టాలీవుడ్ ఎదుగుదలపై పరభాషా చిత్రాల ప్రభావం!
ప్రస్తుత పోటీ ప్రపంచంలో తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిని అందుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న మార్పులను గమనించడం అనివార్యం.;
ప్రస్తుత పోటీ ప్రపంచంలో తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిని అందుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న మార్పులను గమనించడం అనివార్యం. హాలీవుడ్ , ఇతర విదేశీ భాషా చిత్రాల మేకింగ్ స్టైల్‌ను అధ్యయనం తో మన దర్శకులకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే విజువల్ ఎఫెక్ట్స్, కెమెరా యాంగిల్స్, స్టంట్ కొరియోగ్రఫీ వంటి విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడంతో తెలుగు సినిమా స్థాయి పెరిగింది. దీనిని అనుకరణగా కాకుండా తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి ఒక మెట్టుగా భావించాలి.
అయితే ఇతర భాషా చిత్రాల ప్రభావాన్ని అధ్యయనం చేసే క్రమంలో ఒరిజినాలిటీ దెబ్బతినే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. ఒక విదేశీ సినిమాలోని మేకింగ్ స్టైల్‌ను మన నేటివిటీకి అన్వయించకుండా ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తే ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడం కష్టమవుతుంది. కేవలం గ్రాండియర్ కోసం కథలోని ఆత్మను వదిలేస్తే అదొక ఖరీదైన బొమ్మలా మిగిలిపోతుంది. తెలుగు సినిమాకు ఉన్న ప్రత్యేకమైన భావోద్వేగాలు, సంస్కృతి దెబ్బతినకుండా టెక్నికల్ అంశాలను మాత్రమే స్వీకరించినప్పుడే ఒరిజినాలిటీ భద్రంగా ఉంటుంది.
రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకులు ఇతర దేశాల సినిమాలలోని సాంకేతికతను అధ్యయనం చేస్తూనే మన పురాణాలను, మట్టి కథలను ప్రపంచానికి చాటి చెప్పారు. `బాహుబలి`, `ఆర్ఆర్ఆర్` చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయంటే దానికి కారణం విదేశీ మేకింగ్ స్టైల్‌ను మన భారతీయతకు మేళవించడమే. ఇతర భాషల శైలిని అధ్యయనం చేయడం వల్ల దర్శకుల విజన్ విశాలమవుతుంది. ఇది తెలుగు సినిమాలను ప్రాంతీయ సరిహద్దులకే పరిమితం చేయకుండా గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతోంది.
అగ్ర హీరోలు సైతం ఇతర భాషా చిత్రాల్లోని నటనను, ఆహార్యాన్ని గమనిస్తూ తమను తాము అప్‌డేట్ చేసుకుంటున్నారు. ఇది వారి పర్ఫార్మెన్స్‌లో కొత్తదనాన్ని తెస్తుంది. ఒక జానర్ సినిమాను విభిన్నంగా ఎలా ప్రెజెంట్ చేయొచ్చో? తెలుసుకోవడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుంది. మేకింగ్ స్టైల్ అనేది ఒక టూల్ లాంటింది. దాన్ని దర్శకుడు ఎలా వాడుకుంటాడు? దానిపైనే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇతర భాషల నుండి స్ఫూర్తి పొందినా? మన నేల మీద పుట్టిన కథలే ఎప్పుడూ గొప్ప విజయాలను సాధిస్తాయి.
నిజానికి పరభాషా చిత్రాల ప్రభావం వల్ల తెలుగు సినిమా మేకింగ్ గత పదేళ్లలో విప్లవాత్మక మార్పులకు లోనైంది. మేకింగ్ స్టైల్‌ను అధ్యయనం చేయడం అంటే కాపీ కొట్టడం కాదు. ఒక సినిమాను ఎంత రిచ్‌గా, ఎంత ఎఫెక్టివ్‌గా తెరకెక్కించవచ్చో నేర్చుకోవడం. ఇలా నేర్చుకున్న అంశాలను స్థానిక కథలకు జోడించినప్పుడు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కలుగుతుంది. ఇది మన దర్శకుల సృజనాత్మకతకు పదును పెడుతుందే తప్ప, ఒరిజినాలిటీని నాశనం చేయదు.
ఇతర భాషా చిత్రాల అధ్యయనం తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి ఒక వారధిలా పని చేస్తుందని చెప్పొచ్చు. టెక్నాలజీ ప్రపంచ స్థాయిది అయినా? ఎమోషన్ మనదైనప్పుడే ఆ సినిమా క్లాసిక్‌గా నిలుస్తుంది. మన దర్శకులు, హీరోలు ఈ సమతుల్యతను పాటిస్తున్నంత కాలం తెలుగు సినిమా ఒరిజినాలిటీకి ఎలాంటి ముప్పు ఉండదన్నది విశ్లేషకుల మాట. ఇతర భాషల నుండి మేకింగ్ నేర్చుకుంటూ మన కథలతో ప్రపంచాన్ని జయించడమే టాలీవుడ్ ముందున్న లక్ష్యం.