పాన్ ఇండియా స్టార్ ని తయారు చేసే కథలు కావాలి!
పాన్ ఇండియా ఇమేజ్ అనేది కేవలం హీరో స్టార్డమ్ వల్ల మాత్రమే రాదు. కథలో ఉండే యూనివర్శల్ ఎమోషన్స్ వల్ల వస్తుంది.
ప్రస్తుతం ఎక్కడ చూసినా పాన్ ఇండియా జపమే వినిపిస్తోంది. ప్రతి కథానాయకుడు మార్కెట్‌ను దేశవ్యాప్తంగా విస్తరించుకోవాలని.. సరిహద్దులు దాటి ప్రేక్షకులను అలరించాలని ఆరాటపడుతున్నాడు. అయితే ఇదే సమయంలో చాలామంది దర్శకులు తమ ప్రాజెక్ట్ కోసం పాన్ ఇండియా స్టార్ కావాలని కోరుకోవడం పరిపాటిగా మారింది. కానీ దర్శకుల్లో ఈ ఆలోచనా సరళి మారాల్సిన అవసరం ఉంది. `నాకు పాన్ ఇండియా హీరో కావాలి` అని కోరుకోవడం పక్కనబెట్టి ` ఏ హీరోనైనా పాన్ ఇండియా స్టార్‌గా మార్చగలిగే కథ నా వద్ద ఉంది` అనే నమ్మకంతో దర్శకులు ముందడుగు వేయాలి.
కథే పాన్ ఇండియా ఇంధనం
పాన్ ఇండియా ఇమేజ్ అనేది కేవలం హీరో స్టార్డమ్ వల్ల మాత్రమే రాదు. కథలో ఉండే యూనివర్శల్ ఎమోషన్స్ వల్ల వస్తుంది. రాముడు, భీముడు, కాంతార, పుష్ప వంటి పాత్రలు ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ అవ్వడానికి కారణం ఆయా కథల్లోని ఆత్మ. ప్రాంతీయ సరిహద్దులను చెరిపేసే సత్తా కథాబలానికి మాత్రమే ఉంటుంది. సగటు హీరోను సైతం గ్లోబల్ స్థాయిలో నిలబెట్టే శక్తివంతమైన స్క్రిప్ట్‌లను రూపొందించడంలోనే దర్శకుడి అసలైన ప్రతిభ దాగి ఉంటుంది.
ఆలోచనా విధానంలో మార్పు రావాలి
ఇప్పటి వరకు చాలామంది దర్శకులు బిగ్ స్టార్స్ కాల్షీట్స్ వస్తేనే పెద్ద బడ్జెట్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ సాధ్యమవుతుందని భావిస్తూ వచ్చారు. కానీ వర్తమాన సినిమా ట్రెండ్స్ ఈ సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. స్టార్ హీరో లేకపోయినా? కథలో దమ్ముంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి దర్శకులు తమ దృష్టిని స్టార్‌డమ్‌పై కాకుండా అన్ని వర్గాల, భాషల ప్రేక్షకులను కట్టిపడేసే యూనిక్ కథనాలను సిద్ధం చేసుకోవడంపై పెట్టాలి.
హీరోను స్టార్ గా మార్చే మ్యాజిక్
ఒక నటుడికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడం అనేది దర్శకుడి చేతుల్లోనే ఉంటుంది. కథలో పాత్రల డిజైన్, విజువల్ గ్రాండియర్, నటుడి నుంచి రాబట్టుకునే నటన.. ఇవే ఆ హీరో స్థాయిని పెంచుతాయి. ఒక నటుడు పాన్ ఇండియా హీరోగా మారాలంటే అతడికి అలాంటి పాత్ర, కథ దక్కాలి. ఆ దిశగా దర్శకులు ఆలోచించి కథలు రాసినప్పుడు ఏ ప్రాంతీయ హీరో అయినా ? రాత్రికి రాత్రే దేశం మెచ్చే పాన్ ఇండియా స్టార్‌గా అవతరిస్తాడు.
రూట్ లెవల్ ఎమోషన్స్ - గ్లోబల్ రీచ్
హాలీవుడ్ స్థాయి టెక్నాలజీని వాడితేనే పాన్ ఇండియా కాదని ఇటీవలి కాలంలో రుజువైంది. మన నేల తల్లి వాసనలు, సంస్కృతి, మూలాల్లోని డ్రామా, బలమైన ఎమోషన్స్‌ను నమ్ముకుని రాసే కథలే ఎక్కువమందికి చేరువ వుతున్నాయి. భయం, ప్రేమ, పగ, ఆత్మగౌరవం వంటి మానవ భావోద్వేగాలు ప్రపంచంలో ఏ భాషకైనా ఒక్కటే. మన ప్రాంతీయ కథలకు అంతర్జాతీయ మేకింగ్ ప్రామాణికాలను జోడించి రాసే కథలే నూతన పాన్ ఇండియా హీరోలను తయారు చేస్తాయి.
కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టే సమయం
ఇకనైనా పరిశ్రమ పాన్ ఇండియా స్టార్స్ కావాలి అనే మూస ధోరణి నుంచి బయటకు రావాలి. స్టార్స్ వల్ల కథలు రావడం కాదు.. కథల వల్లే స్టార్స్ పుట్టుకొస్తారు అనే సత్యాన్ని దర్శకులు గుర్తించాలి. ప్రతీ ఒక్క దర్శకుడు సాధారణ హీరోను అంతర్జాతీయ వేదికపై మెరిపించగల సత్తా ఉన్న కథలను సిద్ధం చేసుకున్నప్పుడే భారతీయ సినిమా మరిన్ని అద్భుతమైన విజువల్ వండర్స్‌ను.. నూతన సూపర్ స్టార్లను ప్రపంచానికి పరిచయం చేయగలుగుతుంది.