సినిమా కాస్టింగ్‌లో ప్రాంతీయ ముద్రలు!
చిత్ర పరిశ్రమలో ప్రతిభకు పట్టం కడతారని భావిస్తారు. కానీ తెరవెనుక నటీనటుల ఎంపిక (కాస్టింగ్) విషయంలో అనేక సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు పనిచేస్తుంటాయి.
చిత్ర పరిశ్రమలో ప్రతిభకు పట్టం కడతారని భావిస్తారు. కానీ తెరవెనుక నటీనటుల ఎంపిక (కాస్టింగ్) విషయంలో అనేక సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు పనిచేస్తుంటాయి. తాజాగా దీనిపై ప్రముఖ నటి గిరిజా ఓక్ స్పందిస్తూ భారతీయ సినిమా రంగంలో నటీనటుల ప్రాంతీయ నేపథ్యం అన్నది కాస్టింగ్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో వివరించారు. పరిశ్రమలో ఇదొక విచిత్రమైన పర్‌సెప్షన్ గేమ్ లా సాగుతుందన్నారు. ఇది నటుల ప్రతిభను ఒక పరిధి దాటనివ్వకుండా అడ్డుకుంటుందని అభిప్రాయపడ్డారు. నటుడు లేదా నటి నిర్దిష్ట ప్రాంతానికి చెందినవారైతే? వారికి ఆ ప్రాంతీయ నేపథ్యం ఉన్న పాత్రలనే కేటాయించే ధోరణి పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తుందని గిరిజ పేర్కొన్నారు.
ఒక నిర్దిష్ట ప్రాంతానికి చెందిన నటీనటులను చూసినప్పుడు మేకర్స్ వారి మనస్సులో స్థిరమైన ముద్రను వేసుకుంటారన్నారు. దీనివల్ల వారు విభిన్నమైన పాత్రలు చేయగలరనే విషయాన్ని కాస్టింగ్ దర్శకులు తరచుగా విస్మరిస్తుంటారని ఆవేదన వ్యక్తం చేశారు.నటన అనేది భాషలు, ప్రాంతాల సరిహద్దులకు అతీతమైనదని ఒక నటుడి బాధ్యత ఎలాంటి పాత్రనైనా తనదైన శైలిలో పండించడమేనని గుర్తుచేశారు. కానీ దురదృష్టవశాత్తూ కేవలం ఒక వ్యక్తి రూపం లేదా వారి మాతృభాష ఆధారంగానే వారు ఈ పాత్రకు సరిపోతారని నిర్ణయించడం నటుల సృజనాత్మకతను దెబ్బతీస్తుందన్నారు.
పరిశ్రమలో ఎంతో అనుభవం ఉన్నప్పటికీ ఇప్పటికీ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనవలసి రావడం విచారక రమన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఓటీటీ వేదికల విస్తృతి .. పాన్-ఇండియా సినిమాల ట్రెండ్ కారణంగా కథలలో వైవిధ్యం పెరిగిన మాట వాస్తవమే. అయితే కథలు మారుతున్నా? నటీనటులను ఎంపిక చేసే మేకర్స్ మనస్తత్వంలో మాత్రం ఆశించిన స్థాయిలో మార్పు రావడం లేదని గిరిజ అభిప్రాయపడ్డారు. పాత్రల రూపకల్పనలో కొత్తదనం చూపిస్తున్న దర్శకులు, కాస్టింగ్ విషయంలో కూడా పాత పద్ధతులను పక్కనబెట్టి నటుల నైపుణ్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
ఇలాంటి పర్‌సెప్షన్ గేమ్ వల్ల పరిశ్రమలోని ఎంతోమంది ప్రతిభావంతులైన నటీనటులకు సరైన అవకాశాలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం బాహ్య రూపం .. ప్రాంతీయ ముద్రలను చూసి పాత్రలను పరిమి తం చేయడం వల్ల సరికొత్త నటనను చూసే అవకాశాన్ని ప్రేక్షకులు కూడా కోల్పోతున్నారని విశ్లేషించారు. నటీ నటులను వారి సహజ సిద్ధమైన ప్రతిభ ఆధారంగా మాత్రమే తూకం వేయాలని.. అప్పుడే నిజమైన చలనచిత్ర విప్లవం సాధ్యమవుతుందన్నారు. `తారే జమీన్ పర్`, `జవాన్` వంటి భారీ చిత్రాలలో నటించి తనదైన ముద్ర వేసుకున్న గిరిజా ఓక్ చేసిన ఈ వ్యాఖ్యలు పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.