బద్ధ శత్రువుకి ఆ విషయంలో కంగన మద్ధతు
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నెపోటిజం అంశంపై కరణ్ జోహార్‌ను.. ఆయన శిష్యురాలు దీపికా పడుకోన్‌ను ఎప్పుడూ టార్గెట్ చేసే `క్వీన్` కంగనా రనౌత్.. ఈసారి అనూహ్యంగా తన పంథా మార్చుకుంది.;
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నెపోటిజం అంశంపై కరణ్ జోహార్‌ను.. ఆయన శిష్యురాలు దీపికా పడుకోన్‌ను ఎప్పుడూ టార్గెట్ చేసే `క్వీన్` కంగనా రనౌత్.. ఈసారి అనూహ్యంగా తన పంథా మార్చుకుంది. ఇన్నాళ్లూ బద్ధ వ్యతిరేకిగా ఉన్న దీపికా పడుకోన్‌కు కంగనా ఇప్పుడు గట్టి మద్దతుదారుగా నిలిచింది. రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే పని చేయగలనని దీపిక తీసుకున్న నిర్ణయం వల్ల `కల్కి 2` , `స్పిరిట్` వంటి భారీ అవకాశాలను కోల్పోయిన నేపథ్యంలో కంగనా స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
గతంలో తామిద్దరం కలిసి ఒక బాలీవుడ్ సినిమా కోసం పనిచేసినప్పటి అనుభవాలను కంగనా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో నిర్మాతలు తమను రోజుకు 12 గంటలు పనిచేయాలని కోరగా తాను మాత్రం 10 గంటల కంటే ఎక్కువ పనిచేయలేనని నిర్మొహమాటంగా చెప్పినట్లు వెల్లడించారు. కంగనా తీసుకున్న ఆ నిర్ణయాన్ని అప్పట్లో దీపికా పడుకోన్ ఎంతో ప్రశంసించారని.. అప్పటి నుండే పనివేళల విషయంలో తమ ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయని కంగనా స్పష్టం చేశారు.
దీపికా పడుకొనే నిర్ణయాన్ని సమర్థిస్తూ... ఒక తల్లిగా పసిబిడ్డ బాధ్యతలు ఉంటాయని కంగనా పేర్కొన్నారు. కేరీర్‌లో ఎంతో సాధించి ఉన్నత స్థితిలో ఉన్న దీపికా వంటి నటి తన పని షరతులను స్వయంగా నిర్ణయించుకునే హక్కును సంపాదించుకుందని అభిప్రాయపడ్డారు. పని ఒత్తిడి వల్ల వ్యక్తిగత జీవితం దెబ్బతినకూడదని.. ముఖ్యంగా తల్లులైన నటీమణులకు ఇటువంటి వెసులుబాటు కచ్చితంగా ఉండాలని కంగనా ముక్కుసూటిగా చెప్పారు.
సినిమా రంగంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న 12 గంటల పని సంస్కృతిని ఇకనైనా వదిలేయాలని కంగనా ఆకాంక్షించారు. ఈ రుద్దుడు ధోరణి వల్ల నటీనటులు- సాంకేతిక నిపుణులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలో పని ఒత్తిడి తగ్గాలని.. నటీనటులు కోరుకున్న పని వాతావరణంలో పనిచేస్తూనే విజయాలను సాధించే రోజులు రావాలని ఆమె ఆకాంక్షించారు. దీపిక తీసుకున్న ఈ ముందడుగు ఇండస్ట్రీలో ఒక కొత్త మార్పుకు శ్రీకారం చుట్టాలని ఆమె కోరుకున్నారు.
కంగనా రనౌత్ - దీపికా పడుకోన్ వంటి అగ్ర నటీమణులు పనివేళల విషయంలో గొంతు ఎత్తడం వల్ల సినిమా నిర్మాణ రంగంలో ఒక కొత్త చర్చ మొదలైంది. భారీ బడ్జెట్ చిత్రాల మేకర్స్ ఈ నిబంధనలను అంగీకరించకపోయినా..నటీనటుల మానసిక - శారీరక ఆరోగ్యం దృష్ట్యా పనివేళలను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. కంగనా చూపిన ఈ మద్దతు.. సినిమా పరిశ్రమలో వృత్తిపరమైన సంబంధాలు .. హక్కుల పట్ల కొత్త దృక్పథాన్ని కలిగిస్తోంది.