కృష్ణ జింకల వేట కేసుపై మూవీ: నటుడికి నిర్మాత లీగల్ నోటీసులు.. 50 లక్షల డిమాండ్!
నటుడు గోవింద్ నామ్‌దేవ్ చేసిన ఈ వ్యాఖ్యలపై నిర్మాత అమిత్ జాని తీవ్రంగా మండిపడ్డారు. నామ్ దేవ్ ఆరోపణలను ఖండిస్తూ ఎక్స్ (X) ద్వారా చట్టపరమైన చర్యల వివరాలను వెల్లడించారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 1998 నాటి కృష్ణజింకల వేట కేసు ఆధారంగా తెరకెక్కుతున్న `కాలా హిరణ్: ది బాటిల్ ఫర్ లెగసీ` చిత్రం చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి. తాజాగా ఈ సినిమా నిర్మాత అమిత్ జాని, సీనియర్ నటుడు గోవింద్ నామ్‌దేవ్‌కు లీగల్ నోటీసులు పంపడం చిత్ర పరిశ్రమలో తీవ్ర సంచలనంగా మారింది. ఈ ప్రాజెక్ట్ గురించి తనకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేశారని... అందుకే తాను ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు గోవింద్ నామ్‌దేవ్ బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో నిర్మాత ఈ చట్టపరమైన చర్యకు పూనుకున్నారు.
ఇటీవల అమర్ ఉజాలా పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గోవింద్ నామ్‌దేవ్ మాట్లాడుతూ.. తాను `సంభల్` అనే పేరుతో రూపొందుతున్న కోర్టు రూమ్ డ్రామా సినిమాలో నటించడానికి మాత్రమే అంగీకరించానని తెలిపారు. సల్మాన్ ఖాన్ కృష్ణజింకల కేసుకు సంబంధించిన కోర్టు విచారణల ఆధారంగానే ఈ సినిమా ఉంటుందని తనకు చెప్పారని పేర్కొన్నారు. ఇటీవల రిలీజైన టీజర్ చూసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని.. తనకు తొలిగా చెప్పిన కథకు, తీసిన దానికి అసలు ఎలాంటి సంబంధం లేదని ఆరోపించారు. తన మిత్రుడైన సల్మాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుని తీసే ఎలాంటి ప్రాజెక్ట్‌లోనూ తాను భాగస్వామిని కాలేనని స్పష్టం చేశారు.
నటుడు గోవింద్ నామ్‌దేవ్ చేసిన ఈ వ్యాఖ్యలపై నిర్మాత అమిత్ జాని తీవ్రంగా మండిపడ్డారు. నామ్ దేవ్ ఆరోపణలను ఖండిస్తూ ఎక్స్ (X) ద్వారా చట్టపరమైన చర్యల వివరాలను వెల్లడించారు. గోవింద్ నామ్‌దేవ్‌కు లీగల్ నోటీసు పంపాము. ఆయన 7 రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలి.. అలాగే మా ప్రొడక్షన్ హౌస్‌కు రూ. 50 లక్షల జరిమానా చెల్లించాలి. లేనిపక్షంలో కోర్టు ద్వారా కఠినమైన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది! అని హెచ్చరించారు. అంతేకాకుండా.. సినిమా కంటెంట్ గురించి నామ్‌దేవ్‌కు తెలియదనే మాటల్లో వాస్తవం లేదని, ఆయన కేవలం ఈ సినిమాకే కాకుండా దీని సీక్వెల్‌కు కూడా సంతకం చేశారని నిర్మాత స్పష్టం చేశారు.
మరోవైపు ఈ `కాలా హిరణ్` చిత్రం తన వ్యక్తిగత జీవితాన్ని, వాస్తవ సంఘటనలను పోలి ఉందంటూ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా ప్రమోషన్లు, విడుదల, పంపిణీపై తక్షణమే స్టే విధించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. తన అనుమతి లేకుండా,, తన వ్యక్తిత్వాన్ని .. పబ్లిసిటీ హక్కులను వాణిజ్య ప్రయోజనాల కోసం ఈ సినిమా ద్వారా అన్యాయంగా వాడుకుంటున్నారని సల్మాన్ లీగల్ టీమ్ కోర్టుకు తెలిపింది. చిత్రబృందం విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ పూర్తిగా తప్పుదోవ పట్టించేలా .. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని వారు వాదించారు.
ముఖ్యంగా ఆర్మ్స్(ఆయుధాల) యాక్ట్ కేసులో సల్మాన్ ఖాన్ ఇప్పటికే నిర్దోషిగా విడుదలైనా ఈ సినిమా పోస్టర్లలో సల్మాన్‌ను పోలిన ఒక పాత్ర చేతిలో తుపాకీ పట్టుకుని ఉన్నట్లు చూపించడంపై ఆయన లాయర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న అంశాలను ఇలా సినిమా రూపంలో చూపించడం వల్ల కొనసాగుతున్న కేసు విచారణలపైనా.. ప్రజల ఆలోచనలపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని వారు వాదించారు. ఈ వాదనలను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు.. `కాలా హిరణ్` చిత్రనిర్మాతలకు అధికారిక నోటీసులు జారీ చేస్తూ.. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.