ఎప్ప‌టికైనా ఎన్టీఆర్ తో సినిమా చేస్తా

ఏదైనా రాసిపెట్టి ఉంటేనే జ‌రుగుతుంద‌ని పెద్ద‌లు ఊరికే అన‌లేదు. ఎవ‌రికి ఏది ఎప్పుడు ఎలా రాసిపెట్టి ఉంటే అప్పుడే వారి వ‌ద్ద‌కు వ‌స్తుంద‌నేది నిజం;

Update: 2025-09-06 16:30 GMT

ఏదైనా రాసిపెట్టి ఉంటేనే జ‌రుగుతుంద‌ని పెద్ద‌లు ఊరికే అన‌లేదు. ఎవ‌రికి ఏది ఎప్పుడు ఎలా రాసిపెట్టి ఉంటే అప్పుడే వారి వ‌ద్ద‌కు వ‌స్తుంద‌నేది నిజం. అదే వాస్త‌వం. సినీ ఇండ‌స్ట్రీ ఇందుకు మిన‌హాయింపేమీ కాదు. ఒక‌రితో చేయాల్సిన సినిమాలు మ‌రొక‌రితో చేయ‌డం, ఒక‌రి బ్యాన‌ర్ లో రూపొందాల్సిన సినిమాలు మ‌రో బ్యాన‌ర్ లో రూపొంద‌డం ఇలా చాలానే జ‌రుగుతూ ఉంటాయి.

మ‌హేష్ తో వ‌రుస‌గా మూడు సినిమాలు

ఒక‌ప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్ట‌ర్ గా ఉన్నగుణ‌శేఖ‌ర్ గ‌త కొన్ని సినిమాలుగా స‌రైన ఫామ్ లో లేరు. అప్ప‌ట్లో క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో పాటూ పౌరాణిక, హిస్టారిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీసి, త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయ‌న మ‌హేష్ తో వ‌రుస‌గా మూడు సినిమాలు చేసి రికార్డు క్రియేట్ చేశారు. అలాంటి గుణ శేఖ‌ర్ కెరీర్లో మైల్ స్టోన్ ఫిల్మ్ ఏంట‌ని అడిగితే ఎవ‌రైనా చెప్పే పేరు రుద్ర‌మదేవి.

ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క‌, రానా, అల్లు అర్జున్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఆ మూవీలో రుద్ర‌మ‌దేవి క్యారెక్ట‌ర్ త‌ర్వాత బాగా హైలైట్ అయిన క్యారెక్ట‌ర్ గోన గ‌న్నారెడ్డిదే. ఆ క్యారెక్ట‌ర్ ను అల్లు అర్జున్ చేశారు. అయితే రుద్ర‌మ‌దేవిలో అల్లు అర్జున్ చేసిన గోన గ‌న్నారెడ్డి ను చేయ‌డానికి మ‌హేష్ బాబు, ఎన్టీఆర్ కూడా ఇంట్రెస్ట్ చూపించార‌ని, కానీ ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోవ‌డంతో అల్లు అర్జున్ చేశార‌ని గుణ‌శేఖ‌ర్ గ‌తంలో ఓ సంద‌ర్భంలో చెప్పారు.

ఆ స్పూర్తితోనే రుద్ర‌మ‌దేవి తీశా

అస‌లు త‌న‌ను రుద్ర‌మ‌దేవి సినిమా తీసేలా ఇన్‌స్పైర్ చేసిన మూవీ బ్రేవ్ హార్ట్ అని, ఆ మూవీ చూశాకే రుద్ర‌మ‌దేవి చేయాల‌నిపించింద‌ని, కాక‌పోతే రుద్ర‌మ‌దేవి సినిమాను చేస్తే డైరెక్ట‌ర్ గా త‌న‌కు మంచి మార్కెట్, క్రేజ్ ఉన్న‌ప్పుడే చేయాల‌నుకున్నాన‌ని, ఒక్క‌డు త‌ర్వాత సౌత్ లో ఏ డైరెక్ట‌ర్ తీసుకోనంత రెమ్యూన‌రేష‌న్ ను త‌న‌కు ఆఫ‌ర్ చేశార‌ని, ఆ టైమ్ లోనే రుద్ర‌మ‌దేవి క‌థ‌ను ప్రొడ్యూస‌ర్ల‌కు చెప్పాన‌ని, వారికి క‌థ న‌చ్చిన‌ప్ప‌టికీ హీరో వెర్ష‌న్ లో క‌థ‌ను మార్చ‌మ‌ని చెప్ప‌డంతో కుద‌ర‌ద‌ని తానే సినిమాను ప్రొడ్యూస్ చేసిన‌ట్టు గుణ‌శేఖ‌ర్ చెప్పారు. ఒక్క‌డు సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత జూ. ఎన్టీఆర్ తో మూవీ చేద్దామ‌నుకున్నాన‌ని, ఆల్మోస్ట్ సెట్స్ పైకి వెళ్దామ‌నుకునే టైమ్ కు క‌థ స‌రిగా లేద‌నిపించి ఆగిపోయింద‌ని, ఫ్యూచ‌ర్ లో త‌ప్ప‌కుండా ఎన్టీఆర్ తో సినిమా చేస్తాన‌ని గుణ‌శేఖ‌ర్ అన్నారు.

Tags:    

Similar News