కమల్ 30 ఏళ్ల డ్రీమ్ వీఎఫ్ఎక్స్‌తో నెరవేరబోతుందా?
అలాగే యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనగానే ఆయన అభిమానులతో పాటు, ఇండస్ట్రీ వర్గాల వారు చెప్పే పేరు మరుధనాయగం.;
సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరోకు, దర్శకుడికి, నిర్మాతకు ఇతర సాంకేతిక నిపుణులు, నటీనటులకు ఏదో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ప్రతి నటీ నటుడు ఏదో ఒక రోజు ఆ రోల్ లో నేను కనిపించాలని, ఒక దర్శకుడు ఏదో ఒక రోజు ఫలానా సబ్జెక్ట్‌తో సినిమాను తీయాలని కోరుకోవడం చాలా కామన్ విషయం. అయితే చాలా మంది తమ డ్రీమ్ ప్రాజెక్ట్‌లను చేయలేరు. చాలా అరుదుగా మాత్రమే డ్రీమ్ ప్రాజెక్ట్‌లు అనేవి చేయడం జరుగుతుంది. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అనగానే అందరూ మహాభారతం అంటారు. ఆయన ఎన్నో సార్లు తాను మహాభారతం తీస్తాను అంటూ ప్రకటించాడు. అలాగే యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనగానే ఆయన అభిమానులతో పాటు, ఇండస్ట్రీ వర్గాల వారు చెప్పే పేరు మరుధనాయగం. ఈ ప్రాజెక్ట్‌ను కమల్ హాసన్ చేయాలని నాలుగు దశాబ్దాలుగా కోరుకుంటున్నాడట.
మరుధనాయగం సినిమాతో మళ్లీ...
కమల్ హాసన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మరుధనాయగంను 1996లో ప్రారంభించాడు. అప్పట్లో సౌత్ ఇండియన్ సినిమాల బడ్జెట్ రూ.10 నుంచి రూ.20 కోట్లు ఉండేది. రూ.20 కోట్లతో సినిమా తీస్తే అది భారీ బడ్జెట్ సినిమాగా చెప్పుకునే వారు. అలాంటి సమయంలో కమల్ హాసన్ తన స్వీయ దర్శకత్వంలో మరుధనాయగం సినిమాను ఏకంగా రూ.50 కోట్ల బడ్జెట్‌తో మొదలు పెట్టాడు. దాదాపు ఏడాదిన్నర పాటు సినిమాపై వర్క్ చేశాడు. టెస్ట్ షూట్ చేశాడు, కొన్ని రియల్ లొకేషన్స్ లో షూట్ చేశాడు, యాక్షన్ సీన్స్ తో పాటు చాలా ఖర్చు పెట్టి సినిమాను కొంత మేరకు షూట్ చేశాడు. అందుకు గాను దాదాపుగా రూ.5 కోట్లకు పైగా ఖర్చు చేశాడని అంటారు. కొన్నాళ్ల తర్వాత సినిమాను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఆర్థిక పరమైన ఇబ్బందుల కారణంగా సినిమాను ఆపేస్తున్నట్లుగా తమిళ మీడియాలో ప్రముఖంగా కథనాలు వచ్చాయి.
కమల్ హాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్ లో కదలిక...
మరుధనాయగం సినిమాకు సంబంధించి అప్పుడప్పుడు కమల్ హాసన్ మాట్లాడటం మనం చూస్తూనే ఉంటాం. అప్పట్లో తీసిన సీన్స్ ఇప్పటికీ ఆయన వద్ద భద్రంగా ఉన్నాయని అంటారు. ఎప్పటికి అయినా కమల్ దాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నాడు. అప్పట్లోనే రూ.50 కోట్ల బడ్జెట్ అయితే ఇప్పుడు కచ్చితంగా రూ.500 కోట్లకు పైగా బడ్జెట్ అయ్యే అవకాశం ఉంటుంది. కమల్ హాసన్ పై ఇప్పుడు రూ.500 కోట్ల బడ్జెట్ సాధ్యమా అంటే కచ్చితంగా రిస్క్ అనే వారు చాలా మంది ఉన్నారు. అయితే కమల్ కి ఉన్న స్టామినాతో వందల కోట్ల వసూళ్లు ఇప్పటికీ రాబట్టగలడు అనేది వాస్తవం. అందుకే ఇప్పటికీ కమల్ ఫ్యాన్స్ మరుధనాయగం సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఏదో ఒక సమయంలో కచ్చితంగా సినిమా పట్టాలెక్కుతోంది అనే నమ్మకంతో ఉన్నారు.
వీఎఫ్‌ఎక్స్‌తో మరుధనాయగం సినిమా
తాజాగా కమల్ హాసన్ నుంచి వచ్చిన స్పందన చూస్తూ ఉంటే ఎదురు చూపులకు తెర పడే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా 30 ఏళ్ల క్రితం పక్కన పెట్టిన మరుధనాయగం సినిమా మళ్లీ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గతంలో అనుకున్నట్లుగా కాకుండా ఏఐ టెక్నాలజీతో ఈ సినిమాను పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వీఎఫ్‌ఎక్స్ ను ఉపయోగించుకుని కమల్ హాసన్ అనుకున్న బడ్జెట్‌లో కేవలం 25 శాతం బడ్జెట్‌తో మరుధనాయగం సినిమాను పూర్తి చేసే అవకాశాలు ఉంటాయి అనేది కొందరి అభిప్రాయం. కమల్ వద్దకు ఆ ప్రస్థావన వచ్చిందని, కొన్ని వీఎఫ్‌ఎక్స్ కంపెనీలు ఇప్పటికే కమల్ ను ఆ దిశగా సంప్రదించాయి అంటూ ప్రచారం జరుగుతోంది.
కమల్ మరుధనాయగం సినిమా మళ్లీ మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పినప్పటికీ, అది ఏ విధంగా అనే విషయంలో క్లారిటీ లేదు. దాంతో కమల్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈ సినిమాను పూర్తి చేస్తే ఎంతో మంది దర్శకులకు కమల్ మార్గదర్శంగా నిలుస్తాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.