ఆన్‌లైన్ కలుషితానికి ఆధ్యాత్మిక సినిమాలే సమాధానం!
సాంకేతికత ఎంతగా పురోగమిస్తోందో? దాన్ని దుర్వినియోగం చేసే ధోరణి కూడా అంతే వేగంగా పెరుగడం నేటి సమాజంలో తీవ్రమైన ఆందోళనకర అంశంగా మారింది.
సాంకేతికత ఎంతగా పురోగమిస్తోందో? దాన్ని దుర్వినియోగం చేసే ధోరణి కూడా అంతే వేగంగా పెరుగడం నేటి సమాజంలో తీవ్రమైన ఆందోళనకర అంశంగా మారింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత 'డీప్‌ఫేక్' టెక్నాలజీతో సెలబ్రిటీల నుండి సామాన్య మహిళల వరకు ఎంతోమంది సైబర్ వేధింపులకు గురవుతున్నారు. వికృత ఆనందం కోసం ఆకతాయిలు సృష్టిస్తున్న నకిలీ వీడియోలు, ఫోటోలు మహిళల వ్యక్తిత్వ హననానికి కారణమవుతున్నాయి. సాంకేతిక పురోగతి అనేది సమాజ శ్రేయస్సుకు దోహదపడాలి కానీ ఇలాంటి మానసిక వైకల్యానికి వేదికగా మారడం శోచనీయం.
ఆన్‌లైన్ డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న కలుషిత ధోరణికి అడ్డుకట్ట పడాలంటే కేవలం చట్టాలు, పోలీసు చర్యలు మాత్రమే సరిపోవు. అంతకుమించి మానవ ఆలోచనా విధానంలో, వ్యక్తిత్వంలో ప్రాథమిక మార్పు రావడం ఎంతో అవసరం. ఆకతాయిలు, నేరపూరిత మనస్తత్వం ఉన్నవారు ప్రవర్తనను మార్చుకోవాలంటే వారిలో భయం, భక్తి, నైతిక విలువల పట్ల స్పృహ కలగాలి. యువత ఆలోచనలు దిగజారిపోకుండా, సరైన దిశలో పయనించాలంటే వారికి చిన్నతనం నుంచే ధర్మం, నైతికత, పరస్త్రీ గౌరవం వంటి ఆధ్యాత్మిక మూలాలను అందించాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది.
ఈ తరహా సామాజిక, మానసిక మార్పును తీసుకురావడంలో సినిమా మాధ్యమం అత్యంత బలమైన సాధనంగా పనిచేస్తుంది. యువతపై వినోద పరిశ్రమ ప్రభావం ఎంతగానో ఉంటుంది. కాబట్టి ఆన్‌లైన్ చెడు సంస్కృతికి ఆధ్యాత్మిక , నైతిక కథాంశాలతో కూడిన చిత్రాలే సరైన సమాధానంగా నిలుస్తాయి. ఈ క్రమంలోనే `హనుమాన్ అంశ` వంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న చిత్రాలు సమాజానికి ఎంతో అవసరం. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి 400 కోట్ల వసూళ్లను సాధించిన `హనుమాన్ అంశ` విజయం వెనుక ఉన్న రహస్యం.. మన సంస్కృతి, ధర్మం భక్తిలోని విశిష్టతే.
ఇలాంటి సినిమాల ద్వారా నేటి యువతకు భగవంతుడి పట్ల భయం, భక్తితో పాటు సమాజం పట్ల బాధ్యత అలవడుతుంది. `హనుమాన్ అంశ` వంటి చిత్రాలు రక్తికట్టించే వినోదాన్ని మాత్రమే కాకుండా అంతర్లీనంగా సనాతన ధర్మంలోని గొప్ప విలువలను, చెడుపై మంచి సాధించే విజయాన్ని స్పష్టంగా చాటిచెబుతాయి. డిజిటల్ మాధ్యమాల్లో తప్పుదోవ పడుతున్న యువతలో విచక్షణను రేకెత్తించడానికి వారి ఆలోచనా విధానాన్ని కలుషితం కాకుండా కాపాడటానికి ఇలాంటి ఆధ్యాత్మిక కాన్సెప్ట్‌లు దివ్యౌషధంగా పనిచేస్తాయి.
సాంకేతికతను ఉపయోగించి మహిళలను వేధించడం, సోషల్ మీడియాలో అసభ్యకరమైన కంటెంట్‌ను వ్యాప్తి చేయడం లాంటి వైపరీత్యాలకు అడ్డుకట్ట పడాలంటే? ఆన్-స్క్రీన్ పై ధర్మాన్ని నిలబెట్టే కథానాయకులను చూపించాలి. పరస్త్రీని గౌరవించడం, బలహీనులకు అండగా నిలవడం, సమాజ శ్రేయస్సు కోసం జీవించడం లాంటి సత్గుణాలను యువత చిన్నతనం నుంచే అలవర్చుకునేలా పరిశ్రమ నడుచుకోవాలి. వ్యాపార కోణంలోనే కాకుండా సామాజిక బాధ్యతగా ఆధ్యాత్మిక విలువలు చాటే చిత్రాలను దర్శక, నిర్మాతలు మరింతగా ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైంది.