మూవీ రివ్యూ : ఘాటి
తొలి చిత్రం 'గమ్యం' నుంచి విభిన్నమైన దారిలో.. ఆలోచన రేకెత్తించే సినిమాలు చేస్తూ సాగిపోతున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి.;
'ఘాటి' మూవీ రివ్యూ
నటీనటులు: అనుష్క శెట్టి- విక్రమ్ ప్రభు- జగపతి బాబు- రవీంద్ర విజయ్- చైతన్య రావు- జిషు సేన్ గుప్తా- లారిసా బోనెసి- జాన్ విజయ్- రాజు సుందరం తదితరులు
సంగీతం: సాగర్ నాగవెల్లి
ఛాయాగ్రహణం: మనోజ్ రెడ్డి కాటసాని
కథ: చింతకింది శ్రీనివాసరావు
మాటలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి- సాయిబాబు జాగర్లమూడి
స్క్రీన్ ప్లే- దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
తొలి చిత్రం 'గమ్యం' నుంచి విభిన్నమైన దారిలో.. ఆలోచన రేకెత్తించే సినిమాలు చేస్తూ సాగిపోతున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఇప్పుడతను అనుష్క ప్రధాన పాత్రలో రూపొందించిన 'ఘాటి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఇందులోనూ క్రిష్ ముద్ర కనిపించిందా? చాన్నాళ్ల తర్వాత తెరపై కనిపిస్తున్న అనుష్క మెప్పించిందా? తెలుసుకుందాం పదండి.
కథ:
శీలావతి (అనుష్క) ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దుల్లో గంజాయి మోత కూలీలుగా పని చేసే కుటుంబాలున్న ఊరికి చెందిన అమ్మాయి. వీళ్లను ఘాటీలు అని పిలుస్తారు. ఆ ప్రాంతంలో పండే మేలిమి జాతి గంజాయి అయిన శీలావతి అనే రకం పేరునే ఆమెకు పెడతారు. శీలావతికి తన బావ దేశిరాజు (విక్రమ్ ప్రభు) అంటే ప్రాణం. అతడికీ ఆమె అంటే ఇష్టం. ఘాటీలుగా పని చేసే వీళ్లిద్దరూ.. ఒక అనూహ్య పరిణామం తర్వాత ఆ పని మానేస్తారు. శీలావతి బస్ కండక్టర్ అయితే.. దేశిరాజు ల్యాబ్ టెక్నీషియన్ అవుతాడు. ఈ ప్రాంతంలో శీలావతి రకం గంజాయి వ్యాపారాన్ని గుప్పెట్లో పెట్టుకున్న అన్నదమ్ములు కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్).. కుందుల నాయుడు (చైతన్యరావు) తమకు అడ్డొచ్చిన వాళ్లందరినీ అంతం చేస్తుంటారు. అలాంటి సమయంలో శీలావతి-దేశిరాజు.. వారికి ఎదురు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఈ వైరం ఎందుకొచ్చింది.. దీని వల్ల శీలావతి-దేశిరాజుల జీవితాలు ఎలా మలుపు తిరిగాయి.. చివరికి ఈ పోరాటంలో ఎవరు గెలిచారు అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని ఇమేజ్ ఉన్న అనుష్క లాంటి కథానాయిక.. క్రిష్ లాంటి గొప్ప అభిరుచి ఉన్న దర్శకుడు.. తెలుగు ప్రేక్షకులు ఇంతకుముందెన్నడూ చూడని ఒక కొత్త నేపథ్యం ఉన్న కథ.. 'ఘాటి' మంచి అనుభూతిని పంచడానికి కావాల్సిన సెటప్ అంతా చాలా బాగా కుదిరింది. కానీ మంచి కథ ఎంచుకుని.. ఆ కథను మరో స్థాయికి తీసుకెళ్లగల నటిని పెట్టుకున్న క్రిష్.. తన మార్కు రసవత్తర కథనాన్ని మాత్రం దానికి జోడించలేకపోయాడు. కథా నేపథ్యంలో ఉన్న కొత్తదనం కథనంలో.. సన్నివేశాల్లో లేకపోవడం.. అనుష్క స్టామినాను పూర్తిగా ఉపయోగించుకోలేకపోవడం.. ఒక దశ దాటాక ఒక రొటీన్ రివెంజ్ డ్రామాను చూస్తున్న ఫీలింగ్ కలగడంతో 'ఘాటి' ప్రత్యేకమైన సినిమాగా నిలవలేకపోయింది. అక్కడక్కడా కొన్ని మెరుపులున్నప్పటికీ.. ఓవరాల్ గా 'ఘాటి' అంచనాలను అందుకునే చిత్రం కాదు.
