'జైల‌ర్ 2' వాయిదాతో 'పెద్ది' రికార్డుల్ని ఇక‌ ఆపేదెవ‌రు?

బాక్సాఫీస్ రేసులో కొన్నిసార్లు విడుద‌ల తేదీ మారితే అది కొంద‌రికి ఆయాచిత వ‌రంగా మారుతుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో సరిగ్గా ఇదే జరగబోతోంది.

Update: 2026-05-19 17:35 GMT

బాక్సాఫీస్ రేసులో కొన్నిసార్లు విడుద‌ల తేదీ మారితే అది కొంద‌రికి ఆయాచిత వ‌రంగా మారుతుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో సరిగ్గా ఇదే జరగబోతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్ రోల్‌లో నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన‌ `జైలర్ 2` విడుదల తేదీ మార‌డం రామ్ చ‌ర‌ణ్‌ `పెద్ది`కి ఆయాచితంగా క‌లిసి రానుంది. నిజానికి జైల‌ర్ 2 చిత్రం జూన్ 12న విడుదల కావాల్సి ఉండగా.. తాజా సమాచారం ప్రకారం మేకర్స్ గణేష్ చతుర్థి పండుగ సెలవులను టార్గెట్ చేస్తూ సెప్టెంబర్ 11కి వాయిదా వేశారు. సన్ పిక్చర్స్ సంస్థ పక్కా బిజినెస్ స్ట్రాటజీతో పాన్-ఇండియా మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు తీసుకున్న ఈ నిర్ణయం.. టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న `పెద్ది` చిత్రానికి ఒక ఊహించని మెగా అడ్వాంటేజ్‌గా మారబోతోంది.

జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల కానున్న `పెద్ది` చిత్ర బృందానికి ఇది నిజంగా ఒక గొప్ప‌ శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే జూన్ 12న రావాల్సిన `జైలర్ 2` వాయిదా పడటంతో `పెద్ది` చిత్రానికి మొదటి వారం ముగిసిన తర్వాత కూడా రజనీకాంత్ లాంటి పెద్ద హీరోతో థియేట‌ర్ల షేరింగ్ ముప్పు ఉండదు. పెద్దిని `ఉప్పెన` దర్శకుడు బుచ్చిబాబు సనా సరికొత్త `రా అండ్ రస్టిక్`యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో అంచనాలు స్కై హైకి చేరగా.. తమిళనాడులో రజనీకాంత్ సినిమా రేసులో లేకపోవడం వల్ల చెన్నై వసూళ్లతో పాటు తంబీల రాష్ట్రంలో `పెద్ది` భారీగా కలెక్షన్స్ కొల్లగొట్టేందుకు లైన్ క్లియర్ అయ్యింది.

ఈ భారీ వాయిదా వల్ల `పెద్ది` చిత్రానికి జూన్ నెల అంతా బాక్సాఫీస్ వద్ద జీరో పోటీ వాతావరణం లభించనుంది. జూన్ చివరి వారంలో `మా ఇంటి బంగారం`, `లెనిన్` వంటి చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నా.. ఇండస్ట్రీ క్రేజ్ పరంగా గానీ, థియేటర్ల లభ్యత పరంగా గానీ అవి రామ్ చరణ్ రేంజ్‌కు పోటీగా నిలబడలేవని ట్రేడ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల జూన్ నెల మొత్తం థియేటర్లలో చరణ్ వసూళ్ల కుమ్ముడు షురూ అయినట్టేనని విశ్లేషిస్తున్నారు. సోలో రన్‌లో లాంగ్ వీకెండ్స్ దొరకడం వల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

మరోవైపు సెప్టెంబర్ 11న విడుదల కాబోతున్న `జైలర్ 2` చిత్రం కోసం సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యూహాన్ని సిద్ధం చేసింది. సెప్టెంబర్ 14న వచ్చే వినాయక చవితి పండుగ సెలవులను ఉపయోగించుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గోవా వంటి ప్రధాన మార్కెట్లలో లాంగ్ హాలిడే వీకెండ్ అడ్వాంటేజ్ సాధించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సీక్వెల్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పాటు లోకనాయకుడు కమల్ హాసన్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, మాలీవుడ్ లెజెండ్ మోహన్‌లాల్, టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వంటి దక్షిణాది దిగ్గజాలు నటిస్తుండటంతో ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదొక బిగ్గెస్ట్ క్రాస్ఓవర్ మూవీగా మారబోతోంది. వీరికి తోడు మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్ లీడ్ కేమియోల్లో కనిపించనుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

ఏదేమైనా `జైలర్ 2` వాయిదా నిర్ణయం వల్ల అటు రజనీకాంత్ చిత్రానికి భారీ పండుగ సెలవుల అడ్వాంటేజ్ దక్కనుండగా.. ఇటు జూన్ నెలలో సోలోగా వస్తున్న రామ్ చరణ్ `పెద్ది`కి తొలి ప‌ది రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద తిరుగులేని కలెక్షన్ల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకే ఒక్క రిలీజ్ డేట్ మార్పు టాలీవుడ్, కోలీవుడ్ బాక్సాఫీస్ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. పక్కా కమర్షియల్ హంగులతో సరికొత్త జోనర్‌లో బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న `పెద్ది` చిత్రం ఈ జూన్ లో ఎలాంటి పోటీ లేదుగనుక‌.. గోల్డెన్ పీరియడ్‌ను ఏ మేరకు వాడుకుని పాన్-ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

Tags:    

Similar News