దుల్కర్ లగ్జరీ కార్ల ఇష్యూ.. 4 గంటలపాటు ఏం అడిగారు?
మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ పేరు మరోసారి లగ్జరీ కార్ల కేసులో వార్తల్లోకి వచ్చింది. కాస్ట్లీ ఎస్ యూవీల స్మగ్లింగ్ కేసులో భాగంగా కొచ్చిలోని కస్టమ్స్ కమిషనరేట్ కార్యాలయానికి హాజరైన దుల్కర్ ను అధికారులు సుమారు నాలుగు గంటలపాటు విచారించారు.
మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ పేరు మరోసారి లగ్జరీ కార్ల కేసులో వార్తల్లోకి వచ్చింది. కాస్ట్లీ ఎస్ యూవీల స్మగ్లింగ్ కేసులో భాగంగా కొచ్చిలోని కస్టమ్స్ కమిషనరేట్ కార్యాలయానికి హాజరైన దుల్కర్ ను అధికారులు సుమారు నాలుగు గంటలపాటు విచారించారు. ఈ సందర్భంగా ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ కేసు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆ వ్యవహారానికి గత ఏడాది ప్రారంభమైన 'ఆపరేషన్ నుమ్ ఖోర్' దర్యాప్తుతో లింక్ ఉంది. భూటాన్ ద్వారా కాస్ట్లీ లగ్జరీ వెహికల్స్ ను ఫేక్ డాక్యుమెంట్స్ తో భారత్ లోకి తీసుకొచ్చి, కస్టమ్స్ డ్యూటీ, ఇతర టాక్సులు చెల్లించకుండా విక్రయిస్తున్నారన్న సమాచారంతో కస్టమ్స్ అధికారులు దేశవ్యాప్తంగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా పలువురు ప్రముఖుల నివాసాల్లో సోదాలు నిర్వహించగా, దుల్కర్ సల్మాన్ ఇంటిలో కూడా తనిఖీలు చేశారు.
ఆ సమయంలో దుల్కర్ సల్మాన్ కు చెందిన కొన్ని లగ్జరీ వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన అసలు డాక్యుమెంట్స్ ను సమర్పించాలని కూడా సూచించారు. ఇప్పుడు అదే కేసు దర్యాప్తులో భాగంగా ఆయనను మరోసారి విచారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న వాహనాలతో పాటు, ఆయన వద్ద ఉన్న ఇతర ఖరీదైన కార్ల వివరాలపై కూడా అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.
దర్యాప్తు ప్రకారం, భూటాన్ ఆర్మీ వినియోగం నుంచి తొలగించిన కొన్ని ఖరీదైన వాహనాలను అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఏజెంట్లు, నకిలీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ సాయంతో భారత్ లోకి అక్రమంగా తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఆ వాహనాలను హిమాచల్ ప్రదేశ్ మార్గంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించి, సినీ ప్రముఖులు, బిజినెస్ మ్యాన్లకు అమ్మిన్టట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
మొత్తం వ్యవహారంలో భారీగా కస్టమ్స్ డ్యూటీ, ఆదాయపు పన్ను, జీఎస్టీ ఎగవేత జరిగి ఉండొచ్చని ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఆరోపణలను దుల్కర్ సల్మాన్ ఇప్పటికే ఖండించారు. తాను కొనుగోలు చేసిన ల్యాండ్ రోవర్ వెహికల్ పూర్తిగా చట్టబద్ధంగానే తీసుకున్నానని, దానికి సంబంధించిన కస్టమ్స్ క్లియరెన్స్, ఇన్వాయిస్ సహా అన్ని పేపర్స్ తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఆ అంశంపై ఆయన కేరళ హైకోర్టును కూడా ఆశ్రయించారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇక కేసులో దుల్కర్ ఒక్కరే కాకుండా మరికొందరిని కూడా అధికారులు విచారించినట్లు సమాచారం. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పలు లగ్జరీ వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, స్మగ్లింగ్ నెట్వర్క్ కు సంబంధించిన పలువురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరికొంత మంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం దుల్కర్ పై ఎలాంటి నేరం నిర్ధరణ కాలేదు. కస్టమ్స్ అధికారులు సేకరిస్తున్న ఆధారాలు, దర్యాప్తు ఆధారంగానే కేసులో తదుపరి చర్యలు ఉండనున్నాయి. అందుకే నాలుగు గంటలపాటు సాగిన విచారణ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.