అనుష్క సినిమా అంటే.. ఆమె కోసమే థియేటర్లకు వస్తారు ప్రేక్షకులు. కానీ ఇందులో ఆమెకు జోడీగా నటించిన తమిళ నటుడు విక్రమ్ ప్రభు పాత్ర ఉన్నంత ప్రభావవంతంగా అనుష్క పాత్ర లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. విక్రమ్ పాత్ర కనిపించినంత వరకు అనుష్క పాత్రలో మెరుపులే లేకపోయాయి. మనకు పెద్దగా పరిచయం లేని నటుడు ఎంత మెరిస్తే ఏముంది.. అనుష్క నుంచి ఏదో ఆశించే ప్రేక్షకులు మాత్రం సరిగా పండని తన పాత్ర.. అసహజంగా అనిపించే తన లుక్స్.. సాధారణంగా అనిపించే తన పెర్ఫామెన్స్ చూసి నిరాశకు గురి కావాల్సిందే. ఇక్కడే 'ఘాటి' గాడి తప్పింది. ఏ కథను ఎంచుకున్నా.. దాని లోతుల్లోకి వెళ్లి ప్రేక్షకులనూ అంతే ఇన్వాల్వ్ చేయించే క్రిష్.. ఈసారి మాత్రం తన మార్కు చూపించలేకపోయాడు. కథ ఆరంభం బాగున్నా.. ఒక దశ దాటాక రొటీన్ టెంప్లేట్లోకి వెళ్లిపోయే 'ఘాటి'.. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని రేకెత్తించలేకపోయింది. ప్రేక్షకుల అంచనాలను దాటి కొత్తగా ఏమీ అందించలేకపోయింది.
ఘాటి ఆరంభం మాత్రం ఆసక్తికరంగా ఉండి ఎన్నో ఆశలు రేకెత్తిస్తుంది. పశ్చిమ కనుమల్లో గంజాయి సాగు.. ఘాటీల సాయంతో వాటి రవాణా.. దీని ద్వారా జరిగే వందలు వేల కోట్ల వ్యాపారం చుట్టూ తిరిగే సన్నివేశాలు క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఆరంభ సన్నివేశాల తర్వాత కథనం కొంచెం నెమ్మదించినట్లు అనిపించినా.. ఇంటర్వెల్ ముంగిట ఓ అరగంట మంచి టెంపోతో సాగుతుంది. హీరో హీరోయిన్లు చేసే సీక్రెట్ మిషన్.. ఆ తర్వాత విలన్లతో వాళ్ల పోరాటం.. వాళ్లకు జరిగే అన్యాయం.. ఇలా విరామ సమయానికి 'ఘాటి' ఓ మోస్తరుగా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత మాత్రం క్రిష్ కథనంలో మ్యాజిక్ మిస్సయిపోయింది. హీరోయిన్ రివెంజ్.. రెవల్యూషనరీ మోడ్ లోకి వెళ్లిపోయాక ఏం జరుగుతుందో ఊహించడం కష్టమేమీ కాదు. యాక్షన్ ఎపిసోడ్ల వరకు బాగా అనిపించినా.. కొత్త సన్నివేశాలు లేక 'ఘాటి' ద్వితీయార్ధంలో భారంగా మారిపోతుంది. క్లైమాక్సులో కూడా పెద్దగా మెరుపులు లేకపోయాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్లో మినహాయిస్తే బలమైన ఎమోషన్ లేకపోయింది సినిమాలో. అనుష్క పాత్రకు హీరోయిక్ ఎలివేషన్ ఇవ్వడానికి ద్వితీయార్ధంలో గట్టి ప్రయత్నం జరిగినా.. ప్రథమార్ధంలో ఆ పాత్రకు సరైన పునాది పడకపోవడం.. ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడంతో 'ఘాటి' ప్రేక్షకులకు ఆశించిన అనుభూతినివ్వదు. కథా నేపథ్యంలో ఉన్న కొత్తదనం.. రెండు మూడు ఎపిసోడ్ల కోసం.. చాన్నాళ్ల తర్వాత అనుష్కను స్క్రీన్ మీద చూడడం కోసం అయితే 'ఘాటి'పై ఒక లుక్కేయొచ్చు కానీ.. అనుష్క-క్రిష్ కలయికలో అద్భుతాలను ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు.
