అగ్ర‌ నిర్మాత‌కు చీవాట్లు.. లైంగికంగా వేధించినా స‌మ‌ర్థిస్తున్నాడా?

ఇటీవ‌ల కేన్స్ - 2025 ఉత్స‌వాల్లో `హోమ్ బౌండ్` సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు స్టాండింగ్ ఒవేష‌న్ ల‌భించిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-06-01 10:30 GMT

ఇటీవ‌ల కేన్స్ - 2025 ఉత్స‌వాల్లో `హోమ్ బౌండ్` సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు స్టాండింగ్ ఒవేష‌న్ ల‌భించిన సంగ‌తి తెలిసిందే. ఫ్లాపుల‌తో రేసులో వెన‌క‌బ‌డ్డ‌ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ కి ఈ క‌ల్ట్ సినిమా మంచి గుర్తింపును గౌర‌వాన్ని ఇచ్చింది. అయితే ఈ సినిమా కోసం ప‌ని చేసిన అసిస్టెంట్ సినిమాటోగ్రాఫ‌ర్ ప్ర‌తీక్ షాపై ఇప్పుడు లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు రావ‌డం సంచ‌ల‌న‌మైంది.

అత‌డు సెట్లో మ‌హిళ‌ను వేధించాడ‌నేది ఆరోప‌ణ‌. అయితే షా లైంగికంగా వేధించాడ‌నే ఆరోప‌ణ‌లు త‌మ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ దృష్టికి ఎవ‌రూ తీసుకురాలేద‌ని క‌ర‌ణ్ జోహార్ కి చెందిన ధ‌ర్మ ప్రొడ‌క్షన్స్‌ ప్ర‌క‌టించింది. లైంగిక వేధింపుల‌ను తాము తీవ్రంగా ప‌రిగ‌ణిస్తామ‌ని, దానిని స‌హించ‌లేమ‌ని కూడా వెల్ల‌డించింది. అయితే ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ఇన్ స్టా ప్ర‌క‌ట‌నపై తీవ్ర విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. దీంతో ఇన్ స్టా ఖాతాను సైతం స‌ద‌రు సంస్థ తొల‌గించాల్సి వ‌చ్చింది.

తాజాగా ధర్మ ప్రొడక్షన్స్ స్పందిస్తూ, సినిమా నిర్మాణ సమయంలో షాపై ఎటువంటి అధికారిక ఫిర్యాదులు అంద‌లేదని స్పష్టం చేసింది. "ధర్మ ప్రొడక్షన్స్‌లో, మాతో ఏ హోదాలోనైనా పనిచేసే ఏ వ్యక్తి పట్లనైనా అనుచిత ప్రవర్తన , లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మేం జీరో-టాలరెన్స్ విధానాన్ని అనుస‌రిస్తున్నాము. లైంగిక వేధింపుల కేసులను చాలా తీవ్రంగా పరిగణిస్తాం" అని పేర్కొంటూ నిర్మాణ సంస్థ నుండి అధికారిక‌ ప్రకటన విడుదలైంది. 'హోమ్‌బౌండ్'లో ఫ్రీలాన్స్ సినిమాటోగ్రాఫర్‌గా పరిమిత కాలం మాత్ర‌మే షా ప‌ని చేసార‌ని ధ‌ర్మ సంస్థ ప్ర‌క‌టించింది. ఈ కాలంలో లైంగిక వేధింపుల నివారణ (POSH) మార్గదర్శకాల కింద ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీకి ఎటువంటి ఫిర్యాదులు అంద‌లేద‌ని స‌ద‌రు నిర్మాణ సంస్థ చెప్పింది. అత‌డి కాంట్రాక్ట్ ముగిసింది.. ప‌ని చేసే స‌మ‌యంలో ఫిర్యాదులేవీ లేవ‌ని ధ‌ర్మ స‌స్థ పేర్కొంది.

కేన్స్-2025 ఉత్స‌వాల‌లో ప్ర‌ద‌ర్శిత‌మైన `హోమ్‌బౌండ్` అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, అదార్ పూనవల్లా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా నిర్మించారు. ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్, విశాల్ జెత్వా త‌దిత‌రులు న‌టించారు.

Tags:    

Similar News