అవకాశం ఇవ్వలేదని ఆ కసి అలా తీర్చుకుందా?
ఇది అహంకారం కాదు. ఒక నటిగా ఆమె సాధించిన విజయానికి నిదర్శనం. ఈ ఘటన కంగనాలోని ఆత్మవిశ్వాసాన్ని పట్టుదలను సూచిస్తుంది.;
సినీ పరిశ్రమలో ఎప్పుడు? ఎవరి జాతకం ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. నేడు అవకాశాల కోసం ఒక దర్శకుడి చుట్టూ తిరిగిన నటి, రేపు అదే దర్శకుడు తన సినిమా కోసం ఆమె కాల్‌షీట్ల కోసం వేచి చూసే స్థాయికి ఎదగొచ్చు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ - దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 17 ఏళ్ల ప్రాయంలో తిరస్కరించబడిన చోటే, స్టార్‌డమ్‌తో ఆమె సమాధానం చెప్పిన తీరు విధి విలాసానికి అద్దం పడుతోంది.
కంగనా రనౌత్ సినీ ప్రయాణం ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోన్న తరుణంలో సల్మాన్ ఖాన్ రిఫరెన్స్‌తో ఆమె సంజయ్ లీలా బన్సాలీని కలిసింది. అప్పట్లో ఆయన ఒక భారీ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ సమయంలో కంగనా వయస్సు కేవలం 17 ఏళ్లు మాత్రమే కావడంతో ఆ పాత్రకు ఆమె సరిపోదని బన్సాలీ అవకాశం ఇవ్వలేదు. ఆ తిరస్కరణ కంగనా మనసులో ఒక కసిని, పట్టుదలను పెంచింది. కాలం గడిచేకొద్దీ కంగనా తన నటనతో బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది.
`గ్యాంగ్‌స్టర్`, `ఫ్యాషన్` వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కట్ చేస్తే కొన్ని ఏళ్ల తర్వాత సంజయ్ లీలా బన్సాలీ `రామ్ లీలా` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సమయంలో మళ్ళీ కంగనా పేరు తెరపైకి వచ్చింది. ఆ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం బన్సాలీ స్వయంగా కంగనాను సంప్రదించారు. ఒకప్పుడు వద్దన్న దర్శకుడే ఇప్పుడు తన పాట కోసం అడగడం కంగనా కెరీర్‌లో ఒక కీలక మలుపు. అయితే ఇక్కడే విధి విచిత్రమైన ఆటను ప్రదర్శించింది. బన్సాలీ అడిగిన ఆ స్పెషల్ సాంగ్ ఆఫర్‌ను కంగన సున్నితంగా తిరస్కరించింది. ప్రస్తుతం తాను ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ఆ పాటలో నటించలేనని నో చెప్పింది. ఒకప్పుడు అవకాశం కోసం వెళ్ళిన అమ్మాయి నేడు అదే దర్శకుడికి నో చెప్పే స్థాయికి చేరుకోవడం బాలీవుడ్ వర్గాల్లో అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది.
ఇది అహంకారం కాదు. ఒక నటిగా ఆమె సాధించిన విజయానికి నిదర్శనం. ఈ ఘటన కంగనాలోని ఆత్మవిశ్వాసాన్ని పట్టుదలను సూచిస్తుంది. `అవకాశం ఇవ్వలేదని కసి తీర్చుకుందా? అన్న ప్రశ్న పక్కన పెడితే? తన కష్టంతో తన స్థాయిని మార్చుకున్న తీరు అద్భుతం. బన్సాలీ వంటి పెద్ద దర్శకుడికి కాల్‌షీట్లు లేవని చెప్పడం అంటే అది సాధారణ విషయం కాదు. విధి ఏ తలుపునైతే మూసేసిందో? అదే తలుపు వద్ద కంగనా విజేతగా నిలబడి సత్తా చాటింది. చివరికి ఆ పాట ప్రియాంక చోప్రా చేయగా అది పెద్ద హిట్ అయ్యింది. అయితే కంగన తిరస్కరణ తర్వాత సంజయ్ లీలా బన్సాలీ పశ్చాతాపం కనిపించింది.
ఆరోజు తాను నో కు బధులుగా ఎస్ చెప్పి ఉంటే బాగుండేది అన్నట్లు తాజాగా వెలుగులోకి వస్తోంది. సినీ రంగంలో జయాపజయాలు, అవకాశాలు శాశ్వతం కావు. ప్రతిభ ఉంటే ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందని కంగనా నిరూపించింది. ఒకప్పుడు సంజయ్ లీలా బన్సాలీ వద్ద ఛాన్స్ దొరకని ఆ 17 ఏళ్ల అమ్మాయి నేడు జాతీయ అవార్డుల గ్రహీతగా ఎదిగి తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. విధి విచిత్రమైనదే కావచ్చు. కానీ పట్టుదల ఉంటే ఆ విధిని కూడా అనుకూలంగా మార్చుకోవచ్చని ఈ ఉదంతం చెబుతోంది.