విడాకులొచ్చేవరకు నా సినిమాలు విడుదల కావు: జయం రవి ఆవేదన!
తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా కొనసాగుతున్న జయం రవి (రవి మోహన్) తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణ తీవ్ర సంచలనానికి దారితీసింది.
తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా కొనసాగుతున్న జయం రవి (రవి మోహన్) తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణ తీవ్ర సంచలనానికి దారితీసింది. గాయని కెనీషాతో బ్రేకప్ పుకార్లు, భార్య ఆర్తీతో వివాహ బంధంలో తలెత్తిన వివాదాల నేపథ్యంలో అతడు తాజాగా ప్రెస్ మీట్ లో ఎమోషనల్ అయ్యారు. మీడియా ముందు కన్నీరు పెట్టుకున్న జయం రవి కోలీవుడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసే ఒక పెద్ద బాంబు పేల్చారు. ``నాకు అధికారికంగా విడాకులు వచ్చేంత వరకు నా కొత్త సినిమాలు ఏవీ థియేటర్లలో విడుదల కావు`` అని ఆయన తెగేసి చెప్పినట్టు డెక్కన్ హెరాల్డ్ తన కథనంలో పేర్కొంది. ఈ ప్రకటన ప్రస్తుతం తమిళ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న విపరీతమైన ట్రోలింగ్ తన వ్యక్తిగత జీవితాన్ని.. కెనీషాతో ఉన్న బంధాన్ని ఎంతలా ముక్కలు చేసిందో రవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ వేధింపుల వల్ల తాను మానసికంగా నరకం చూశానని.. తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యానని అంగీకరించారు. తన 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను డిఫెండ్ చేసుకుంటూ.. తన వృత్తిపరమైన .. వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న శక్తులకు ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు. నాకు జరిగిన అవమానాన్ని నేను భరించలేకపోతున్నాను. నన్ను ఇంకా రెచ్చగొట్టాలని చూస్తే ప్రయత్నించండి.. నేను ఇండస్ట్రీలో 23 ఏళ్లుగా కష్టపడుతున్నాను.. నా ట్రాక్ రికార్డ్ 95 శాతం క్లీన్‌గా ఉంది! అంటూ నిప్పులు చెరిగారు.
45 ఏళ్ల వయసులో ఆరోపణలా? తీవ్ర ఆవేదనలో జయం రవి
45 ఏళ్ల వయసులో తాను అందం వెనుక పరుగులు తీస్తున్నానంటూ వస్తున్న ఆరోపణలపై జయం రవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత రెండు దశాబ్దాలుగా పరిశ్రమలోని ఎంతోమంది అందమైన స్టార్ హీరోయిన్లతో తాను అత్యంత ప్రొఫెషనల్‌గా ఎటువంటి కంప్లైంట్ లేకుండా పనిచేశానని.. ఈ వయసులో తనపై ఇలాంటి బురదజల్లడం సిగ్గుచేటని అన్నారు. అంతేకాకుండా తాను కెరీర్‌లో సంపాదించిన సంపాదన అంతా పోయిందని.. ప్రస్తుతం తనకు కనీస ఆర్థిక స్వాతంత్య్రం కూడా లేకుండా పోయిందని ఒక చేదు నిజాన్ని బయటపెట్టారు. ఇదే సమయంలో తన వైవాహిక జీవితంలో ఇంతటి తుఫాను రేగడానికి మూడంకెల పేరున్న ఒక మహిళే కారణమంటూ అతడు ఒక నిగూఢమైన క్లూ ఇవ్వడం పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. జయం రవితో రిలేషన్‌షిప్‌కు బ్రేకప్ చెప్పినట్లు ప్రముఖ సింగర్ కెనీషా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పరోక్షంగా ప్రకటించారు. ``ఈ కథలోకి నేను ఎంతో సంతోషంగా వచ్చాను కానీ ఇప్పుడు సైలెంట్‌గా వెనుదిరుగుతున్నాను. ఒక వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో నేను జీవితంలో చాలా కోల్పోయాను`` అంటూ రాసుకొచ్చారు. భార్య ఆర్తీతో జయం రవి విడాకులు తీసుకోవడానికి కెనీషానే కారణమంటూ సోషల్ మీడియాలో నిరంతరం జరుగుతున్న ట్రోలింగ్ భరించలేకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. కెనీషా సోషల్ మీడియా పోస్ట్ పెట్టిన కొన్ని గంటల్లోనే రవి మీడియా ముందుకు రావడం గమనార్హం.
కోలీవుడ్‌లో ఎన్నో బాక్సాఫీస్ హిట్లు అందించి ఎంతో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న జయం రవికి గత కొన్ని సంవత్సరాలుగా కలిసిరావడం లేదు. ప్రస్తుతం అతడు తన జీవితంలోనే అత్యంత బ్యాడ్ ఫేజ్ ని అనుభవిస్తున్నారు. అయితే ఇప్పటివరకు తాను కేవలం తనను తాను కాపాడుకునేందుకే ప్రయత్నించానని.. ఇకపై సైలెంట్‌గా ఉండే ప్రసక్తే లేదని అతడు స్పష్టం చేశారు. డిఫెన్స్ మోడ్ నుండి యాక్షన్ మోడ్‌లోకి మారుతున్నానని... రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దామంటూ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ముగించారు. లీగల్ పరంగా తన పోరాటం కొనసాగుతుందని మీడియాకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.