స‌ల్మాన్ న‌టుడ‌వ్వ‌డానికి ఈ సీనియ‌ర్ సాయం చేసాడ‌ట‌

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ అజేయ‌మైన బాక్సాఫీస్ రికార్డ్ గురించి తెలిసిందే. ఆయ‌న‌ క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

Update: 2026-05-30 14:30 GMT

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ అజేయ‌మైన బాక్సాఫీస్ రికార్డ్ గురించి తెలిసిందే. ఆయ‌న‌ క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దశాబ్దాలుగా కోట్లాది మంది అభిమానుల హృదయాలను ఏల్తున్న సల్మాన్.. ఇండస్ట్రీలోకి తొలి అడుగు వేయ‌డం వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన నిజాన్ని సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. సల్మాన్ ఖాన్ ఇంకా స్టార్ కాకముందు అత‌డి ఫోటోలను త‌న‌ జేబులో పెట్టుకుని ముంబైలోని పలువురు నిర్మాతలు, దర్శకుల చుట్టూ స్వయంగా తిరిగానని జాకీ ష్రాఫ్ వెల్ల‌డించారు.

ఇండియా టుడేతో చిట్ చాట్ లో జాకీ ష్రాఫ్ మాట్లాడుతూ..``సల్లు బాబాకు (సల్మాన్) నేను మొదటి చిత్రమైన `బీవీ హో తో ఐసీ`లో అవకాశం వచ్చేలా చేశాను, ఆ తర్వాత వచ్చిన `మైనే ప్యార్ కియా` స్టార్‌గా మార్చింది`` అని చెప్పారు. ఒక షూటింగ్ సెట్‌లో సల్మాన్ ఫోటోలను చూసి అత‌డు చాలా హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడని భావించిన జాకీ.. ఆ ఫోటోలను దిగ్గజ దర్శకుడు సుభాష్ ఘాయ్ వద్దకు తీసుకెళ్లగా ఆయన నో చెప్పారట. ఆ తర్వాత కేసీ బొకాడియాను సంప్రదించగా అత‌డు తన బావమరిదికి చూపించమన్నారు. త‌ద్వారా సల్మాన్‌కు తొలి అవకాశం దక్కిందని సల్మాన్ కోసం తాను ప్రతిచోటా ఫోటోలు పట్టుకుని తిరిగేవాడినని జాకీ ష్రాఫ్ గుర్తుచేసుకున్నారు.

ఇక జాకీ ష్రాఫ్ వృత్తిపరమైన విషయానికి వస్తే.. జాతీయ అవార్డు గ్రహీత మనీష్ సైనీ దర్శకత్వం వ‌హించిన `ది గ్రేట్ గ్రాండ్ సూపర్‌హీరో` చిత్రం మే 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక తాత-మనవళ్ల మధ్య ఉండే ఆత్మీయ బంధానికి- ఏలియన్స్ అనే సరికొత్త థ్రిల్‌ను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో జాకీ ష్రాఫ్ ఎంతో హార్ట్ ట‌చింగ్ గా ఉండే కొత్త త‌ర‌హా పాత్రలో కనిపించగా.. ప్రతిక్ స్మితా పాటిల్, భాగ్యశ్రీ దాసాని, శరత్ సక్సేనా తదితరులు కీలక పాత్రలు పోషించారు. నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో కొనసాగుతున్న జాకీ ష్రాఫ్‌కు ఈ చిత్రం మరో వైవిధ్యమైన మైలురాయిగా నిలిచింది.

మరోవైపు సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రం `మాతృభూమి`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వం వ‌హించిన ఈ సినిమా క‌థాంశం ఆస‌క్తిక‌రం. భారత్-చైనా సైనికుల దేశభక్తి .. వారి కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో ఒక వార్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవల ఈ సినిమా రఫ్ కట్‌ను వీక్షించిన ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయ్ సోషల్ మీడియా వేదికగా సినిమాను ప్రశంసించారు. ఇదొక అద్భుతమైన ఎమోషనల్ వార్ డ్రామా అని.. ప్రతి ఒక్కరూ క‌చ్ఛితంగా చూడాల్సిన చిత్రమని చెప్తూ చిత్ర యూనిట్‌తో కలిసి దిగిన ఫోటోను ఆయన ఎక్స్‌లో షేర్ చేయ‌గా అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది.

నిజానికి `మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్` (గతంలో బ్యాటిల్ ఆఫ్ గల్వాన్) చిత్రం 17 ఏప్రిల్ 2026నే విడుదల కావాల్సి ఉంది. అయితే నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో ప్యాచ్ వర్క్ , పోస్ట్-ప్రొడక్షన్ పనుల కోసం మరికొంత సమయం కావాలని సల్మాన్ ఖాన్ భావించడంతో సినిమా కాస్త ఆలస్యమైంది. క్వాలిటీ పెంచడం కోసమే సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కెరీర్ ప్రారంభంలో ఒకరి సహాయంతో అడుగుపెట్టిన సల్మాన్ బాలీవుడ్ ని శాసించే స్థాయికి ఎదగడం అత‌డి ప‌ట్టుద‌ల‌, హార్డ్ వ‌ర్క్ కి నిదర్శనం.

Tags:    

Similar News