రీ రిలీజ్‌ ప్లాన్‌ చేసే వారికి దాస్‌ హెచ్చరిక..!

విశ్వక్ సేన్ హీరోగా గుర్తింపు దక్కించుకున్న సినిమా 'ఫలక్‌నుమా దాస్‌'. మలయాళంలో సూపర్‌ హిట్ అయిన అంగమలీ డైరీస్ కి రీమేక్ గా ఫలక్‌నుమా దాస్‌ను విశ్వక్‌ సేన్‌ సొంతంగా నిర్మించిన విషయం తెల్సిందే.;

Update: 2025-04-13 18:30 GMT

ఇతర భాషలతో పోల్చితే టాలీవుడ్‌లో రీ రిలీజ్‌లు చాలా ఎక్కువ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత నెలలో ప్రముఖ హీరోల సినిమాలు మూడు నాలుగు రీ రిలీజ్ అయ్యాయి. అంతకు ముందు నెలలోనూ మూడు పెద్ద సినిమాలు రీ రిలీజ్ అయిన విషయం తెల్సిందే. ఇటీవల కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రీ రిలీజ్ పేరుతో పాత సినిమాలు వస్తూనే ఉన్నాయి. రీ రిలీజ్ సినిమాలకు టాలీవుడ్‌లో మంచి స్పందన దక్కుతోంది. ముఖ్యంగా స్టార్‌ హీరోల సినిమాలు, అప్పట్లో కల్ట్‌ హిట్స్‌గా నిలిచిన సినిమాలకు రీ రిలీజ్ సమయంలోనూ మంచి స్పందన దక్కుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ తాజాగా వచ్చిన ఒక సినిమా నిరాశ పరిచింది.

విశ్వక్ సేన్ హీరోగా గుర్తింపు దక్కించుకున్న సినిమా 'ఫలక్‌నుమా దాస్‌'. మలయాళంలో సూపర్‌ హిట్ అయిన అంగమలీ డైరీస్ కి రీమేక్ గా ఫలక్‌నుమా దాస్‌ను విశ్వక్‌ సేన్‌ సొంతంగా నిర్మించిన విషయం తెల్సిందే. అప్పట్లో సినిమా కమర్షియల్‌గా భారీ విజయాన్ని సొంతం చేసుకోలేక పోయినా ఆ తర్వాత సినిమా గురించి సోషల్‌ మీడియాలో ఎక్కువగా ప్రచారం జరిగింది. విశ్వక్‌ సేన్‌ ఆ తర్వాత చేసిని సినిమాలు హిట్ కావడంతో ఫలక్‌నుమా దాస్‌ సినిమా గురించి మరింతగా చర్చ జరగడంతో పాటు, ఓటీటీలో, యూట్యూబ్‌, టీవీల్లో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. దాంతో మేకర్స్ రీ రిలీజ్‌ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుందని అనుకున్నారు.

దాదాపు రెండు మూడు వారాలుగా సినిమా రీ రిలీజ్ గురించి సోషల్ మీడియాలో పీఆర్ టీం హడావుడి చేసే ప్రయత్నం చేశారు. కానీ పెద్దగా పబ్లిసిటీ దక్కలేదు. విశ్వక్‌ సేన్‌ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. ముఖ్యంగా ఆయన నటించిన లైలా సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో విశ్వక్ సేన్‌ సినిమాలు అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి కనబడటం లేదు. ఇలాంటి సమయంలో రీ రిలీజ్ అయిన ఫలక్‌నుమా దాస్ పై తీవ్రంగా ప్రభావం చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా స్క్రీనింగ్‌ చేయాలని భావించిన ఫలక్‌నుమా దాస్ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. మినిమం వసూళ్లను సైతం సొంతం చేసుకోలేక పోయింది.

ఏ రేటెడ్‌ సినిమాలకు యూత్‌ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తుందని విశ్వక్‌ సేన్ అండ్‌ టీం భావించారేమో. కానీ సినిమా యూనిట్‌ సభ్యుల అంచనాలను తలకిందులు చేస్తూ సినిమాకు జనాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. చాలా చోట్ల షో లు క్యాన్సల్‌ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఫలక్‌నుమా దాస్‌ రీ రిలీజ్ ఫ్లాప్ కావడంతో ముందు ముందు సినిమాలను రీ రిలీజ్ చేయాలి అనుకుంటున్న వారు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా సినిమాలకు మినిమం బజ్ క్రియేట్‌ అయ్యేలా పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఉంది. పబ్లిసిటీ లేకుండానే రీ రిలీజ్ చేస్తే సూపర్‌ హిట్‌ కావడానికి పెద్ద హీరోల సినిమాలు కావు కనుక చిన్న ఫిల్మ్‌ మేకర్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఫలక్‌నుమా దాస్ రీ రిలీజ్ అనేది కచ్చితంగా ఇతర నిర్మాతలకు హెచ్చరిక అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News