మవిశ్వాసాన్ని తగ్గనివ్వకుండా ముందుకు సాగుతున్న తాప్సీ తీరు తను నటిస్తున్న తదుపరి ప్రాజెక్టులపై అంచనాలను మరింత పెంచుతోంది.