'గేమ్ ఛేంజర్' ఇష్యూ.. మాట్లాడి మళ్లీ తప్పు తోస్తారేంటి?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందిన గేమ్ ఛేంజర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆరు నెలలు దాటిపోయిన విషయం తెలిసిందే.;

Update: 2025-07-07 03:45 GMT

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందిన గేమ్ ఛేంజర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆరు నెలలు దాటిపోయిన విషయం తెలిసిందే. కానీ సోషల్ మీడియాలో ఆ సినిమా పేరు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటోంది. గేమ్ ఛేంజర్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతూనే ఉంటోంది.

అందుకు కారణం ఎప్పటికప్పుడు సినిమాపై ఎవరో ఒకరు స్పందించడం వల్లే. అయితే భారీ అంచనాలతో సంక్రాంతికి థియేటర్స్ లో రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్.. దారుణంగా నిరాశపరిచింది. డిజాస్టర్ టాక్ అందుకుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చేసిన మూవీ కావడంతో అటు సినీ ప్రియులు, ఇటు ఫ్యాన్స్ ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు.

కానీ వాటిని కనీసం అందుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు చరణ్ అప్ కమింగ్ మూవీస్ పై అంతా ఫోకస్ పెట్టారు. సరైన హిట్ సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. వెయిటింగ్ ఫర్ మూవీ అని చెబుతున్నారు. అలా గేమ్ ఛేంజర్ రిజల్ట్ ను చాలా మంది అభిమానులు పూర్తిగా మర్చిపోయారు. ఏం చేయలేమని ఊరుకున్నారు.

కానీ గేమ్ ఛేంజర్ నిర్మాతలు మాత్రం ఎప్పటికప్పుడు ఆ మూవీ కోసం మాట్లాడుతూనే ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సినిమాను నిర్మించగా.. ఆయన బ్రదర్స్ శిరీష్, లక్ష్మణ్ కూడా అందులో భాగస్వాములుగా ఉంటారు. రీసెంట్ గా శిరీష్.. ఓ ఇంటర్వ్యూలో ఏమన్నారో అందరికీ తెలిసిందే.

గేమ్‌ ఛేంజర్‌ విడుదలైన తర్వాత హీరో, దర్శకుడు కనీసం తమకు ఫోన్‌ చేయలేదని ఓ ఇంటర్వ్యూలో శిరీష్‌ వ్యాఖ్యానించడంతో.. అవి సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మాట్లాడటం సరికాదని మెగా అభిమానులంతా అసహనం వ్యక్తం చేశారు.

తమ హీరోకు డిజాస్టర్ దక్కితే.. తిరిగి ఇలా అంటున్నారని.. ఇంకోసారి ఆ విషయంపై మాట్లాడొద్దంటూ హెచ్చరించారు కూడా. దీంతో వెంటనే దిల్ రాజు, శిరీష్ రంగంలోకి దిగారు. నష్ట నివారణ చర్యలు చేపట్టారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే సారీ అని, అవి ఉద్దేశపూర్వకమైనవి కాదని స్పష్టం చేస్తూ లేఖ రిలీజ్ చేశారు శిరీష్.

బహిరంగ క్షమాపణలు చెబుతూ.. గేమ్ ఛేంజర్ షూటింగ్ సమయంలో రామ్ చరణ్ తన పూర్తి సమయాన్ని కేటాయించి, అన్ని విధాలా సహకరించారని అన్నారు. ఆ తర్వాత మరో వీడియో కూడా రిలీజ్ చేశారు. తాను అభిమానించే హీరోల్లో రామ్‌చరణ్‌ ఒకరని, ఆయనతో రిలేషన్‌ను పోగొట్టుకోవాలని అనుకోవట్లేదని చెప్పారు.

ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకోగలనని, తమ మధ్య ఉన్న స్నేహంతో మాట దొర్లానని మళ్లీ క్షమాపణలు చెప్పారు. చిరంజీవి గారు నాతో, దిల్‌ రాజుతో తరచూ మాట్లాడుతూ ఉంటారని, అలాంటి అనుబంధం ఉన్న వారిని అవమానించేంత మూర్ఖుడిని కాదని అన్నారు. అభిమానులు అర్థం చేసుకోవాలని కోరారు.

ఆ తర్వాత శిరీష్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని దిల్ రాజు తెలిపారు. శిరీష్‌ గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించిన పనులు పర్యవేక్షించలేదని, ఆయన మాటల వెనుక ఉద్దేశం అది కాదని అన్నారు. చరణ్‌తో శిరీష్‌ కూడా చాలా స్నేహంగా ఉంటారని, ఆయనపై వ్యాఖ్యలు చేసే ఉద్దేశం తమకు లేదని తెలిపారు.

కానీ మరో ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ చేయకుండా ఉండాల్సిందని మాట్లాడారు. ముఖ్యంగా సినిమా అగ్రిమెంట్ చేసే సమయంలో తన పాయింట్స్ కరెక్ట్గా పెట్టాల్సిందని అభిప్రాయపడ్డారు. కానీ, పెద్ద డైరెక్టర్ లతో చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ తప్పవని పేర్కొన్నారు. గేమ్ ఛేంజర్ తన మొదటి తప్పటడుగు అంటూ వ్యాఖ్యానించారు.

అయితే శిరీష్ వ్యాఖ్యల వివాదం రేగిన తర్వాత.. ఎప్పుడో జనవరిలో రిలీజైన గేమ్‌ ఛేంజర్‌ గురించి పదేపదే అడిగి చంపుకుతింటున్నారని అన్నారు దిల్ రాజు. సినిమా రిలీజై ఆరు నెలలు అయిపోయిందని, ప్రతిదాంట్లో గేమ్‌ ఛేంజర్‌ టాపిక్‌ తప్ప మరొకటి లేనే లేదని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు.

గేమ్ ఛేంజర్ డిజాస్టర్ సినిమానే అయినా పదే పదే ఇంటర్వ్యూల్లో ఎందుకు మాట్లాడుతున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. మీడియా ప్రతినిధులు తమ ఇంటర్వ్యూల్లో అడిగితే రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా అని అంటున్నారు. ఒక వేళ అడిగితే ఆ టాపిక్ మాట్లాడమని దాటవేయకుండా, ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

శిరీష్ వ్యాఖ్యలపై వివాదం చెలరేగాక కూడా మళ్లీ మాట్లాడుతూనే ఉన్నారని వీడియోస్ షేర్ చేస్తున్నారు. దీంతో దిల్ రాజు తీసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయని, కానీ గేమ్ ఛేంజర్ తోపాటు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినట్లు ఉందని అభిప్రాయపడుతున్నారు. పదే పదే మాట్లాడుతుంటే ఏదో ఉందని అనిపిస్తున్నట్లు చెబుతున్నారు.

శిరీష్, దిల్ రాజు వ్యాఖ్యలు చేయడం.. ఆ తర్వాత సారీ చెప్పడం చూస్తుంటే.. బ్యాక్ గ్రౌండ్ లో ఏమైనా జరుగుతుందా అని అనేక మంది అనుమానపడుతున్నారు. అదే విషయాన్ని సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మరేం జరుగుతుందో వారికే తెలియాలని అంటున్నారు. ఏదేమైనా గేమ్ ఛేంజర్ ఇష్యూ ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది.

Tags:    

Similar News