మీర్జాపూర్ బ్యూటీకి ఐకాన్ స్టార్ ఫిదా!

ఓటీటీ వేదికగా విడుదలై సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ `మీర్జాపూర్` ఎంతటి ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన‌ లేదు.

Update: 2026-08-22 00:30 GMT

ఓటీటీ వేదికగా విడుదలై సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ `మీర్జాపూర్` ఎంతటి ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన‌ లేదు. ఈ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో డింపి పండిట్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన యువ నటి హర్షిత గౌర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ షో పట్ల ప్రదర్శించిన ఆసక్తి - అంకితభావం గురించి ఆమె గుర్తు చేసుకున్నారు.

`మీర్జాపూర్` సిరీస్ చూసిన అల్లు అర్జున్ తనను ఎంతగానో అభినందించారని హర్షిత వెల్లడించారు. ఈ వెబ్ సిరీస్‌లోని త‌న‌ నటనను ఎంతగా ఇష్టపడ్డార‌న్నారు. బ‌న్నీ స్వయంగా తనకు ఫోన్ చేసి ప్రశంసల వర్షం కురిపించారని పేర్కొన్నారు. ఒక స్టార్ హీరో తన నటనను గుర్తించి మెచ్చుకోవడం తన కెరీర్‌లో ఎప్పటికీ మరువలేని మధురమైన జ్ఞాపకమని సంతోషం వ్యక్తం చేశారు.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఉన్న గొప్ప నటులలో అల్లు అర్జున్ ఒకరని.. ఆయన కేవలం సినిమాలతోనే కాకుండా ఇతర నటుల ప్రతిభను కూడా నిత్యం గమనించి ప్రోత్సహిస్తుంటారని హర్షిత ఆనందం వ్య‌క్తం చేసారు. భాషా భేదాలతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న ప్రాజెక్ట్‌లను ఆయన ఎప్పుడూ ఆదరిస్తారని, `మీర్జాపూర్` సిరీస్ పట్ల బ‌న్నీ చూపిన ఆదరణే ఇందుకు నిదర్శనమని తెలిపారు.

సౌత్ - నార్త్ సినిమా పరిశ్రమల మధ్య దూరం తగ్గిపోయి పాన్-ఇండియా సంస్కృతి బలపడుతున్న తరుణంలో ఇలాంటి పరస్పర అభినందనలు నటులకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయని నటి పేర్కొన్నారు. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో స్వయంగా తన పనిని గుర్తించి మెచ్చుకోవడం తనలో మరింత బాధ్యతను పెంచిందని భవిష్యత్‌లో మరిన్ని మంచి పాత్రలు చేయడానికి బ‌న్నీ ప్రోత్సాహం ఎంతో ప్రేరణనిచ్చిందన్నారు.

ప్రస్తుతం ఈ విష‌యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ అభిమానులు ఈ వార్తను ట్రెండ్ చేస్తుండగా ఐకాన్ స్టార్ వినయపూర్వక స్వభావం .. ఇతర కళాకారులను గౌరవించే తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇండస్ట్రీలో ఒకరినొకరు ప్రోత్సహించుకునే సంస్కృతి మరింత మందికి ఆదర్శంగా నిలుస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం విభిన్నమైన ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న హర్షిత గౌర్ `మీర్జాపూర్` సిరీస్ ద్వారా తనకు దక్కిన గుర్తింపును ఎప్పటికీ మరువలేనని తెలిపారు. ఓటీటీ వేదికల ద్వారా నటులకు వస్తున్న అద్భుతమైన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్‌లో మరిన్ని వైవిధ్యమైన పాత్రల్లో నటించ‌డానికి తాను సిద్ధంగా ఉంటాన‌ని స్పష్టం చేశారు. అలాగే బ‌న్నీ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న‌ పాన్ ఇండియా చిత్రం `రాకా` షూటింగ్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News