చిన్నగా మొదలైన హిందీ హనుమాన్.. ఇప్పుడు హోంబలేతో..
దాదాపు రూ.2 కోట్ల బడ్జెట్‌తో తీసిన ‘హనుమాన్ అంష్’ నాలుగో వారం వరకు థియేటర్లలో నిలబడింది.
‘హనుమాన్ అంష్’ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. ఇది ఆగస్టు 7న హిందీలో విడుదలైన చిన్న బడ్జెట్ భక్తి చిత్రం. నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా విశాల్ చతుర్వేది తెరకెక్కించారు. పెద్ద స్టార్ కాస్ట్ లేదు, భారీ ప్రమోషన్ కూడా జరగలేదు. మొదటి రోజు ఇండియాలో రూ.10 లక్షల దగ్గరే ఓపెన్ అయింది. కానీ అక్కడి నుంచి మౌత్ టాక్‌తో సినిమా ఊహించని రేంజ్‌లో పెరిగింది. ఇప్పుడు అదే సినిమా ఓవర్సీస్ రిలీజ్‌కు సిద్ధమైంది.
దాదాపు రూ.2 కోట్ల బడ్జెట్‌తో తీసిన ‘హనుమాన్ అంష్’ నాలుగో వారం వరకు థియేటర్లలో నిలబడింది. 27 రోజులకు ఇండియా నెట్ రూ.61 కోట్లకు పైగా చేరినట్టు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మొదటి వారం నెమ్మదిగా వెళ్లిన సినిమా, తర్వాతి రోజుల్లో కలెక్షన్స్ పెంచుకుంది. పెట్టిన బడ్జెట్‌తో పోలిస్తే చాలా పెద్ద రిటర్న్ రావడంతో ఒక్కసారిగా బాలీవుడ్‌లో ఈ సినిమా గురించి మాట్లాడటం మొదలైంది.
సినిమా నీమ్ కరోలి బాబా భక్తి, సేవ, హనుమంతుడిపై ఉన్న నమ్మకం చుట్టూ సాగుతుంది. ‘డివైన్ డీటూర్’ అనే పుస్తకం ఆధారంగా కథను తీసుకున్నారు. శోభినవ్ సత్యా ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పటివరకు హిందీ మార్కెట్‌లోనే నడిచిన ఈ చిన్న సినిమాకు ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్ ఎంట్రీ ఇచ్చింది.
‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘సలార్’ లాంటి పెద్ద సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంస్థ, ‘హనుమాన్ అంష్’ ఓవర్సీస్ రిలీజ్ బాధ్యత తీసుకుంది. హోంబలే ఓవర్సీస్ ద్వారా సెప్టెంబర్ 11 నుంచి అంతర్జాతీయ మార్కెట్లలో సినిమాను విడుదల చేయబోతున్నారు. ఫార్స్ ఫిల్మ్ కూడా ఈ రిలీజ్‌లో భాగమవుతోంది.
రూ.2 కోట్ల చిన్న సినిమా, రూ.10 లక్షల ఓపెనింగ్ నుంచి మొదలై నెల రోజుల్లోనే ఇలాంటి పెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ దగ్గరకు వెళ్లడం హైలైట్. పైగా నీమ్ కరోలి బాబాకు విదేశాల్లో కూడా ఫాలోయింగ్ ఉంది. అందుకే ఇండియాలో వచ్చిన రెస్పాన్స్ ను చూసిన తర్వాత ఓవర్సీస్‌లో కూడా సినిమాకు మంచి అవకాశం ఉందని హోంబలే భావించినట్టు కనిపిస్తోంది.
సెప్టెంబర్ 11 నుంచి ‘హనుమాన్ అంష్’కు కొత్త లెక్క మొదలవుతుంది. ఇండియాలో మౌత్ టాక్‌తో పెరిగిన సినిమాకు ఓవర్సీస్‌లో మాత్రం మొదటి నుంచే పెద్ద రిలీజ్ దొరకబోతోంది. ఏయే దేశాల్లో, ఎన్ని స్క్రీన్స్‌లో విడుదల చేస్తారన్న పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉన్నాయి. హిందీలో ఎలాంటి అంచనాలు లేకుండా మొదలైన ఈ సినిమా, ఇప్పుడు విదేశాల్లో ఎంత దూరం వెళ్తుందన్నది చూడాలి.