అనుకున్నట్లే సెట్.. శర్వా కామెడీకి వైట్ల టచ్ పడితే..
శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో ‘జార్జ్ క్రిష్’ ప్రాజెక్ట్ అధికారికంగా సెట్స్ పైకి వెళ్లింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి 2027 బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నారు.
శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో ‘జార్జ్ క్రిష్’ ప్రాజెక్ట్ అధికారికంగా సెట్స్ పైకి వెళ్లింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి 2027 బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే పేరు పరిశీలనలో ఉంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో దాగున్న సహజమైన కామెడీ మ్యాచింగ్ సినీ వర్గాల్లో హైలెట్ అవుతోంది. ఈసారి కామెడీ యాంగిల్ డిఫరెంట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది.
శర్వానంద్ గత సినిమాలను గమనిస్తే వినోదానికి ఇచ్చిన ప్రాధాన్యత చాలా క్లియర్ గా కనిపిస్తుంది. రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్లుగా నిలిచాయి. ఆ ప్రాజెక్ట్‌లలో శర్వా చూపించిన ఎనర్జీ, క్యారెక్టర్ బిహేవియర్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఎలాంటి కథనైనా తనదైన సరదా టోన్‌తో చాలా ఈజీగా ముందుకు తీసుకెళ్లడంలో శర్వాకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.
శర్వానంద్ కామెడీ స్టైల్ రెగ్యులర్ కమెడియన్ల తరహాలో లౌడ్‌గా ఉండదు. సీరియస్ ముఖం పెట్టి సందర్భం నుంచే ఫన్ పుట్టించడం శర్వా ప్రత్యేకమైన పద్ధతి. పాత్రలోని అమాయకత్వం, వేగంగా ఇచ్చే రియాక్షన్లతోనే ఫన్ హైలెట్ అవుతుంది. ప్రత్యేకంగా కామెడీ ట్రాక్స్ అవసరం లేకుండానే, కథలో భాగంగా సాగే సన్నివేశాల్లో శర్వా టైమింగ్ చాలా చక్కగా సింక్ అవుతుంది.
మరోవైపు శ్రీను వైట్ల గేమ్ పూర్తిగా సిట్యువేషనల్ కామెడీపై ఆధారపడి నడుస్తుంది. ఢీ, రెడీ, వెంకీ, దూకుడు లాంటి కల్ట్ హిట్స్ లో కామెడీని ప్రత్యేకంగా చూపించరు. కథలో హీరోనే పరిస్థితులను సృష్టిస్తూ గందరగోళం తెస్తాడు. కన్‌ఫ్యూజన్ డ్రామాలు, ఎదుటి పాత్రలను తెలివిగా బురిడీ కొట్టించే ఎపిసోడ్స్ శ్రీను వైట్ల ప్రధాన బలం. పవర్ఫుల్ సన్నివేశాల్లో కూడా మంచి వినోదాన్ని రాబట్టడం దర్శకుడి ట్రేడ్‌మార్క్ స్టైల్.
ఈ క్రమంలో శర్వానంద్ టైమింగ్‌కు శ్రీను వైట్ల సీన్ డిజైనింగ్ తోడైతే అదిరిపోయే ఫ్లేవర్ వచ్చే అవకాశం ఉంది. శర్వా గత కొంతకాలంగా వేర్వేరు జానర్లలో విభిన్న ప్రయోగాలు చేస్తూ వచ్చాడు. అయినప్పటికీ ప్రేక్షకులు శర్వాలోని కామెడీ కోణాన్ని చూడటానికే ఎక్కువ ఇష్టపడుతుంటారు. అందుకే ‘జార్జ్ క్రిష్’ కథ శర్వా కామెడీ బలాన్ని పూర్తిస్థాయిలో వాడుకునే ప్రాజెక్ట్ కావచ్చనే నమ్మకం అందరిలో కనిపిస్తోంది. ఎలాంటి కాంబినేషన్ క్రేజ్ అయినా చివరకు స్క్రిప్ట్ బలం మీదే ఆధారపడి ఉంటుంది. శ్రీను వైట్ల రాసుకున్న సన్నివేశాలు తెరపై ఎంత కొత్తగా పండాయనేదే అసలు మ్యాటర్. కథ, కథనాలు సరిగ్గా సెట్ అయితే మాత్రం శ్రీను వైట్ల కమ్ బ్యాక్ ఇస్తాడని చెప్పవచ్చు.