జోరు పెంచిన దుల్కర్.. టాలీవుడ్ కే పరిమితం అవుతారా?
ఇలా ఒక సినిమాలో ఇంకా నటిస్తుండగానే మరో తెలుగు సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దుల్కర్ సల్మాన్..
ఇటీవల కాలంలో హీరోలు భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా వైడ్ మార్కెట్ పెంచుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగులో సినిమాలు చేసి ప్రపంచ స్థాయి గుర్తింపును అందుకోవాలని పరితపించే సెలబ్రిటీలు కూడా లేకపోలేదు. ఈ క్రమంలోనే మాలీవుడ్లో స్టార్ హీరో తనయుడిగా, స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన హోదాను దక్కించుకున్న ఒక హీరో ఇప్పుడు వరుసగా తెలుగులోనే సినిమాలు చేస్తూ తెలుగేతర నటుడిగా మంచి విజయాన్ని అందుకుంటున్నారు. అంతేకాదు వరుసగా ఇక్కడే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నేపథ్యంలో.. ఆయన ఎంచుకుంటున్న కథలను, పెంచిన స్పీడును చూసి ఈయన టాలీవుడ్ కి పరిమితం అవుతారా అనే కామెంట్లు కూడా నెటిజన్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఆయన ఎవరో కాదు దుల్కర్ సల్మాన్. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన దుల్కర్ సల్మాన్ తొలిసారి 2018లో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన మహానటి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇందులో జెమినీ గణేషన్ పాత్ర పోషించి తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్నారు దుల్కర్ సల్మాన్. ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో తొలిసారి నేరుగా హీరోగా తెలుగులో సీతారామం అనే సినిమా చేసి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇక ఆ తర్వాత 2024 లో వచ్చిన లక్కీ భాస్కర్ సినిమాతో కూడా మరో విజయాన్ని దక్కించుకున్నారు .
ఇక ఇప్పుడు DQ 41 పేరుతో తెలుగులో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా.. నూతన దర్శకుడు రవి నెలకుడితి దర్శకత్వంలో బహు భాషా రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు ,తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.
ఇలా ఒక సినిమాలో ఇంకా నటిస్తుండగానే మరో తెలుగు సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దుల్కర్ సల్మాన్.. కోర్ట్ సినిమా డైరెక్టర్ జగదీష్ దర్శకత్వంలో నాని, కాస్ట్యూమ్ డిజైనర్ తిపిర్నేని ప్రశాంతి సంయుక్తంగా స్థాపించిన వాల్ పోస్టర్ బ్యానర్లో దుల్కర్ సల్మాన్ హీరోగా ఒక సినిమా చేస్తుండగా.. మరొకటి అదే బ్యానర్ కింద దండోరా దర్శకుడు తో మరో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. మొత్తానికైతే వరుసగా తెలుగులోనే దుల్కర్ సినిమాలు ఫైనల్ చేస్తుండడంతో ఇక మాలీవుడ్ కి గుడ్ బాయ్ చెప్పేసి టాలీవుడ్ లోనే స్థిరపడిపోనున్నారా అనే కామెంట్లు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడాల్సి ఉంది.