జాన్వీ వివాదంలో కంగ‌న మ‌ద్ధ‌తు.. బుచ్చిబాబు అన‌వ‌స‌రంగా సారీ చెప్పాడు!

సినిమాల్లో మహిళా పాత్రల చిత్రీకరణ, వారిని గ్లామర్ వస్తువులుగా (ఆబ్జెక్టిఫికేషన్) చూపించడంపై చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ పెద్ద చర్చ నడుస్తూనే ఉంటుంది.

Update: 2026-06-08 16:54 GMT

సినిమాల్లో మహిళా పాత్రల చిత్రీకరణ, వారిని గ్లామర్ వస్తువులుగా (ఆబ్జెక్టిఫికేషన్) చూపించడంపై చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ పెద్ద చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇటీవల యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించిన `పెద్ది` చిత్రం చుట్టూ ముసురుకున్న వివాదం దీనికి తాజా ఉదాహరణగా నిలిచింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ను చూపించిన విధానంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. జాన్వీ పాత్రను కేవలం ఒక `గ్లామర్ వస్తువు`గా మలిచారంటూ ప్రేక్షకుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. సోషల్ మీడియాలో ఈ వివాదం పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన నేపథ్యంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఈ అంశంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సినిమాల్లో మహిళలను కేవలం ఒక వస్తువులా చూపించడంపై కంగనా రనౌత్ స్పందిస్తూ.. తన కెరీర్‌లో తాను ఎదుర్కొన్న అనుభవాలను షేర్ చేసారు. తెరపై తనను ఎవరూ తప్పుగా లేదా అసభ్యంగా చూపించకుండా ఉండేందుకు నటిగా ఎలాంటి హద్దులు గీసుకుంటారనే ప్రశ్నపై కంగన స్పందించారు. ఈ సందర్భంగా కంగ‌న‌ మాట్లాడుతూ.. పరిశ్రమలో ఎవరూ కూడా కావాలని ఒక మహిళను తప్పుగా చూపించాలనే ఉద్దేశంతో సినిమాలు తీయరని అభిప్రాయపడ్డారు. ఒక సినిమా ఒప్పుకున్నప్పుడు అందులో రకరకాల కోణాలు ఉంటాయని.. అందువల్ల కథలో ఏదైనా తప్పుగా అనిపిస్తే దాన్ని సరిదిద్దే అవకాశం నటీమణులకు ఉంటుందని కంగన స్పష్టం చేశారు.

దర్శక రచయితల ఆలోచనా విధానాన్ని హైలైట్ చేస్తూ కంగన మరింత క్లారిటీ ఇచ్చారు. ``ఒక మహిళగా సినిమాలో ఏదైనా సీన్ తేడాగా ఉంది లేదా సరిగ్గా లేదు అనిపిస్తే... మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వారి ముందు పెట్టవచ్చు`` అని అన్నారు. రైటర్స్ రూమ్‌లో కూర్చునే వారు ఎప్పుడూ చెడు ఉద్దేశంతో ఆలోచించరని.. కొన్నిసార్లు తెలియకుండానే అలాంటి సీన్లు పడతాయని కంగ‌న పేర్కొన్నారు. ఒక సినిమాకు సైన్ చేసిన తర్వాత అది అందరి ఉమ్మడి బాధ్యత (కొలాబరేషన్) అవుతుందని. కాబట్టి నటీమణులు తమ గళాన్ని వినిపించి మార్పులు చేయించవచ్చని కంగనా రనౌత్ ఘాటుగానే సూచించారు. ఒక ర‌కంగా పెద్ది ద‌ర్శ‌కుడు బుచ్చిబాబుపైకే త‌ప్పంతా తోసేయ‌కూడ‌ద‌ని కంగ‌న చెప్పార‌న్న‌మాట‌. అంటే బుచ్చిబాబుకు క్వీన్ నుంచి మ‌ద్ధ‌తు ల‌భించింది.

మరోవైపు పెద్ది సినిమాపై ఆన్‌లైన్‌లో నెగిటివిటీ.. నిరసనలు ఉధృతం కావడంతో దర్శకుడు బుచ్చిబాబు సానా బహిరంగంగా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పిన విష‌యం తెలిసిందే. కంగ‌న ఇచ్చిన వివ‌ర‌ణ‌ను బ‌ట్టి బుచ్చిబాబు అన‌వ‌స‌రంగా క్ష‌మాప‌ణ చెప్పాడ‌ని ఇప్పుడు నెటిజ‌నులు విశ్లేషిస్తున్నారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను తాము తీవ్రంగా పరిగణించామని... వివాదాస్పదంగా మారిన ఆ సీన్లను సినిమా నుండి ఎడిట్ చేసి తొలగిస్తున్నట్లు బుచ్చిబాబు ప్రకటించారు. సినిమా అనేది ప్రేక్షకులను అలరించడానికి.. స్ఫూర్తినింపడానికి మాత్రమే ఉండాలని... ఎవరినీ ఇబ్బంది పెట్టేలా లేదా గౌరవహీనంగా అనిపించేలా ఉండకూడదని తాను నమ్ముతానని బుచ్చిబాబు పేర్కొన్నారు. తెరపైనా, బయటా మహిళలపై తనకు ఎంతో గౌరవం ఉందని ఏ మహిళా పాత్రను అవమానించాలనే ఉద్దేశం తమకు లేదని వివరణ ఇచ్చారు. అయితే ఈ వివాదంపై హీరోయిన్ జాన్వీ కపూర్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇదే ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ తన త‌దుపరి చిత్రం `భారత్ భాగ్య విధాత` గురించి మాట్లాడుతూ తన వ్యక్తిగత సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. తాను 16, 17 ఏళ్ల చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని.. ఆ తర్వాత క్వీన్, తను వెడ్స్ మను వంటి చిత్రాలతో భారీ విజయాలను అందుకున్నానని చెప్పారు. స్టార్‌డమ్ లభించినా.. పరిశ్రమలో తోటివారిని తొక్కేసి తాను ఎదగాలని ఎప్పుడూ అనుకోలేదని కంగన వెల్లడించారు. తన ఎదుగుదలతో పాటు ఇతరులను కూడా పైకి తీసుకురావాలనే సంకల్పం తనకు ఎప్పుడూ ఉంటుందని.. అదే సిద్ధాంతం ఇప్పటికీ తన వ్యక్తిగత, రాజకీయ, సినీ జీవితంలో ప్రతిబింబిస్తోందని ఇంట‌ర్వ్యూ ముగించారు.

Tags:    

Similar News