గంటన్నర చూసి.. సంక్రాంతి రిజల్ట్ చెప్పేశాడు!

ఇంకా షూటింగ్ జరుగుతున్న టైమ్‌లోనే గంటన్నర కంటెంట్ చూసి ఇలా చెప్పడం చూస్తుంటే సినిమాపై ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది.

Update: 2026-09-10 14:27 GMT

'జనవరి 12 విడుదల' సినిమాకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. కానీ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ మాత్రం అప్పుడే రిజల్ట్ చెప్పేశాడు. సినిమా నుంచి గంటన్నర ఫుటేజ్ చూసి, సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ వస్తోందంటూ క్లారిటీ ఇచ్చాడు. నార్మల్ గా సినిమా పూర్తయ్యాక లేదా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఇలాంటి మాటలు ఎక్కువగా వినిపిస్తాయి. ఇంకా షూటింగ్ జరుగుతున్న టైమ్‌లోనే గంటన్నర కంటెంట్ చూసి ఇలా చెప్పడం చూస్తుంటే సినిమాపై ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది.



 


అనిల్ రావిపూడికి సంక్రాంతి బాగా కలిసొస్తోంది. 2025లో వెంకటేష్‌తో చేసిన సంక్రాంతికి వస్తున్నాం పెద్ద హిట్ అయింది. ఈ ఏడాది చిరంజీవితో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు కూడా అదే పండుగ సీజన్‌లో భారీ బాక్సాఫీస్ నెంబర్స్ చూసింది. అంతకుముందు ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు కూడా సంక్రాంతికే వచ్చి సక్సెస్ అయ్యాయి. అందుకే మళ్లీ జనవరి 12నే తన సినిమాకు డేట్‌గా పెట్టేశాడు.

ఈసారి అనిల్ దగ్గర వెంకటేష్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా ఉన్నాడు. ఇద్దరూ బావా బామ్మర్దులుగా కనిపించబోతున్నారు. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లు. టైటిల్ అనౌన్స్‌మెంట్‌ను కూడా రెగ్యులర్ వీడియోలా చేయకుండా అప్పుల అప్పారావు రిఫరెన్స్‌తో ఫన్‌గా ప్లాన్ చేశారు. సినిమా పేరు, రిలీజ్ డేట్ రెండూ ఒకటే కావడం కూడా అప్పుడే జనాల్లోకి వెళ్లిపోయింది.

కళ్యాణ్ రామ్‌తో అనిల్‌కు ఉన్న కనెక్షన్ ఇంకా పాతది. అనిల్ దర్శకుడిగా పరిచయమైన పటాస్‌ను నిర్మించింది కళ్యాణ్ రామే. ఆ సినిమా తర్వాత ఇద్దరూ హీరో, దర్శకుడిగా కలిసి పని చేయలేదు. మరోవైపు వెంకటేష్‌తో ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం చేసి, మన శంకర వరప్రసాద్ గారులో కూడా ఆయనను తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ ఇద్దరినీ ఒకే సినిమాలో పెట్టడం కొత్త కాంబినేషన్‌గా మారింది. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలిసి పూర్తి స్థాయి సినిమాలో నటించడం కూడా ఇదే మొదటిసారి.

జీవీ ప్రకాష్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గంటన్నర ఫుటేజ్ ఇప్పటికే ఆయన చూసే దశకు రావడం చూస్తే పనులు కూడా ఎంత స్పీడ్ గా జరుగుతున్నాయో చెప్పవచ్చు. మైసూరులో వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టిపై ఒక పాటను కూడా ఇటీవల షూట్ చేశారు. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తుండగా, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఇక 2027 సంక్రాంతి పోటీ కూడా గట్టిగానే ఉంది. జనవరి 13న చిరంజీవి కాకా, 14న రవితేజ శ్రీ విష్ణు సినిమా, శర్వానంద్ జార్జ్ క్రిష్ కూడా లైన్లో ఉన్నాయి.

Tags:    

Similar News