మోసపోయిన సంగీత దర్శకుడు.. తల్లి అంత్యక్రియలు అంటూ!
సింపథీని క్యాష్ చేసుకోవడానికి కొందరు మోసగాళ్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.;
సింపథీని క్యాష్ చేసుకోవడానికి కొందరు మోసగాళ్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలలో ఈ బాపతు మోసాలు బయటపడుతూనే ఉన్నాయి. సైబర్ నేరగాళ్ల వలకు సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా బలవుతున్నారు. ఇప్పుడు ఒక అరవ మోసగాడు సోషల్ మీడియాల్లో నకిలీ ప్రచారంతో ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ ని మోసం చేసాడు. కొంత డబ్బు తన ఫోన్ పేకు వచ్చాక, అతడు ఫోన్ ఎత్తడం మానేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే...
పాపులర్ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ పరిచయం అవసరం లేదు. ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడే కాదు, ధాతృత్వంలోను అతడు ఎప్పుడూ ముందుంటాడు. కానీ దురదృష్టవశాత్తు ఆన్‌లైన్ మోసానికి గురైన జీవీ రూ.20,000 రూపాయలు పోగొట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే... ఎక్స్ ఖాతాలో @prasannasathis అనే ప్రొఫైల్ పేరుతో ఒక నెటిజన్ విగత జీవిగా పడి ఉన్న వృద్ధురాలి ఫోటోను పోస్ట్ చేసి, ఆమె తన తల్లి అని తన తండ్రి పోయాక, కుటుంబాన్ని పోషించేందుకు ఎంతో కష్టపడిందని రాసాడు. అతడు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ను ట్యాగ్ చేసి, తన తల్లి అంత్యక్రియలు పూర్తి చేయడానికి ఆర్థిక సహాయం చేయాలని అభ్యర్థించాడు.
అయితే అతడి ధీనస్థితి నిజమని నమ్మిన జీవీ వెంటనే అతడికి 20వేల రూపాయలు ఫోన్ పేలో పంపించాడు. అయితే ఆ తర్వాత అసలు మోసం బయటపడింది. అదంతా ఫేక్.. అతడు ఎప్పుడో చనిపోయిన ఒక వృద్ధురాలి ఫోటోని సోషల్ మీడియాల్లో షేర్ చేసాడు. ప్రజల్ని నమ్మించేందుకు కట్టు కథను అల్లాడు. ఈ విషయాన్ని నెటిజనులు వెంటనే కనుగొన్నారు. ఈ ఫోటోగ్రాఫ్ గూగుల్ నుంచి సేకరించినది అని బయటపెట్టారు.
అయితే ఇలా ఫేక్ ఫోటోతో మోసం చేసిన వ్యక్తిని నిలదీసేందుకు జీవీ ప్రకాష్ ఆ తర్వాత అతడి ఫోన్ కు ట్రై చేసారట. కానీ అతడు ఫోన్ ఎత్తలేదు. దీంతో జరిగిన మోసం జీవీకి అర్థమైంది. ఇలాంటి మోసపూరిత వ్యక్తుల వల్ల నిజంగా ఆపదలో లేదా అవసరంలో ఉన్న వ్యక్తులు ఎలాంటి సహాయం లేకుండా నష్టపోతారు. ఆపదలో ఉన్నవారిని, కష్టంలో ఉన్నవారిని ఆదుకునేందుకు జీవీ ప్రకాష్ లాంటి వ్యక్తులు ఎప్పుడూ ముందుకు వస్తున్నారు. కానీ తప్పుడు సమాచారంతో మోసపూరితమైన వ్యక్తులు ఇలా చేయడం సమాజానికి హానికరం.
ఇలాంటి వ్యక్తులు విడిచిపెట్టకూడదు అంటూ ఆ వ్యక్తి చేసిన మోసాన్ని నివేదిస్తూ కొందరు దీనిని పోలీస్ శాఖకు ట్యాగ్ చేసారు. వెంటనే అతడిని పట్టుకుని శిక్షించాలని తమిళనాడు పోలీసులను నెటిజనులు అభ్యర్థించారు. ఆన్ లైన్ లో ఎవరినీ నమ్మి అనవసరంగా డబ్బు పోగొట్టుకోకూడదనడానికి ఇది కూడా ఒక చక్కని ఉదాహరణ.