నోలాన్‌ని తట్టుకోవాలంటే భారతీయ సినిమా మేకింగ్ టెక్నిక్ మారాల్సిందేనా?
ఈ బడ్జెట్ పరిమితులను దాటడానికి భారతీయ చిత్ర పరిశ్రమ `ప్రాఫిట్ షేరింగ్` (లాభాల్లో వాటా) లేదా `ఈక్విటీ బేస్డ్` మోడల్ వైపు అడుగులు వేయాలి.
భారతీయ దర్శకులు హాలీవుడ్ స్థాయిలో ఐమాక్స్ సాంకేతికతతో గ్లోబల్ అప్పీల్ ఉన్న కథలను తెరకెక్కించాలంటే ప్రస్తుత బడ్జెట్ నిర్మాణ వ్యయాలలో విప్లవాత్మక మార్పులు రావాల్సి ఉందనే చర్చ మొదలైంది. మన పరిశ్రమలలో ఉన్న అతిపెద్ద లోపం ఏమిటంటే... మొత్తం బడ్జెట్‌లో 50 నుండి 60 శాతం కేవలం `హీరో రెమ్యునరేషన్`.. స్టార్ల వ్యక్తిగత సిబ్బంది ఖర్చులకే సరిపోతోంది. దీనివల్ల విజువల్ ఎఫెక్ట్స్ (VFX), హై-ఎండ్ ఐమాక్స్ కెమెరాల వినియోగం... అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులను ఎంచుకోవడానికి మేకర్స్‌కు తగినంత బడ్జెట్ మిగలడం లేదు. ఈ పాత పద్ధతి మారనంత కాలం.. స్క్రీన్ పై హాలీవుడ్ స్థాయి నాణ్యతను ఆశించడం కష్టమే అవుతుంది.
ఈ బడ్జెట్ పరిమితులను దాటడానికి భారతీయ చిత్ర పరిశ్రమ `ప్రాఫిట్ షేరింగ్` (లాభాల్లో వాటా) లేదా `ఈక్విటీ బేస్డ్` మోడల్ వైపు అడుగులు వేయాలి. హాలీవుడ్‌లో టామ్ క్రూజ్ వంటి అగ్ర హీరోలు సినిమా నిర్మాణ సమయంలో భారీ పారితోషికాలు తీసుకోకుండా.. బడ్జెట్ అంతా విజువల్స్ - ప్రొడక్షన్ క్వాలిటీపై పెట్టేలా సహకరిస్తారు. ఆ తర్వాత సినిమా సాధించే లాభాల్లో లేదా బాక్సాఫీస్ వసూళ్లలో ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వాటాను తీసుకుంటారు. మన దేశంలో కూడా స్టార్ హీరోలు ఈ తరహా బిజినెస్ మోడల్‌కు మెజారిటీ భాగం అంగీకరిస్తే.. మేకింగ్ కోసం వందల కోట్లు అందుబాటులోకి వస్తాయి. ఇది కేవలం సినిమా నాణ్యతను పెంచడమే కాకుండా.. ఫ్లాప్ అయినప్పుడు నిర్మాతలపై పడే నష్టాల భారాన్ని కూడా తగ్గిస్తుంది.
గ్లోబల్ మార్కెట్‌ను ఆకట్టుకోవాలంటే కేవలం స్థానిక స్టార్ ఇమేజ్ పైనే కాకుండా `కంటెంట్ వాల్యూ`పై పెట్టుబడి పెట్టాలి. ఐమాక్స్ వంటి లార్జ్ స్క్రీన్ ఫార్మాట్లకు సరిపోయేలా భారీ యాక్షన్ లేదా పౌరాణిక ఎపిక్స్ నిర్మించేటప్పుడు స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ (ముందస్తు ప్రణాళిక) కే ఎక్కువ సమయం- డబ్బు కేటాయించాలి. హాలీవుడ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉంటుంది కాబట్టి వారు రూ. 1000 కోట్లకు పైగా ఖర్చు చేయగలుగుతున్నారు. భారతీయ సినిమాలు కూడా ఆ స్థాయి బడ్జెట్లను రాబట్టాలంటే కేవలం సౌత్ లేదా నార్త్ మార్కెట్లకు పరిమితం కాకుండా చైనా, జపాన్, పాశ్చాత్య దేశాల ప్రేక్షకులను కూడా మెప్పించే యూనివర్శల్ కథలను ఎంచుకోవాలి. సాంకేతికతపై పెట్టే ఖర్చు వృథా కాదు.. అది సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే పెట్టుబడి అని మన పరిశ్రమలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది.
