డోంట్ స్లీప్.. అప్పుడే బిగ్ టాస్క్ కంప్లీట్ అయిపోయిందా?
చౌర్య పాఠం సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఇంద్ర రామ్ డోంట్ స్లీప్ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఆయన కళ్లకు బ్యాండేజ్ తో కనిపించడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
టాలీవుడ్ లో కొత్త తరహా సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న డోంట్ స్లీప్ మూవీ ఇప్పుడు సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా చూడని కాన్సెప్ట్ తో ఆ చిత్రం తెరకెక్కుతోందని మేకర్స్ చెబుతుండటంతో మొదటి నుంచే అంచనాలు పెరిగాయి. రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది. ముఖ్యంగా ఆ మూవీ షూటింగ్‌ను కేవలం మూడు నెలల్లో పూర్తి చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఆ చిత్రంతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షామ్ దత్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఉప్పెన, విరూపాక్ష, తండేల్ వంటి చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేసిన ఆయన, విజువల్స్ విషయంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు దర్శకుడిగా తన తొలి ప్రయత్నాన్ని సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో చేయడం విశేషంగా మారింది. టెక్నికల్ గా మంచి అవగాహన ఉన్న వ్యక్తి కావడంతో, డోంట్ స్లీప్ విజువల్ ట్రీట్‌గా ఉండబోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
చౌర్య పాఠం సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఇంద్ర రామ్ డోంట్ స్లీప్ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఆయన కళ్లకు బ్యాండేజ్ తో కనిపించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు నటుడు రవీంద్ర విజయ్ గన్ తో వెంటపడుతున్నట్లుగా చూపించడం కథలో సస్పెన్స్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని సూచిస్తోంది. మంచు పర్వతాల మధ్య సాగే ఛేజింగ్ విజువల్ పోస్టర్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
సినిమా కథ భ్రమ, వాస్తవం మధ్య జరిగే మానసిక సంఘర్షణ చుట్టూ తిరుగుతుందనే అభిప్రాయం పోస్టర్ చూస్తే కలుగుతోంది. డోంట్ స్లీప్ అనే టైటిల్ కే తగ్గట్టుగా నిద్ర, మానసిక ఒత్తిడి, భయం వంటి అంశాలను కథలో ప్రధానంగా చూపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇది నార్మల్ కమర్షియల్ సినిమా కాకుండా, ప్రేక్షకులను ఆలోచింపజేసే థ్రిల్లర్ గా ఉండొచ్చని అంతా భావిస్తున్నారు.
సినిమా షూటింగ్ ను హైదరాబాద్, విశాఖపట్నం, కేరళ, నేపాల్, లడఖ్ వంటి విభిన్న లొకేషన్లలో చిత్రీకరించారు. ముఖ్యంగా లడఖ్, నేపాల్ నేపథ్యంలో తీసిన సన్నివేశాలు సినిమాకు కొత్త విజువల్ ఫీల్ ఇవ్వనున్నాయని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా మొత్తం షూటింగ్ ను మూడు నెలల్లో పూర్తి చేయడం మేకర్స్ ప్లానింగ్ ను తెలియజేస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఇక టెక్నికల్ టీమ్ కూడా సినిమాకు మరో బలంగా కనిపిస్తోంది. పుష్ప ఫేమ్ మోనిక రామకృష్ణ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ హర్షన్ సంగీతం అందిస్తుండగా, సజీర్, లూనా కథను రూపొందించారు. మంచి ఎక్స్పీరియెన్స్డ్ టీమ్ పనిచేయడంతో సినిమా క్వాలిటీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో డోంట్ స్లీప్ టీజర్, ట్రైలర్ పై కూడా ఆసక్తి పెరుగుతోంది. ఏదేమైనా సినిమాటోగ్రాఫర్ గా టాలీవుడ్ లో ఇప్పటికే తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న షామ్ దత్, దర్శకుడిగా కూడా అదే రేంజ్ మ్యాజిక్ చేస్తారా అనే ఆసక్తి ఇప్పుడు నెలకొంది. కొత్త కాన్సెప్ట్, స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్, థ్రిల్లింగ్ విజువల్స్ తో వస్తున్న ఆ చిత్రం.. ఎలా ఉంటుందో వేచి చూడాలి.