హీరోయిన్‌తో అగ్ర నటుడి ఎఫైర్.. భార్య హుందాతనానికి హ్యాట్సాఫ్!
బాలీవుడ్ చరిత్రలో అమితాబ్ బచ్చన్, రేఖల మధ్య సాన్నిహిత్యం గురించి వచ్చినన్ని కథనాలు మరే ఇతర నటుల గురించి రాలేదు.;
బాలీవుడ్ చరిత్రలో అమితాబ్ బచ్చన్, రేఖల మధ్య సాన్నిహిత్యం గురించి వచ్చినన్ని కథనాలు మరే ఇతర నటుల గురించి రాలేదు. అయితే ఈ వివాదం ముదిరిన తరుణంలో జయా బచ్చన్ వ్యవహరించిన తీరు ఒక సాహసోపేతమైన, హుందాతనంతో కూడిన చర్యగా నిలిచిపోయింది. ఒకవైపు మీడియా కోడై కూస్తున్నా.. మరోవైపు పుకార్లు షికార్లు చేస్తున్నా.. జయ ఎక్కడా నిగ్రహం కోల్పోలేదు. అమితాబ్ ఊరిలో లేని సమయాన్ని చూసి.. జయాజీ నేరుగా రేఖను తన ఇంటికి విందుకు ఆహ్వానించడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది.
రేఖ ఆ ఆహ్వానాన్ని అందుకున్నప్పుడు కొంత ఆందోళన చెందినా కానీ.. జయా బచ్చన్ ఆమెను ఒక గౌరవప్రదమైన అతిథిగా స్వీకరించారు. ఆ రాత్రి విందులో ఎక్కడా అమితాబ్ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతూ.. కేవలం ఇంటి అలంకరణలు, తోట గురించి మాత్రమే చర్చించారు. తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ పరిస్థితిని ప్రశాంతంగా మార్చడంలో జయ చూపిన పరిణితి నేటి కాలంలో ఎంతో అరుదు. సమస్యలను రచ్చ చేసుకోకుండా నేరుగా సంబంధిత వ్యక్తితో చర్చించడం ద్వారా గందరగోళానికి అడ్డుకట్ట వేయవచ్చని జయా బచ్చన్ నిరూపించారు.
విందు ముగిసిన తర్వాత రేఖను సాగనంపుతూ గేటు వరకు వచ్చిన జయ.. ఒకే ఒక్క శక్తివంతమైన వాక్యం చెప్పారు. రేఖ కళ్లలోకి సూటిగా చూస్తూ ``అమిత్ నావాడు.. నావాడిగానే ఉంటాడు.. నేను ఎప్పటికీ అతడిని వదులుకోను`` అని స్పష్టం చేశారు. ఈ మాటలో శత్రుత్వం కంటే కూడా తన వైవాహిక బంధం పట్ల ఉన్న తిరుగులేని నమ్మకం, నిబద్ధత కనిపించాయి. ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు.. తన కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఒక స్త్రీ దృఢ సంకల్పానికి నిదర్శనం.
జయా బచ్చన్ అనుసరించిన ఈ విధానం నేటి తరం దంపతులకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. చిన్నపాటి మనస్పర్థలు రాగానే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ.. పబ్లిసిటీ కోసం ఆరాటపడే ఈ రోజుల్లో.. మౌనం- సంస్కారంతో సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చో ఆమె చూపించారు. అనవసరమైన వివరణలు ఇవ్వకుండా.. తన ప్రవర్తన ద్వారా బంధాన్ని నిలబెట్టుకోవడంలో జయా బచ్చన్ సఫలమయ్యారు. ఈ సంఘటన జరిగిన కొన్నాళ్లకే అమితాబ్-రేఖ కలిసి నటించిన చివరి సినిమా `సిల్సిలా` విడుదల కావడం.. ఆ సినిమా కథ కూడా వీరి నిజ జీవితానికి దగ్గరగా ఉండటం మరో సంచలనం.
ఓవరాల్ గా.. జయా బచ్చన్ ఒక ఆదర్శవంతమైన భార్యగా తన ఇంటిని, బంధాన్ని ఎలా కాపాడుకోవాలో ఆచరణలో చూపారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా రోడ్డున పడక.. పట్టుదలతో కుటుంబాన్ని ఏకం చేసిన ఈ సీనియర్ నటి సంకల్పం సినీ చరిత్రలో నిలిచిపోతుంది. బంధాలలో పరస్పర విశ్వాసం, హుందాతనం ఉంటే ఎటువంటి సుడిగుండాలనైనా దాటవచ్చని ఈ చారిత్రాత్మక సంఘటన మనకు గుర్తుచేస్తుంది. అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ 83 ఏళ్ల వయసులో నవయువకుడిలా ఉత్సాహంగా నటిస్తున్నారు అంటే స్థిరమైన భార్యామణి మద్ధతుగా నిలవడమే కారణం.