భారతదేశంపై నోలాన్ డామినేషన్ ఎందుకో తెలుసా?
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన సినిమాలు వస్తున్నాయి అంటే భారతదేశంలోని మల్టీప్లెక్సులకు పండుగే. ఆ సమయంలో భారతీయ స్టార్ల సినిమాల కంటే మల్టీప్లెక్సులకు నోలాన్ సినిమానే ఎక్కువ. ఇప్పుడు అతడు రూపొందించిన భారీ పీరియడ్ ఎపిక్ మూవీ `ది ఒడిస్సీ` జూలై 17న విడుదల కు వస్తుండడంతో ఆ ముప్పును తప్పుకోవడానికి బాలీవుడ్ చిత్రాలు తమ విడుదల తేదీలను సర్దుబాటు చేసుకుంటున్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ వారి భారీ స్పై యాక్షన్ చిత్రం `ఆల్ఫా` జూలై 10 నుండి జూలై 3కి ముందుకు రాగా... జూలై 17న రావాల్సిన మల్టీస్టారర్ కామెడీ మూవీ `ధమాల్ 4` జూలై 10 స్లాట్‌ను ఎంచుకుంది. సాధారణంగా పెద్ద చిత్రాలతో బాక్సాఫీస్ క్లాష్‌ను నివారించేందుకే ఇలాంటి వ్యూహాత్మక మార్పులు చేసినా.. మేకర్స్ మాత్రం వసూళ్లను గరిష్టంగా పెంచుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటిస్తున్నారు. ఏదేమైనా ఒక హాలీవుడ్ చిత్రం కారణంగా హిందీ చిత్ర పరిశ్రమ క్యాలెండర్ మొత్తం రీ-షెడ్యూల్ కావడం ఇండస్ట్రీ వర్గాలలో పెద్ద చర్చకు దారితీసింది.
ఈ తరహా భయాందోళనలకు ప్రధాన కారణం భారతదేశంలో క్రిస్టోఫర్ నోలన్‌కు ఉన్న అసాధారణమైన బ్రాండ్ ఇమేజ్ - ఐమాక్స్ (IMAX) మార్కెట్ క్రేజ్. `ది ఒడిస్సీ` ఎలాంటి సూపర్ హీరో ఫ్రాంచైజీలో భాగం కాకపోయినా.. హోమర్ గ్రీకు పురాణ కావ్యం అనే ఆసక్తికర అంశం .. మాట్ డామన్, టామ్ హాలండ్, జెండయా వంటి భారీ తారాగణం వల్ల సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. గతంలో `ఇంటర్ స్టెల్లార్`,`ఓపెన్‌హైమర్` చిత్రాలకు భారతీయ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం... ఇప్పుడు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరుగుతుండటంతో బాలీవుడ్ నిర్మాతలు అప్రమత్తమయ్యారు. కేవలం ఒక స్టార్ డైరెక్టర్ పేరు మాత్రమే భారతీయ మల్టీప్లెక్స్ మార్కెట్‌ను శాసించగలగడం... రానున్న రోజుల్లో సాంప్రదాయ కమర్షియల్ ఫార్ములాలను పక్కనబెట్టి ఒరిజినల్... డైరెక్టర్-డ్రివెన్ కంటెంట్‌ను నమ్ముకోవాలనే బలమైన సంకేతాన్ని దేశీయ పరిశ్రమలకు ఇస్తోంది.
హాలీవుడ్ దర్శకుడి బ్రాండ్ ఇమేజ్ భారతీయ మల్టీప్లెక్స్ థియేటర్లను, ప్రీమియం ఐమాక్స్ స్క్రీన్లను ఈ రేంజులో ప్రభావితం చేస్తున్న సీన్ చూస్తుంటే.. భవిష్యత్తులో దేశీయ భారీ బడ్జెట్ చిత్రాలు కూడా తమ థియేట్రికల్ విండోను కాపాడుకోవడానికి గ్లోబల్ రేంజ్ మేకింగ్ ఫార్మాట్ కి అలవాటు పడాల్సి ఉందని అర్థం చేసుకోవచ్చు.