వైజాగ్ బీచ్‌లో దుల్కర్ సల్మాన్ టీమ్‌కు ఫ్యాన్స్ ముప్పుతిప్పలు!
పరిస్థితి చేయిదాటిపోకుండా చూసేందుకు భద్రతా సిబ్బంది దుల్కర్ చుట్టూ మానవ హారంగా ఏర్పడి ఆయనను వ్యానిటీ వ్యాన్ వైపు తీసుకెళ్లారు.
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న తాజా చిత్రం `శ్రీ శ్రీ` షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్నం సముద్ర తీరంలో వేగంగా జరుగుతోంది. ఈ చిత్రీకరణ సందర్భంగా దుల్కర్‌ను చూసేందుకు, ఆయనతో ఫోటోలు దిగేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో సెట్స్‌కు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దుల్కర్ అభిమానుల తోపులాటతో సెట్స్‌లో హడావుడి నెలకొంది. దుల్కర్ సల్మాన్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ వాహనంలో షూటింగ్ స్పాట్‌కు చేరుకున్న సమయంలో, ఆయన్ని చూసేందుకు వచ్చిన మహిళా అభిమానులు ఒక్కసారిగా ముందుకు తోసుకొచ్చారు.
సెక్యూరిటీ సిబ్బంది వారిని నియంత్రించడానికి ప్రయత్నించినా? కొందరు మహిళా ఫ్యాన్స్ భద్రతా వలయాన్ని దాటుకుని దుల్కర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. `ప్లీజ్.. ఒక ఫోటో` అంటూ వారు కేకలు వేశారు. అభిమానుల ఈ హఠాత్ ప్రవర్తనతో దుల్కర్ పర్సనల్ టీమ్ .. సెక్యూరిటీ సిబ్బంది తీవ్ర అసహనానికి గురై, వారిని వెనక్కి లాగేందుకు ప్రయత్నించారు.
పరిస్థితి చేయిదాటిపోకుండా చూసేందుకు భద్రతా సిబ్బంది దుల్కర్ చుట్టూ మానవ హారంగా ఏర్పడి ఆయనను వ్యానిటీ వ్యాన్ వైపు తీసుకెళ్లారు. ఆ సమయంలో కూడా అభిమానులు `సర్.. సర్..` అంటూ సెల్ఫీల కోసం అభ్యర్థించడం కనిపించింది. రద్దీ సమయంలో తొలుత దుల్కర్ వారికి దూరంగా వెళ్లినా? ఆ తర్వాత వ్యానిటీ వ్యాన్ వద్ద అభిమానులను ఆప్యాయంగా పలకరించారు. ఫ్యాన్స్‌తో ఓపిగ్గా సెల్ఫీలు దిగడమే కాకుండా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని ఆంధ్ర సాంప్రదాయ పద్ధతిలో దుల్కర్‌ను శాలువాతో సత్కరించి తన అభిమానాన్ని చాటుకున్నారు.
వైజాగ్ సముద్ర తీరంలో దుల్కర్ సల్మాన్ - పూజా హెగ్డేలపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రబృందం చిత్రీక రిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్‌గా మారాయి. బీచ్ తీరంలో చిత్ర యూనిట్ మధ్య ఇద్దరు నటీనటులు నటిస్తున్న దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ వారం ప్రారంభంలోనే నటీనటులు విశాఖపట్నం చేరుకోగా.. మరికొన్ని రోజులు ఇక్కడే చిత్రీకరణ కొనసాగే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.
రవి నేలకుదిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న`శ్రీ శ్రీ` చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతి బాబు, దీక్షిత్ శెట్టి, రావు రమేష్, సచిన్ ఖేడేకర్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
అలాగే దుల్కర్ ..పవన్ సాదినేని దర్శకత్వంలో `ఆకాశంలో ఒక తార` అనే మరొక తెలుగు సినిమాలోనూ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని సందీప్ గుణ్ణం, రమ్యా గుణ్ణం సంయుక్తంగా లైట్‌బాక్స్ మీడియా పై నిర్మిస్తున్నారు. అన్ని పనులుపూర్తి చేసుకుని నవంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.