ఫెడరేషన్ సహాయ నిరాకరణ.. జానీ మాస్టార్ తక్షణ కర్తవ్యం?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డాన్సర్స్ అసోసియేషన్ - ఫిలిం ఫెడరేషన్ మధ్య చెలరేగిన వివాదం తీవ్రరూపం దాల్చింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డాన్సర్స్ అసోసియేషన్ - ఫిలిం ఫెడరేషన్ మధ్య చెలరేగిన వివాదం తీవ్రరూపం దాల్చింది. డాన్సర్స్ అసోసియేషన్ కార్యవర్గంలో తలెత్తిన విభేదాలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలు చివరకు ఫెడరేషన్ వర్సెస్ జానీ మాస్టర్ యుద్ధంగా మారాయి. కొరియోగ్రాఫర్ల మధ్య ఉన్న ఆధిపత్య పోరు.. యూనియన్ అంతర్గత ఎన్నికల నిర్వహణపై ఇరువర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది.
జానీ మాస్టర్‌పై సహాయ నిరాకరణ నిర్ణయం తీసుకున్న సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనీల్ మాట్లాడుతూ.. గడిచిన 10 రోజులుగా జానీ మాస్టర్‌కు ఎంతో భవిష్యత్తు ఉందని.. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని కోరినట్లు తెలిపారు. అందరూ ప్రశాంతంగా షూటింగ్‌లకు వెళ్లేలా జాయింట్ లేబర్ కమిషనర్ సమక్షంలో ఒక పరిష్కారానికి వద్దామని చెప్పినా ఆయన వినలేదని ఆరోపించారు. ``నాకు ఫెడరేషనే అవసరం లేదు... నా నిర్ణయమే శాసనం`` అనే రీతిలో జానీ మాస్టర్ వ్యవహరించారని మండిపడ్డారు.
ఫెడరేషన్ నిబంధనలు, నాయకత్వాన్ని ధిక్కరించేలా ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఫెడరేషన్ , యూనియన్లకు విలువ ఉండదని అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇది ఒక్కరి నిర్ణయం కాదని, 72 మంది కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా చర్చించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని ప్రకటించారు. దీని ప్రకారం జానీ మాస్టర్ దేశవ్యాప్తంగా ఏ సినిమాకు వర్క్ చేసినా...ఫెడరేషన్‌లోని 23 క్రాఫ్ట్స్‌కు చెందిన ఏ కార్మికుడు కూడా ఆయన షూటింగ్‌లలో పాల్గొనబోరని తేల్చి చెప్పారు.
యూనియన్ సభ్యులకు లేదా ప్రసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లపై అభియోగాలు వచ్చినప్పుడు లేదా న్యాయం జరగనప్పుడు జోక్యం చేసుకునే పూర్తి హక్కు ఫెడరేషన్‌కు ఉందని అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. కార్మికుల వేతనాలు పెంచాలన్నా... ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వంతో మాట్లాడాలన్నా ఫెడరేషన్ ముందే ఉంటుందని గుర్తుచేశారు. ఫెడరేషన్‌కు అనుబంధంగానే ప్రతీ యూనియన్ పనిచేయాల్సి ఉంటుందని.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని వివరించారు.
మరోవైపు ఫెడరేషన్ ఆరోపణలపై జానీ మాస్టర్ తీవ్రంగా స్పందించారు. డాన్సర్స్ అసోసియేషన్‌లో కొందరు చేసిన అవినీతిని ప్రశ్నించినందుకే తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆయన లేఖ ద్వారా ఆరోపించారు. ఫెడరేషన్ అవినీతిపరులను కాపాడుతోందని... మహిళా అధ్యక్షురాలైన సుమలతపై లింగ వివక్ష చూపుతున్నారని విమర్శించారు. నిర్మాతల డబ్బు దుర్వినియోగం కాకుండా పోరాడుతున్న తమకు నిర్మాతలు మద్దతుగా నిలవాలని కోరగా... ప్రస్తుతం ఈ అంశం టాలీవుడ్‌లో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ఫెడరేషన్ సహాయ నిరాకరణ నేపథ్యంలో జానీ మాస్టార్ ఒక మెట్టు దిగి వచ్చి సినీపెద్దల్ని సంప్రదించి పరిష్కారం వెతుకుతారా? అన్నది వేచి చూడాలి.