తోపులంద‌రూ క‌లిసి డిసైడ్ చేసిన తోపు మెగాస్టార్: హైప‌ర్ ఆది

తన ప్రసంగంలో క్రికెట్ దిగ్గజాలతో మెగాస్టార్ చిరంజీవి ని పోలుస్తూ ఆది చెప్పిన ఉదాహరణ సభలో విశేషంగా ఆకట్టుకుంది.

Update: 2026-08-22 04:41 GMT

అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో నిర్వహించిన మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల్లో ప్రముఖ నటుడు, కమెడియన్ హైపర్ ఆది పాల్గొని తనదైన మార్కు పంచ్‌లతో ఎంతో భావోద్వేగంతో ప్రసంగించారు. ముఖ్యంగా 90ల తరానికి చిరంజీవి కేవలం ఒక సాధారణ హీరో మాత్రమే కాదని.. వన్ అండ్ ఓన్లీ లెజెండరీ ఇన్‌స్పిరేషన్ అని కొనియాడారు. మనం చందమామను చూస్తూ అన్నం తిన్నాం... చిరంజీవి గారిని చూస్తూ పెరిగాం, పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ అరిచాం.. రామ్ చరణ్ గారిని చూస్తూ గర్వపడుతున్నాం అంటూ మెగా అభిమానుల భావాలకు అద్దం పట్టారు. చిరంజీవి కేవలం అభిమానాన్ని కోరుకునే వ్యక్తి కాదని.. తన అభిమానులు తాము ఎంచుకున్న రంగంలో విజయం సాధించినప్పుడే తనకు అసలైన సంతోషం దక్కుతుందని నమ్మే గొప్ప మనసున్న వ్యక్తి అని వ్యాఖ్యానించారు.

తన ప్రసంగంలో క్రికెట్ దిగ్గజాలతో మెగాస్టార్ చిరంజీవి ని పోలుస్తూ ఆది చెప్పిన ఉదాహరణ సభలో విశేషంగా ఆకట్టుకుంది. క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్‌కు ఎన్నో అరుదైన రికార్డులు ఉన్నాయని.. కానీ తక్కువ వయసులో రావడం అనే రికార్డును వైభవ్ సూర్యవంశీ, ఎక్కువ సెంచరీలు సాధించిన రికార్డును విరాట్ కోహ్లీ, ఒంటిపై గాయాలను లెక్క చేయకుండా పోరాడే రికార్డును యువరాజ్ సింగ్, ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఉండే రికార్డును ఎం.ఎస్. ధోని అధిగమించారని వివరించారు. కానీ సినిమా రంగానికి వస్తే.. అద్భుతమైన డ్యాన్స్, నటన, చెక్కుచెదరని అభిమాన గణం.. వేలాది మందికి సహాయం చేసే గుణం వంటి విలక్షణమైన రికార్డులు సృష్టించిన ఏకైక వ్యక్తి చిరంజీవి అని.. ఈ రికార్డులను ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ కూడా చేయలేకపోయారని వ‌ర్ణించారు.

మెగా కుటుంబంలోని హీరోల ఫ్యాన్ బేస్ గురించి మాట్లాడుతూ ఆది ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈనాడు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ గార్లకు ఎవరికి వారికే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందనేది నిజమే అయినా... ఆ హీరోలందరికీ తెగిన మొట్టమొదటి టికెట్ మాత్రం మెగాస్టార్ అభిమానిదేనని గుర్తుపెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా నటులు, దర్శకులు, రచయితలు ఇలా సినీ పరిశ్రమకు వచ్చి రాణించాలనుకునే ప్రతి ఒక్కరికీ చిరంజీవి ప్రధాన ప్రేరణ అని చెప్పారు.

ఇతర భాషల సినిమాల్లో లేదా టాలీవుడ్‌లో ఎంత కలెక్షన్లు వచ్చాయనే గొడవలు నిరంతరం జరుగుతుంటాయని... కానీ `మా హీరో ఇన్ని కోట్లు సంపాదించాడు` అనే స్థాయి నుంచి `మా హీరో ఇన్ని కోట్లు దానం చేసి పంచిపెట్టాడు` అని విలువల గురించి మాట్లాడుకునే స్థాయిని తీసుకొచ్చిన ఏకైక హీరో చిరంజీవి అని కొనియాడారు. అమితాబ్ బచ్చన్ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వేటూరి సుందరరామమూర్తి, కే బాలచందర్, రజినీకాంత్, కమల్ హాసన్, మహేష్ బాబు, ప్రభాస్ వరకు ప్రతి ఒక్క ప్రముఖుడు చిరంజీవి గొప్పతనాన్ని అంగీకరించారని గుర్తుచేశారు. ఈ తోపులంద‌రూ క‌లిసి డిసైడ్ చేసిన తోపు మెగాస్టార్ అని హైప‌ర్ ఆది ఎమోష‌న్ స్పీచ్ తో క‌ట్టి ప‌డేసారు. ఇండస్ట్రీలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా... కష్టం వచ్చినా ఆదుకునే ఏకైక వృక్షం జూబ్లీహిల్స్‌లో ఉన్న చిరంజీవి గారని అభివర్ణించారు.

ఇటీవలి కాలంలో చిరంజీవి పై వచ్చే ప్రతికూల వార్తలపైనా.. ట్రోల్స్‌పైనా ఆది తీవ్ర స్థాయిలో స్పందించారు. చిరంజీవి గారు తొక్కేశారు అని ప్రచారం చేసేవారికి గట్టి కౌంటర్ ఇస్తూ.. తెలుగు ఇండస్ట్రీలో 30 ఏళ్ల పాటు నెంబర్ వన్‌గా కొనసాగి ఇతరుల అహంకారాన్ని, భ్రమలను, నెగిటివ్ మైండ్‌సెట్‌ను తొక్కేశారని వ్యాఖ్యానించారు. బాక్సాఫీస్ కలెక్షన్లు, అద్భుతమైన డ్యాన్స్, సేవా గుణం ద్వారా కొత్త ఒరవడి సృష్టించి కొడుకుని కూడా తనను మించిన స్థాయిలో తీర్చిదిద్దారని చెప్పారు. అలాంటి మహోన్నత వ్యక్తిని ట్రోల్ చేయడం వల్ల ఆయన ఖ్యాతి ఏమాత్రం తగ్గదని.. శ్రీరాముడు ఏ విధంగా ధర్మానికి ఆదర్శమో... తెలుగు సినీ ప్రేమికులకు చిరంజీవి అంతటి ఆదర్శనీయుడనే ప్ర‌శంస‌తో స్పీచ్ ని ముగించారు.



Tags:    

Similar News