క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో కేజీఎఫ్- కాంతారల‌ను ఆనాడే ఊహించిన మేటి న‌టి!

దివంగత నటి శ్రీదేవి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను త‌న‌ కుమార్తె, నటి జాన్వీ కపూర్ ఇటీవల `పెద్ది` ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

Update: 2026-05-30 08:18 GMT

సినీ ప్రపంచంలో తిరుగులేని నటిగా, అతిలోక సుందరిగా ఎదిగిన‌ దివంగత నటి శ్రీదేవి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను త‌న‌ కుమార్తె, నటి జాన్వీ కపూర్ ఇటీవల `పెద్ది` ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

భారతదేశంలోని దాదాపు అన్ని ప్రధాన భాషల్లో నటించిన శ్రీదేవికి, కన్నడ చలనచిత్ర పరిశ్రమ (సండల్‌వుడ్) అంటే ఎంతో ప్రత్యేకమైన గౌరవం- ఆప్యాయత ఉండేవని జాన్వీ తెలిపారు. కన్నడ ఇండస్ట్రీలో తాను పనిచేసిన రోజులను శ్రీదేవి ఎప్పుడూ ఎంతో మధురమైన జ్ఞాపకాలతో ఆత్మీయతతో స్మరించుకునేవారని పేర్కొన్నారు. ప్రతి చిత్ర పరిశ్రమకు ఒక ప్రత్యేకమైన శైలి, వ్యాపారం ఉన్నా కానీ.. కన్నడ చిత్ర పరిశ్రమ వాతావరణం తన తల్లికి ఎంతో మానసిక తృప్తిని ఇచ్చిందని జాన్వీ ఈ సందర్భంగా వివరించారు.

కన్నడ చిత్ర పరిశ్రమ గురించి మామ్ శ్రీదేవి తనతో ఎప్పుడూ చెప్పే రెండు ముఖ్యమైన విషయాలను జాన్వీ వెల్ల‌డించారు. నాటి కాలంలోనే కన్నడ ఇండస్ట్రీ ఎంతో `ప్రోగ్రెసివ్`గా ముందుకు సాగే ఆధునిక ఆలోచనలున్న ప‌రిశ్ర‌మ‌గా ఉండేదని.. అక్కడ రూపొందే కథాంశాలు ఎంతో వినూత్నంగా ఉండేవని శ్రీదేవి అభిప్రాయపడేవారట. దీనితో పాటు కన్నడ సినీ రంగం ఎంతో క్రమశిక్షణతో, పక్కాగా ఆర్గనైజ్డ్ చేసిన పరిశ్రమ అని.. అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరిలో తోటి నటీనటులపై ఎంతో ఆత్మీయత, ఆప్యాయత ...చ‌క్క‌ని అనుభూతి ఉండేవని శ్రీదేవి చాలా స్పష్టంగా చెప్పేవారని జాన్వీ కపూర్ పేర్కొన్నారు.

నాడు శ్రీదేవి కన్నడ పరిశ్రమ గురించి చెప్పిన మాటలు నేటి తరం సినిమాల విషయంలో నిజమవ్వడం గమనార్హం. ఒకప్పుడు కేవలం ఒక ప్రాంతీయ పరిశ్రమగా ఉన్న శాండల్‌వుడ్ నేడు తన కథల బలంతో దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. నాటి కాలంలోనే శ్రీదేవి వంటి ఒక అంతర్జాతీయ స్థాయి నటి కన్నడ సినిమాలోని పురోగమనాన్ని గుర్తించడం.. ఆ పరిశ్రమ ఉన్నత ప్రమాణాలను చేర‌డాన్ని గెస్ చేయ‌డం నిజంగా ఆస‌క్తిక‌రం. నేడు క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో కేజీఎఫ్‌, కాంతార వంటి ఫ్రాంఛైజీల‌తో పాన్ ఇండియాలో సంచ‌ల‌నం సృష్టించింది. దీనిని శ్రీ‌దేవి ఆనాడే ఊహించార‌నడంలో ఎలాంటి సందేహం లేదు.

అలా త‌న‌ను చూడ‌లేక టీవీ క‌ట్టేయ‌మ‌ని అడిగేవార‌ట‌:

శ్రీదేవి వెండితెరపై ఎంతో గ్లామరస్‌గా క‌నిపించినా.. నిజ జీవితంలో త‌న‌ స్వభావం దానికి పూర్తి భిన్నంగా ఉండేదని కూడా జాన్వీ గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా తన తల్లికి కుటుంబం పై ఉన్న నిబద్ధతను ఈ సందర్భంగా జాన్వీ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. సినిమా రంగానికి దూరంగా ఉన్న సమయంలో శ్రీదేవి పూర్తిగా తన కుటుంబం కోసమే సమయాన్ని కేటాయించారని జాన్వీ తెలిపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇంట్లో ఉన్నప్పుడు టీవీలో ఎప్పుడైనా ఆమె నటించిన పాత సినిమాలు వస్తే శ్రీదేవి ఎంతో సిగ్గుపడేవారట. ``ప్లీజ్.. ఆ ఛానల్ మార్చండి లేదా టీవీ కట్టేయండి`` అంటూ కంగారుపడుతూ... వాటికి బదులుగా చిన్న పిల్లలు చూసే యానిమేటెడ్ చిత్రాలు లేదా డిస్నీ సినిమాలు చూడటానికి ఇష్టపడేవారని జాన్వీ నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. ఒక అగ్ర నటిగా దేశాన్ని ఊపేసిన శ్రీదేవి... ఇంట్లో మాత్రం ఒక సాధారణ తల్లిగా, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉండటానికే ప్రాధాన్యత ఇచ్చేవారని దీనిని బట్టి అర్థమవుతుంది.



Tags:    

Similar News