'ఐబొమ్మ' .. దొంగ దొర‌క్కుండా చిక్కుముడి.. ఒణుకుతున్న టాలీవుడ్!

తెలుగు చలనచిత్ర పరిశ్రమను దశాబ్దాలుగా వేధిస్తున్న పైరసీ భూతం సరికొత్త రూపంలో మళ్లీ పంజా విసిరింది.

Update: 2026-05-18 08:18 GMT

తెలుగు చలనచిత్ర పరిశ్రమను దశాబ్దాలుగా వేధిస్తున్న పైరసీ భూతం సరికొత్త రూపంలో మళ్లీ పంజా విసిరింది. గతంలో సైబర్ క్రైమ్ పోలీసులు పకడ్బందీగా అడ్డుకుని మూయించేసిన టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ పైరసీ సైట్ `ఐబొమ్మ` ఇప్పుడు సరికొత్త డొమైన్‌తో మళ్లీ పుట్టుకొచ్చింది. ఐబొమ్మతో పాటు `బప్పం టీవీ` అనే మరో వెబ్‌సైట్ కూడా జతకలిసి సరికొత్త చిత్రాలను డిజిటల్ స్క్రీన్‌లపైకి తెస్తోంది. ఈ పరిణామంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఆదివారం నాడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. థియేటర్లలో విడుదలైన కొన్ని గంటల్లోనే కొత్త సినిమాలను, ప్రముఖ ఓటీటీ కంటెంట్‌ను ఈ సైట్లు అక్రమంగా స్ట్రీమింగ్ చేస్తుండటంతో చిత్ర పరిశ్రమలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఫిలిం ఛాంబర్ యాంటీ వీడియో పైరసీ సెల్ ప్రాజెక్ట్ హెడ్ యర్రా మణీంద్ర బాబు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. వాట్ ఈజ్ రివ్యూస్ బ్లాగ్ స్పాట్ డాట్ కాం, ఐబొమ్మమీడియా డాట్ కాం.. అనే వెబ్‌సైట్లను నడుపుతున్న గుర్తుతెలియని నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ కేటుగాళ్లు కేవలం సినిమాలను దొంగతనంగా ప్రసారం చేయడమే కాకుండా.. వాటి ద్వారా భారీ ఎత్తున చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ బెట్టింగ్ వేదిక‌లను కూడా ప్రమోట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ వంటి బహుభాషా చిత్రాలను ఉచితంగా అందిస్తూ.. వీక్షకులను ఆకర్షించడానికి ఐబొమ్మ, బప్పం లాంటి పాపులర్ పైరసీ బ్రాండ్లను వీరు వాడుకుంటున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ పైరసీ ముఠా చట్టాల కంటికి చిక్కకుండా అత్యంత అధునాతనమైన సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. గూగుల్ బ్లాగ్‌స్పాట్ ప్లాట్‌ఫామ్‌ను ఫ్రంట్-ఎండ్ పోర్టల్‌గా వాడుకుంటూ.. లోపల కస్టమ్ స్ట్రీమింగ్ ప్లేయర్‌లను అమర్చి ఎలాంటి అడ్డంకులు లేకుండా పైరేటెడ్ సినిమాలను ప్లే చేస్తున్నారు. సైబర్ పోలీసులు లేదా టెక్నికల్ అనలిస్టులు తమ సైట్లను ట్రాక్ చేయకుండా.. లోపల ఏముందో విశ్లేషించకుండా అడ్డుకోవడానికి వీరు `యాంటీ-ట్రాకింగ్`...`యాంటీ-డీబగ్గింగ్` కోడింగ్ మెకానిజమ్‌లను కూడా పొందుపరిచారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ స్థాయిలో దుర్వినియోగం చేస్తుండటం వల్ల పైరసీని ఇప్పట్లో అణచివేయడం అంత సులువు కాదనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.

సినిమాల దొంగతనంతో పాటు సమాజానికి తీవ్ర హాని కలిగించే మరో కోణాన్ని కూడా ఈ వెబ్‌సైట్లలో పోలీసులు గుర్తించారు. దేశంలో నిషేధించబడిన 1ఎక్స్ బెట్‌, 4రాబిట్ వంటి ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ అప్లికేషన్లను ఈ సైట్లు విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాయి. వినియోగదారులు సినిమా స్ట్రీమింగ్ ప్రారంభించే ముందు క‌చ్చితంగా ఈ జూదం ప్రకటనలను చూడాల్సిన విధంగా వారు సైట్‌ను డిజైన్ చేశారు. అంతేకాకుండా.. సినిమా చూసేటప్పుడు ఎవరైనా వీడియోను పాజ్ చేస్తే చాలు.. స్క్రీన్‌పై బెట్టింగ్ ప్రమోషన్లు ప్రత్యక్షమయ్యేలా వికృతమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఉచిత సినిమాల పేరుతో యువతను ఆన్‌లైన్ జూదం వైపు ఆకర్షించి.. వారి జీవితాలను గుల్ల చేసే పెద్ద కుట్ర ఇందులో దాగి ఉంది.

పరిస్థితి తీవ్రతను గమనించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) యాక్ట్, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌), తెలంగాణ గేమింగ్ యాక్ట్‌తో పాటు ఇటీవల అమల్లోకి వచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్-2025 కింద పలు నిబంధనలను జోడించి దర్యాప్తును ముమ్మరం చేశారు. కోట్లాది రూపాయల బడ్జెట్‌తో వందలాది మంది కార్మికుల శ్రమతో రూపుదిద్దుకునే సినిమా రంగాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం, సైబర్ విభాగాలు మరింత కఠినమైన యాక్షన్ ప్లాన్‌తో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News