నటీనటులు:
అనుష్క అభిమానులకు 'ఘాటి' మిశ్రమానుభూతినే కలిగిస్తుంది. చాన్నాళ్ల తర్వాత ఆమెను తెరపై చూడడం సంతోషాన్నిచ్చినా.. తనలో మునుపటి ఛార్మ్ మిస్సవడం.. ఆమె ఇమేజ్ ను మ్యాచ్ చేసేంత పవర్ అందులో లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. లుక్స్ పరంగా అనుష్కలో సహజత్వం కనిపించలేదు. ఒక్కో సన్నివేశంలో ఒక్కోలా కనిపించింది. ఆమె పెర్ఫామెన్స్ ఓకే అనిపిస్తంుది. ఇంటర్వెల్ ఎపిసోడ్.. ద్వితీయార్ధంలో ఒక యాక్షన్ సీక్వెన్సులో అనుష్క మెప్పించింది. తమిళ నటుడు విక్రమ్ ప్రభు దేశిరాజు పాత్రలో మెరిశాడు. ఆ పాత్ర ఉన్నంత వరకు తన ప్రాధాన్యాన్ని బాగానే చాటుకుంది. విలన్ పాత్రల్లో చైతన్యరావు.. రవీంద్ర విజయ్ ఆకట్టుకున్నారు. ఐతే చైతన్య రావు బాగా చేసినప్పటికీ.. ఇప్పటిదాకా సాఫ్ట్ రోల్స్ లో చూడడం వల్ల అతను చేసిన కుందుల నాయుడు పాత్రలో డోస్ ఎక్కువైపోయినట్లు అనిపిస్తుంది. జగపతిబాబు పాత్ర.. నటన ఏమంత ప్రత్యేకంగా లేవు. ఆ క్యారెక్టర్ ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. జాన్ విజయ్ కూడా అంతే. జిషు సేన్ గుప్తా.. లారెసా బోనెసి.. హరీష్ పేరడి.. వీటీవీ గణేష్.. వీళ్లంతా మామూలే.
సాంకేతిక వర్గం:
కొత్త సంగీత దర్శకుడు సాగర్ నాగవెల్లి పాటల విషయంలో నిరాశ పరిచాడు. రోలింగ్ టైటిల్స్ తర్వాత వచ్చే ఘాటి టైటిల్ సాంగ్ లో ఉన్న ఊపు.. సినిమాలో ఉన్న వాటిలో లేదు. నేపథ్య సంగీతం అక్కడక్కడా ఎఫెక్టివ్ గా అనిపిస్తుంది. కొన్ని చోట్ల మాత్రం మరీ లౌడ్ గా సాగింది. మనోజ్ రెడ్డి కాటసాని ఛాయాగ్రహణం బాగుంది. పశ్చిమ కనుమల నేపథ్యంలో విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. మంచి క్వాలిటీతో సినిమాను నిర్మించారు. సాయిమాధవ్ బుర్రా మాటలు బాగున్నాయి చింతకింది శ్రీనివాసరావు రాసిన కథ ఆసక్తి రేకెత్తించేదే. కానీ దానికి క్రిష్ తన మార్కు కథనం మాత్రం జోడించలేకపోయాడు. ఎప్పుడూ సటిల్ గా కథను నరేట్ చేస్తూ బలమైన భావోద్వేగాలతో మెప్పించే క్రిష్.. ఈసారి మాత్రం తనకు నప్పని లౌడ్ స్టయిల్లో కథనాన్ని నడిపించాడు. ఆయన్నుంచి ఆశించే కొత్తదనం కూడా మిస్సయింది.
చివరగా: ఘాటి.. గాడి తప్పింది
రేటింగ్- 2.25/5