ఈ వారం బాక్సాఫీస్ ఫైట్ లో భలే ట్విస్ట్!
ఒక ఆసక్తికరమైన పోటీనీ ఈ వారం బాక్సాఫీస్ వద్ద మనం చూడబోతున్నాం. ఈ ఫైట్ కేవలం రెండు సినిమాల మధ్య కాదు, ఇద్దరు టాలెంటెడ్ వ్యక్తుల భవిష్యత్తుకు ఇది ఒక యూ టర్న్ లాంటిది.;
ఒక ఆసక్తికరమైన పోటీనీ ఈ వారం బాక్సాఫీస్ వద్ద మనం చూడబోతున్నాం. ఈ ఫైట్ కేవలం రెండు సినిమాల మధ్య కాదు, ఇద్దరు టాలెంటెడ్ వ్యక్తుల భవిష్యత్తుకు ఇది ఒక యూ టర్న్ లాంటిది. ఒకరు మంచి నటుడిగా పేరున్నా సరైన కమర్షియల్ బ్రేక్ కోసం చూస్తున్న హీరో.. మరొకరు ఒక సెన్సిబుల్ హిట్ ఇచ్చి, వెంటనే భారీ ఫ్లాప్‌తో డీలాపడ్డ డైరెక్టర్.
ఆ ఇద్దరే హీరో సుధీర్ బాబు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్. 'జటాధర' అంటూ ఈసారి ట్రెండింగ్‌లో ఉన్న ఫాంటసీ హార్రర్ జానర్‌తో సుధీర్ బాబు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆయనకు ఈ సినిమాతో కమర్షియల్ విజయం దక్కడం చాలా ముఖ్యం. మరోవైపు, 'చి ల సౌ'తో భేష్ అనిపించుకుని, 'మన్మథుడు 2'తో విమర్శల పాలైన రాహుల్ రవీంద్రన్.. 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాతో తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరంలో ఉన్నాడు.
యాదృచ్ఛికమో ఏమో కానీ, ఈ ఇద్దరూ ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద నేరుగా పోటీ పడుతున్నారు. సుధీర్ బాబు 'జటాధర', రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన 'ది గర్ల్ ఫ్రెండ్' ఒకేరోజు విడుదలవుతున్నాయి. వీరిద్దరిలో ఈ వారం విజయం ఎవరిని వరిస్తుందనేది ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇద్దరికీ సక్సెస్ చాలా కీలకం.
అసలు ట్విస్ట్ ఏమిటంటే.. ఈ శుక్రవారం ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్న వీళ్లిద్దరూ, ఆ తర్వాత కలిసి పనిచేయబోతున్నారు. సుధీర్ బాబు తన తదుపరి చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో చేయనున్నట్లు స్వయంగా ప్రకటించాడు. అంటే, ఈ వారం ఒకరి సినిమాపై ఒకరు పోటీ పడుతున్నా, భవిష్యత్తులో మాత్రం ఒకరి సక్సెస్ కోసం ఒకరు పనిచేయనున్నారు.
సుధీర్ బాబు మాటలను బట్టి చూస్తే, రాహుల్ రవీంద్రన్ చెప్పిన కథ మామూలుగా లేదట. "అదొక బాహుబలి తరహా సినిమా" అని, "ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని సెన్సేషనల్ కాన్సెప్ట్" అని సుధీర్ బాబు ఆకాశానికెత్తేశాడు. అంత భారీ ప్రాజెక్ట్‌కు వీరిద్దరూ చేతులు కలపాలంటే, ముందుగా ఈ శుక్రవారం వీరిద్దరూ తమ తమ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాల్సిన అవసరం ఉంది.
'ది గర్ల్ ఫ్రెండ్' హిట్టయితే రాహుల్ రవీంద్రన్ ఆ భారీ ప్రాజెక్ట్‌ను నడిపించగలడన్న నమ్మకం నిర్మాతలకు వస్తుంది. 'జటాధర' ఆడితే సుధీర్ బాబు మార్కెట్ పెరిగి, ఆ "బాహుబలి" రేంజ్ సినిమాకు తనే కరెక్ట్ అని ఫిక్స్ అవుతారు. మరి, కలిసి ఆ సంచలనం సృష్టించడానికి ముందు.. విడివిడిగా ఈ శుక్రవారం వీరు ఏం చేస్తారో చూడాలి.