పవన్‌ పర్ఫార్మెన్స్‌కి బద్దలైపోయిద్ది : హరీష్ శంకర్‌

పవన్ కళ్యాణ్‌ హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా రూపొందిన ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమా విడుదలకు రెడీ అవుతోంది.;

Update: 2026-03-13 06:09 GMT

పవన్ కళ్యాణ్‌ హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా రూపొందిన ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పాటలు మంచి స్పందన దక్కించుకున్నాయి. తాజాగా మరో పాటను సినిమా నుంచి విడుదల చేయడం ద్వారా అంచనాలు మరింత పెంచే ప్రయత్నం చేశారు. కాలరే ఎత్తరా.. అంటూ సాగే పాటలో పవన్‌ కళ్యాణ్‌తో కలిసి రాశి ఖన్నా ఆడి పాడింది. ఈ పాట విడుదల కార్యక్రమం లాంచనంగా జరిగింది. చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు సాంకేతిక నిపుణులు, ఇంకా ఇండస్ట్రీకి చెందిన మరికొందరు, మీడియా ప్రముఖులు పలువురు హాజరు అయ్యారు. ఈ పాట విడుదల కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్‌ మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊగి పోయేలా చేశాడు. పవన్ నుంచి ఏం ఆశిస్తున్నారో అదే ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా మరోసారి బల్ల గుద్దినట్లుగా చెప్పుకొచ్చాడు.

పవన్‌ కళ్యాణ్‌ గారితో సినిమా...

దర్శకుడు హరీష్ శంకర్‌ మాట్లాడుతూ... పవన్‌ కళ్యాణ్‌ గారితో సినిమా చేసే అవకాశం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటే అది నాకు దక్కడం సంతోషంగా ఉంది. ఆయనతో సినిమా అనగానే హీరోయిన్ రాశి ఖన్నా కనీసం కథ కూడా వినకుండా చేస్తాను అంటూ ఓకే చెప్పింది. కథ కూడా వినకుండానే ఓకే చెప్పిన రాశి ఖన్నా గారికి కృతజ్ఞతలు. ఈ పాటలో రాశి ఖన్నా మంచి డాన్స్‌ తో అదరగొట్టారు. పవన్‌ కళ్యాణ్ గారితో ఆమె చేసిన డాన్స్‌ తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందనే విశ్వాసంను వ్యక్తం చేశాడు. ఈ పాట కోసం ఏకంగా 1500 మంది నుంచి 2000 మందిని వినియోగించి చిత్రీకరించడం జరిగింది. పవన్‌ కళ్యాణ్ గారు ఈ పాటలో వేసిన స్టెప్స్ కి ఫ్యాన్స్ నుంచి మాత్రమే కాకుండా అన్ని వర్గాల నుంచి కూడా పాజిటివ్‌ రెస్పాన్స్ రాబోతుంది. తప్పకుండా ఫ్యాన్స్ కి ఈ పాట మంచి కిక్ ఇచ్చే పాట అవుతుందని ఆయన చెప్పుకొచ్చాడు.

దేవి శ్రీ ప్రసాద్‌ మరోసారి కుమ్మేశాడు...

కళ్యాణ్‌ గారు ఈ పాటను ప్రాణం పెట్టి చేశారు. దేవి శ్రీ ప్రసాద్‌ మరోసారి చక్కని సంగీతాన్ని అందించడం ద్వారా ఫ్యాన్స్‌కి ఒక మంచి అనుభూతిని కల్పించబోతున్నారు. ఈసారి పవన్‌ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్‌ బద్దలైపోయిద్ది అని నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను. ఎందుకంటే సెకండ్‌ హౄఫ్ లో ఆయన చేసే ఇంటెన్స్‌ సీన్స్‌ ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేస్తాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు ఎక్కడ కూడా రాజీ పడకుండా సినిమాను భారీ ఎత్తున ఖర్చు చేసి నిర్మించారు. ఈ పాట కోసం కూడా భారీ ఎత్తున ఖర్చు చేశారు. ఇలాంటి నిర్మాతలు దొరకడం నా పూర్వజన్మ సుకృతం అన్నాడు. పవన్‌ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలోనూ మోటివేట్‌ చేస్తూ ఉండేవారు. ఆయన సెట్‌ లో ఉన్నంత సమయం చాలా ఎనర్జిటిక్ గా ఉండేది. అంత మందితో డాన్స్ చేయాలా అని మొదట సరదాగా అడిగారు. ఆ తర్వాత అన్నట్లుగా చేశారని హరీష్ శంకర్‌ చెప్పుకొచ్చాడు.

పవన్‌ కళ్యాణ్‌ గబ్బర్ సింగ్‌ రేంజ్‌లో...

పవన్‌ కళ్యాణ్‌, హరీష్ శంకర్‌ కాంబోలో గతంలో వచ్చిన గబ్బర్‌ సింగ్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా సూపర్‌ హిట్‌ నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరోసారి గబ్బర్‌ సింగ్‌ రేంజ్ హిట్‌ లోడింగ్ కాబోతుంది అంటూ మొదటి నుంచి అభిమానులు చాలా బలంగా నమ్ముతున్నారు. పవన్‌ కళ్యాణ్ కి గుడ్‌ టైం నడుస్తోంది. ఆయన కచ్చితంగా ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం మాత్రమే కాకుండా, ఓజీ సినిమా తరహాలో మరోసారి ఫ్యాన్స్ కి ఫుల్‌ మీల్స్ వంటి సినిమాను ఇవ్వబోతున్నారనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. బిజీగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ ప్రమోషన్స్‌ కి హాజరు కాలేక పోతున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ట్రైలర్ విడుదల కోసం అభిమానులతో పాటు అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.






Tags:    

Similar News